సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత

– ఎకో పార్క్‌ శంకుస్థాపనలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-రామగిరి
సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవ హారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లాలో సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియా జీఎం కార్యాలయ సమీపంలో 9 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు రూ.3 కోట్లా 56 లక్షలతో నిర్మించనున్న ఎకో పార్క్‌కు సోమవారం మంత్రి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కూడా సింగరేణి సంస్థ అభి వృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సంస్థకు వచ్చిన లాభాల్లో కాంట్రాక్టు కార్మికులను కూడా భాగస్వాములను చేశామన్నారు. గోదావరిఖని సింగరేణి మెడికల్‌ కళాశాలలో 7 శాతం సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వచ్చేవిధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎకోపార్క్‌ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జీ-3 ఏరియా జనరల్‌ మేనేజర్‌ నరేంద్ర సుధాకర్‌రావు, అడ్రియాల ప్రాజెక్ట్‌ ఏరియా జనరల్‌ మేనేజర్‌ కొప్పుల వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ వైవి రావు, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మెన్‌ బి.జనక్‌ ప్రసాద్‌, అధికారుల సంఘం అధ్యక్షులు వెంకటరమణ, రామచంద్రారెడ్డి, కోట రవీందర్‌ రెడ్డి, ఎస్‌వోటు జీఎంలు జి.రఘుపతి, బి.సత్యనారాయణ పాల్గొన్నారు.

Spread the love