ఐక్య పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కారం

Problems can be solved only through united struggle– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
అంగన్‌వాడీల ఐక్య పోరాటం ద్వారానే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. గురువారం తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సెక్టార్‌ లీడర్లతో విజయోత్సవ సభను స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి హాజరై మాట్లాడారు. 24 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న ఈ విజయం ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త విజయమని వారికి అభినందనలు తెలియజేశారు. దశల వారీ ఆందోళనలు, పోరాటాలు నిర్వహించి సాధించు కున్న హామీలను వెంటనే అమలు జరపటానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీ చేసే సూచనలను అనుసరిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు అందరూ వీరోచితంగా పోరాడటం మూలంగా ప్రభుత్వం స్పందించిందని, భవిష్యత్తులో ఉద్యోగ భద్రతకు గుర్తింపు పొందటానికి ఇదే ఐక్యత పోరాటాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. సమ్మె పోరాటాల్లో ఉన్న సందర్భంలో ప్రభుత్వాలు స్పందించి పరిష్కారం చేసిన ఏకైక పోరాటం అంగన్‌వాడీల దేనని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె. దేవగన్‌, పి.స్వర్ణ, జిల్లా నాయకులు చంద్రకళ, రాజ సులోచన మంగాదేవి, శివరాజమ్మ, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్‌ బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్‌ గౌడ్‌, యూనియన్‌ నాయకులు జ్యోతి, గోదావరి, లావణ్య, ఎలిజబెత్‌ రాణి, సూర్య కళ, వాణి, జగదాంబ, అనంతలక్ష్మి, సునంద, పాల్గొన్నారు.

Spread the love