– ఈ వయసులో పార్టీ మారాల్సిన అవసరం లేదు : విలేకరుల సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
”పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాను. ఎంపీ ఎన్నికల్లో నేను లేదా నా కొడుకు పోటీలో ఉంటాం. ఏ పార్టీలో ఉన్నా నేను ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తా.. అప్పుడ ప్పుడు సాంకేతిక సమస్యలు వస్తాయి.. అంత మాత్రాన ఈ వయసులో పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు. అవసరమైతే ఈ పార్టీ నుంచి ఇప్పుడే పోటీ చేసేవాడిని. పక్క పార్టీలోకి వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం లేదు” అని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ మళ్లీ ఘన విజయం సాధించాలన్నారు. కాళేశ్వరం, మెడిగడ్డ ప్రాజెక్టుల విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్‌నే నమ్ముతారని అన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు బీఆర్‌ఎస్సే గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాపై కూడా కొన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అవేవీ ప్రజలు నమ్మొద్దన్నారు. కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు నాతో విడిపోవచ్చు.. అయినా వారి విజయాన్నే నేను కోరుకుంటున్నా అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ తనకు అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఉన్నారన్నారు.