‘‘వివా రౌల్!’’ ,‘‘పత్రియా ఓ ముర్టే ’’(మాతృభూమి లేదా మరణం)!
రౌల్ కాస్ట్రోపై అమెరికా మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా భారీ నిరసన
హవానాలోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల క్యూబన్ల ప్రదర్శన
ఆయన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేరు..ట్రంప్ నకు రౌల్ కాస్ట్రో కుమార్తె సవాల్
హవానా : క్యూబా జోలికి వస్తే.. పోరాటానికి మేం సిద్ధంగా ఉన్నామని క్యూబన్లు నినదించారు. 30 ఏండ్ల క్రితం రెండు పౌర విమానాలను కూల్చివేసిన ఘటనలో మాజీ అధ్యక్షుడు , 94 ఏండ్ల వయస్సున్న రౌల్ కాస్ట్రోపై అభియోగాలు మోపాలన్న అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా క్యూబా ప్రభుత్వానికి మద్దతుగా భారీ నిరసన చేపట్టారు. శుక్రవారం హవానాలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట వేలాది మంది క్యూబన్లు ప్రదర్శన నిర్వహించారు. ప్ల కార్డులు, బ్యానర్లు చేత పట్టుకుని ట్రంప్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ద్వీపపు విప్లవ వీరుడైన రౌల్ కాస్ట్రోకు మద్దతుగా గళమెత్తారు.
ప్రదర్శనకు రౌల్ కాస్ట్రో గైర్హాజరు
సంఘీభావానికి ధన్యవాదాలు తెలుపుతూ సందేశం వయసు రీత్యా ఈ భారీ ప్రదర్శనకు రౌల్ కాస్ట్రో హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో జాతీయ వీరుడు, మాజీ గూఢచారి, క్యూబన్ చట్టసభ సభ్యుడు గెరార్డో హెర్నాండెజ్ క్యూబన్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులకు, వారి సంఘీభావానికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ సందేశాన్ని అందించారు. ‘‘నేను బ్రతికి ఉన్నంత కాలం, విప్లవం వెంటుండి, యుద్ధం జరిగితే మీ ముందుంటాను’’ అని కాస్ట్రో అన్నట్టు హెర్నాండెజ్ తెలిపారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది క్యూబన్లు జెండాలు ఊపుతూ,‘‘వివా రౌల్!’’, ‘‘పత్రియా ఓ ముర్టే’’ (మాతృభూమి లేదా మరణం)!” అని నినాదాలు చేశారు. అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ , ప్రధానమంత్రి మాన్యుయెల్ మారెరో ఈ ర్యాలీకి హాజరయ్యారు. రౌల్ కాస్ట్రో కుమార్తె మరియెలా కాస్ట్రో, కుమారుడు అలెజాండ్రో కాస్ట్రో , మనవడు రౌల్ రోడ్రిగ్జ్ కాస్ట్రోతో సహా కాస్ట్రో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో 2 లక్షల మందికి పైగా పాల్గొన్నట్టు అధికారులు అంచనా వేశారు.
ఇప్పటికీ గెరిల్లా యోధుడే రౌల్ కాస్ట్రో: కుమార్తె మారియోలా కాస్ట్రో నిరసన ప్రదర్శనలో ఉన్న మరియెలా కాస్ట్రో మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి క్షేమంగా ఉన్నారని అన్నారు. ‘‘రౌల్ చాలా బాగున్నారు. ఒక పాత గెరిల్లా యోధుడిలా ప్రశాంతంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ, నవ్వుతూ ఉంటారు. ఆయన ఎప్పుడూ ఇలా అనేవారు, నన్ను ఎవరూ బతికి ఉండగా పట్టుకోలేరు. నేను పోరాడుతున్నప్పుడే వాళ్ళు నన్ను పట్టుకుంటారు.’’ అని ఆమె అన్నారు. అమెరికాతో పోరాటానికి సిద్ధమని, ఆయన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేరని ఈ విషయంలో నేను మీకు హామీ ఇవ్వగలనని చెప్పారు.
వివాదాస్పదంగా ట్రంప్ వ్యవహార శైలి
ఇరాన్ చేతిలో పరాభవానికి గురైన అమెరికా అధ్యక్షుడి కన్ను ఇప్ప్పుడు క్యూబాపై పడింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నా.. అక్కడి చట్టసభల్లోనూ వ్యతిరేకిస్తున్నా ట్రంప్ తీరు మారటం లేదు. అమెరికాలో ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించటానికే పాత కేసుల్ని తిరగదోడి యుద్ధం చేస్తానంటూ బెదిరింపులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా క్యూబాను లక్ష్యంగా చేసుకుని..30 ఏండ్ల నాటి కేసులో ‘బ్రదర్స్ టు ది రెస్క్యూ’ విమానాలను కూల్చివేయమని ఆదేశించినందుకు గాను, హత్య, అమెరికన్లను చంపడానికి కుట్ర, విమానాల విధ్వంసం వంటి ఆరోపణలపై రౌల్ కాస్ట్రోపై అధికారికంగా అభియోగపత్రం దాఖలు చేయగా, దానికి క్యూబా ప్రభుత్వానికి మద్దతుగా క్యూబన్లు విప్లవాత్మక పునరుద్ఘాటన ప్రదర్శన నిర్వహించారు.



