– హద్దులు దాటుతున్న అక్రమార్కులు
– కబ్జాలకు గురవుతున్న శిఖం భూములు
– పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
నవతెలంగాణ-లక్షెట్టిపేట
మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటలు రానురాను కనుమరుగవుతున్నాయి. హద్దులు దాటి శిఖం భూములను రియాల్టర్లు దర్జాగా కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పలుచోట్ల చిన్నచిన్న కుంటలు, మత్తడి కాలువలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. శిఖం భూములు ఆక్రమణలకు గురవుతుంటే అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీని ఫలితంగా మండలంలోని ఇటిక్యాల చెరువు, బొట్లకుంట చెరువు, మంగలి కుంటలు అక్రమణాలకు గురై ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. అక్రమార్కులు శిఖం భూములను ఆక్రమించుకోవడమే కాకుండా వారి పేరున పట్టా చేసుకోవడం, వాటిని ఫ్లాట్స్‌గా చేసి అమ్ముకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో 12 చెరువులు 25 కుంటలు ఉన్నాయి. వీటికి హద్దురాళ్ళు లేకపోవడంతో చెరువులు, కుంటలు అక్రమార్కులు కబ్జా చేయడంతో విస్తీర్ణం తగ్గిపోతోంది.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతారు
ఈ నెల 13న కలెక్టర్ కుమార్ దీపక్ ఇటిక్యాల చెరువును పరిశీలించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని, సమీప బొట్లకుంట చెరువు విస్తీర్ణం ప్రకారం కొలతలు వేయాలని మున్సిపల్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల చెరువు నుంచి ప్రవహించే కాలువలను పరీక్షించి ఎఫ్‌టీఎల్ లెవెల్‌ను గుర్తించి ట్రెంచ్ వేస్తామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువు ఆక్రమణకు గురి అయిన తీరును అధికారులు పరిశీలించారు. ఇటిక్యాల చెరువు శివారులో మొరం పోసి ఆక్రమణకు గురి అయిన ప్రదేశాలను గుర్తించి చెరువు సరిహద్దులను నిర్దేశిస్తామని తెలిపారు. ఇటిక్యాల చెరువు పంట కాలువలను పరిశీలించారు. కాలువలను ఆక్రమించుకున్న తీరును పరిశీలించి పంట కాలువల మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. అనంతరం నేషనల్ హైవే పక్కన ఉన్న ఇటిక్యాల చెరువును పరిశీలించగా కొందరు చెరువు తూములు, పంట కాలువులతో పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ పరిశీలించి చెరువుల మరమ్మత్తులు చేపట్టి ఆయకట్టు రైతులకు నీరు అందేలా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రాజకీయ నాయకుల హస్తం..?
కొందరు రాజకీయ నాయకులే ధనార్జనే ధ్యేయంగా చెరువులో మట్టి పోస్తూ ప్లాట్లు విక్రయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. రియల్టర్‌లకు రాజకీయ నాయకులు, అధికారులు పరోక్షంగా సహకరించడంతోనే చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయని ఆరోపనలు ఉన్నాయి. గతంలో నాటి కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, భారతి హోళీకేరిలు చెరువుల హద్దుల ఏర్పాట్ల గురించి ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. ఈసారైన చెరువులను చెరపడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా.. లేదా అని స్థానిక ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
బొట్లకుంట చెరువుకు రక్షణ ఏది?..
మున్సిపల్ పరిధిలోని బొట్లకుంట చెరువు మొత్తం దాదాపుగా 12.28 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతంలో చెరువు నుండి ఆయకట్టుకు సాగునీరు అందించే పరిస్థితి ఉండేది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు ఎఫ్‌టిఎల్ హద్దులు కేటాయించకపోవడంతో రియాల్టర్లు చెరువు శిఖం భూమి చుట్టూ ఫ్లాట్లు కనుగొలు చేసి అమ్ముతున్నారు.
కాలువలు సైతం ధ్వంసం
మండలంలోని గొలుసుకట్టు చెరువు ద్వారా గతంలో ఈ చెరువుకు వరద నీరు వచ్చేది. వర్షాకాలంలో గంపలపల్లి చెరువు నుంచి బొట్లకుంట చెరువుకు నీళ్లు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వరద నీటిని చేరవేసే మత్తడి కాలువను పూర్తిగా ఆక్రమించేసి కనుమరుగు చేశారు. తాజాగా మున్సిపాలిటీ పరిధిలోని చెరువులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. చెరువులపై ఎఫ్‌టీఎల్ హద్దులు లేకపోవడంతో ఏర్పాటు చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెరువు పరిరక్షణపై, మత్తడి కాలువల ఆక్రమణపై దృష్టి సారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
గౌతమ్, ఇరిగేషన్ ఏఈ, మంచిర్యాల.
కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువు భూములకు సంబంధించిన వాటిపై సర్వే నిర్వహిస్తున్నాం. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించిన అనంతరం హద్దులు ఏర్పాటు చేస్తాం ఇటిక్యాల చెరువుకు త్వరలోనే హద్దులు వేస్తాం. శిఖం భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వారికి త్వరలోనే నోటీసులు అందజేస్తామని తెలిపారు.