‘పిరమైన’ ప్రధాని మోడీ

– ఎన్డీఏ కూటమికి 200, ఇండియా కూటమికి 150 సీట్లు కూడా దాటవు
– బీజేపీని ఓడించే దమ్ము లేకే కేరళ నుంచి రాహుల్‌ పోటీ
– ‘మల్కాజిగిరి’ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు వలస పక్షులు : రోడ్డు షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
మోడీ అధికారంలోకి వచ్చాక అన్ని ధరలూ పెరిగాయి.. అందుకే ఆయన్ను ప్రజలందరూ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని అని అంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ తరపున ‘మల్కాజిగిరి’ పార్లమెంట్‌ బరిలో నిలిచిన ఎంపీ అభ్యర్థులిద్దరూ వలస పక్షులే అని, వారికి ఓట్లేస్తే గెలిచిన తర్వాత కనబడరని ఈటల రాజేందర్‌, పట్నం సునితా మహేందర్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆలోచించి ఓటేయాలని ప్రజలను కోరారు. బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్‌ సందర్భంగా బుధవారం మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు షోలో కేటీఆర్‌ మాట్లాడారు. బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్‌ఎస్‌కే మాత్రమే ఉందని, 2014, 2019లోనూ తామే అడ్డుకున్నామని గుర్తు చేశారు. గడిచిన పదేండ్లలో తెలంగాణ, హైదరాబాద్‌కు బీజేపీ ఏమీ చేయలేదన్నారు. తమ ప్రభుత్వం గడిచిన పదేండ్లలో 36 ప్లైఓవర్లు కడితే, ఉప్పల్‌, అంబర్‌పేట రెండు ప్లైఓవర్లను కూడా కట్ట చేతకాని బీజేపీకి ఓట్లు అడిగేందుకు సిగ్గు ఉందా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక సిలిండర్‌ ధర రూ.1100 అయిందని, లీటర్‌ రూ.70 ఉన్న పెట్రోల్‌ రూ.110 అయిందని, అన్ని ధరలూ పెరిగాయన్నారు. మోడీ 400 సీట్లు వస్తాయని బిల్డప్‌ ఇస్తున్నారని, పోటీ చేసేదే 420 సీట్లలో అన్నారు. ఎన్డీఏ కూటమికి 200, ఇండియా కూటమికి 150 సీట్లు కూడా దాటవని జోస్యం చెప్పారు. దొంగలను శ్రీరాముడు గెలిపించమనడు అన్నారు. తాము ఓట్ల కోసం మతాన్ని వాడుకోలేదని, మైనార్టీలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. మోడీ అక్షింతలు పంపిస్తే.. కేసీఆర్‌ దేశం మొత్తం తినడానికి బియ్యం పంపించారన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌కు 10 పార్లమెంట్‌ స్థానాలు ఇస్తే.. వాళ్లే మనల్ని బతిమిలాడే పరిస్థితి వస్తుందని, మళ్లీ రాష్ట్రంలో కేసీఆరే రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని చెప్పారు.
మోడీకి మేలు చేసేందుకు కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులు
బడే భారు మోడీకి మేలు చేసేందుకు చోటే భారు రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌గిరితోపాటు చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను బరిలో దింపారని కేటీఆర్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ చౌకిదార్‌ చోర్‌ హై అంటే.. రేవంత్‌ రెడ్డి మోడీ హమారా బడే భారు అంటారని వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించే దమ్ములేని కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేయొద్దన్నారు. కొందరు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటి అని ప్రచారం చేస్తున్నారని, నిజంగా ఒక్కటైతే కేసీఆర్‌ కూతురు జైల్లో ఉండేదా..? అని ప్రశ్నించారు. బీజేపీని ఓడించే దమ్ము లేకనే రాహుల్‌ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించారు.
మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే సీఎం రేవంత్‌రెడ్డి మొత్తం పథకాలను ఆపేస్తారని, కాంగ్రెస్‌ చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. మల్కాజిగిరి రేవంత్‌రెడ్డికి ఎంతో ఇచ్చిందని, పీసీసీ, సీఎం పదవులు రావడానికి మల్కాజిగిరి ప్రజలే కారణం అని, అలాంటి ప్రజలకు రేవంత్‌రెడ్డి ఏమీ చేయలేదన్నారు. కేసీఆర్‌ది పదేండ్ల అభివృద్ధి పాలన అయితే.. రేవంత్‌రెడ్డిది 100 రోజుల అబద్ధాల పాలన అని విమర్శించారు.

Spread the love