– ట్రంప్ ప్రతిపాదనలకు పుతిన్ సానుకూల స్పందన
– పలు అంశాలపై రెండున్నర గంటల సుదీర్ఘ ఫోన్ కాల్
వాషింగ్టన్ : ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని నివారించేందుకు, ఆ ఘర్షణలకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అగ్ర నేత ట్రంప్ చేసిన ఫోన్ కాల్ సుదీర్ఘంగా సాగింది. రెండు గంటలకు పైగా సాగిన ఈ పోన్ సంభాషణల్లో 30రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన, సముద్ర జలాల భద్రత, ఖైదీల మార్పిడి వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ట్రంప్ ప్రతిపాదనలకు పుతిన్ సానుకూలంగా స్పందించారు. 30రోజుల పాటు ఇంధన సదుపాయాలపై దాడులు చేయకుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఇందుకోసం ఉభయపక్షాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఈ చొరవను పుతిన్ స్వాగతించారు. తక్షణమే వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రష్యా మిలటరీని ఆదేశించారు. అమెరికా,రష్యా సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడంపై ఇరువురు నేతలు ఆసక్తి కనబరిచారు. అంతర్జాతీయ భద్రత, ఆర్థిక సహకారం వంటి అంశాలపై చర్చలు కొనసాగించేందుకు అంగీకరించారు. ఉక్రెయిన్ ఘర్షణలకు శాంతియుత పరిష్కారానికి తన నిబద్ధతను పుతిన్ పునరుద్ఘాటించారని క్రెమ్లిన్ ప్రచురించిన ప్రకటన తెలిపింది. కూలంకషమైన, సమగ్రమైన పరిష్కారం కోసం అమెరికా భాగస్వాములతో కలిసి పనిచేయడానికి పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఆ ప్రకటన పేర్కొంది. రష్యాకు గల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఈ సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించేలా, స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందం వుండాలని పుతిన్ నొక్కి చెప్పారు. 30రోజుల కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ, తమ కీలకమైన ఆందోళనలను రష్యా పక్షం వివరించింది. కదనరంగం పొడవునా కాల్పుల విరమణ పర్యవేక్షణకు సమర్ధవంతమైన యంత్రాంగం వుండాలని, ఉక్రెయిన్‌లో బలవంతంగా సమీకరణలను నిలుపుచేయాలని, వారి సైన్యానికి తిరిగి ఆయుధాలు సమకూర్చే చర్యలను ఆపు చేయాలని కోరింది. ఉక్రెయిన్‌కు విదేశీ మిలటరీ సాయం పూర్తిగా ఆగిపోవాలని, అలాగే ఉక్రెయిన్‌తోనిఘా సమాచారం పంచుకోవడం నిలిచిపోవాలని స్పష్టం చేసింది. పరిస్థితులు పెచ్చరిల్లకుండా నివారించాలంటే ఇది కీలకమైన షరతని నొక్కి చెప్పింది.