బొగ్గు గనుల ప్రయివేటీకరణ ఆపాలి

– నిరసనలతో కదం తొక్కిన సీపీఐ(ఎం) శ్రేణులు
– బొగ్గు గనుల వేలం ఆపాలంటూ ధర్నాలు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులు వేలం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో పార్టీ శ్రేణులు పలు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సింగరేణి కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులు వేలం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో పార్టీ శ్రేణులు పలు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అడ్డగుట్ట ఎంఆర్‌ఓ చౌరస్తాలో సీపీఐ(ఎం) సికింద్రాబాద్‌ జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సికింద్రాబాద్‌ జోన్‌ కన్వీనర్‌ ఎం.అజరు బాబు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని.. సింగరేణి కంపెనీ కూడా ప్రయివేటు సంస్థలతో వేలంపాటలో పోటీ పడాలని నిర్ణయించారన్నారు. ఇప్పటికే నాలుగు బ్లాకులు గత బీఆర్‌ఎస్‌ పాలనలోనే మోడీ ప్రభుత్వం ప్రవేశ సంస్థలకు అప్పగించిందన్నారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించడం అన్యాయమన్నారు. బొగ్గు బ్లాక్‌ లన్ని ప్రయివేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందని ప్రశ్నించారు. క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి మూతపడే వైపు మోడీ ప్రభుత్వం నెట్టుతున్న దన్నారు. ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణికి బొగ్గు కొనుగోలు కరెంట్‌ బిల్లు రూ. 29 వేల కోట్లు బకాయి పడిందని, అయినప్పటికీ సింగరేణి రూ. 35 వేల కోట్ల టర్నోవర్‌ల్లో లాభాల బాటలో నడుస్తున్నదన్నారు. ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయల లాభాలు అర్జిస్తుందంటూ మోడీ ప్రభు త్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టిం దన్నారు. దీని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న వేలం అన్నారు. బొగ్గు గనుల వేలం పాటలను వెంటనే ఆపాలని, దేశ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టే కేంద్ర బీజేపీ విధానాలను ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సింగరేణిలో 40 వేల మంది పర్మినెంట్‌ కార్మికులు, మరో 26,000 మంది కాంటాక్ట్‌ కార్మికుల ఉపాధి నీ దెబ్బ తీయొద్దన్నారు. వారి కుటుంబాలను వీధిపాలు చేయొద్దన్నారు. సికింద్రాబాద్‌ జోన్‌ కమిటీ నాయకులు ఆర్‌ మల్లేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సికింద్రాబాద్‌ జోన్‌ కన్వీనర్‌ అజ రు బాబు, నాయకులు ఏ బాలయ్య, టి. మహేందర్‌. ఏం. గోపాల్‌. కే కృపా కర్‌. ఫాతిమా యాకమ్మ, షంషేద్వేగం సరోజమ్మ, వజ్రా భారు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్‌ జోన్‌ నాయకుల ఆధ్వర్యంలో..
జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం రహమత్‌ నగర్‌ డివిజన్‌లోని రెండు బొమ్మల సెంటర్‌ వద్ద సీపీఐ(ఎం) నాయకులు భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు చెన్నుపాటి చంద్రశేఖర రావు, టి. సాయి శేషగిరిరావులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు ఉచితంగా కేటాయించాలని, వేలంపాట ద్వారా వద్దన్నారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఆ విధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 1957 నుంచి 2015 వరకు రాష్ట్రంలోని బొగ్గు గనుల మీద పూర్తి హక్కు సింగరేణికి ఉందని, 2015 లో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎత్తివేసి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వేలం పాటలో పాల్గొవాలని ఈ చట్టం తెచ్చిందన్నారు. ఇది అన్యాయమన్నారు. ప్రయివేటు సంస్థలకు ఇస్తే వారు ఇష్టం వచ్చినట్టు బొగ్గు రేట్లు పెంచితే, బొగ్గు మీద ఆధారపడి నడిచే మన థర్మల్‌ పవర్‌ విద్యుత్‌ సంస్థలు, ఆ భారాన్నంతా మళ్లీ ప్రజల మీదే నెట్టే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే దేశం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం లేచే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రహమత్‌ నగర్‌ ఇన్‌చార్జి నాయకులు జె స్వామి, దేవదాస్‌, బాలయ్య, భాగ్యరాజ్‌, సుధాకర్‌, సోమలా నాయక్‌, యాదగిరి, యాదయ్య, జైపాల్‌, రాజు, కేశప్ప ,కష్ణ పార్వతమ్మ, జూబ్లీహిల్స్‌ జోన్‌ కన్వీనర్‌ రాపర్తి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్‌లో..
బేగంపేట్‌: బన్సీలాల్‌పేట్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్‌ నాయకులు పి. మల్లేష్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 61 బొగ్గు బావులను వేలం వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, మరో 8 మంది పార్లమెంట్‌ సభ్యులు ఉండి కూడా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కిషన్‌ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి కూడా సింగరేణిని దివాలా తీయించే విధంగా మన బొగ్గు బ్లాకులను వేలంపాట వేయడం ద్వారా బీజేపీ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నద న్నారు. తెలంగాణకు మణిహారం సింగరేణిని కాపాడుకునేందుకు ప్రజలు ప్రజా స్వామ్య శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోన్‌ నాయ కులు పి.మల్లేష్‌, అంజయ్య, లక్ష్మయ్య, అనిల్‌, నరసింహ, శంకర్‌, అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
కంటోన్మెంట్‌: బొగ్గు బావులను వేలంపాటకు నిరసనగా కంటోన్మెంట్‌ సీపీఐ(ఎం) నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రసూల్‌ పుర పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ, బి నారాయణ, హార్ట్ఫోర్డ్‌ మైసమ్మ, వెంకట్రావు, శ్రీను, ప్రకాష్‌, ఎల్లమ్మ, వెంకన్న, తది తరులు పాల్గొని కార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Spread the love