మొహరం సందర్భంగా చార్మినార్ వద్దకు
భారీగా తరలివచ్చిన జనం
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో చారిత్రక ‘బీబీ-కా-ఆలం’ మొహరం ఊరేగింపు శుక్రవారం మధ్యాహ్నం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది.ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ‘శ్రీదేవి’ అనే ఏనుగుపై బీబీ కా ఆలం ను ఊరేగించారు. ఈ వార్షిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. దబీర్‌పురాలో మొదలైన ఈ ఊరేగింపు చార్మినార్, గుల్జార్ హౌస్ మీదుగా సాగి చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమం సందర్భంగా భద్రతను పర్యవేక్షించడానికి భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఊరేగింపు చార్మినార్‌కు చేరుకున్నప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ‘ధట్టి’ని సమర్పించారు. పురానీ హవేలీ మీదుగా ఊరేగింపు సాగుతున్నప్పుడు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కూడా ‘ధట్టి’ని సమర్పించారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ ఉన్నారు. ధర్మాన్ని పాటించడం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం అనే ఇమామ్ హుస్సేన్ శాశ్వత సందేశం అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజల కోసం శాంతి, మత సామరస్యం, శ్రేయస్సును కోరుతూ ఆయన ప్రార్థించారు.
నిజాం కాలం నాటి మొహర్రం సంప్రదాయం కొనసాగింపు
శతాబ్దానికి పైగా ఉన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ముకర్రం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ట్రస్టీ నవాబ్ అబుల్ ఫైజ్ ఖాన్, పురానీ హవేలీలోని పీలీ గేట్ (ఎల్లో గేట్) వద్ద పవిత్రమైన ‘బీబీ-కా-ఆలం’కు ‘ధట్టి’ , ‘నజ్రానా’ను సమర్పించారు. ఆయనతో పాటు చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ , తదితరులు ఉన్నారు. రెండవ నిజాం, నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ బహదూర్ (ఆసఫ్ జా II) పాలనలో నిర్మించబడిన చారిత్రక ‘పీలీ గేట్’ (పసుపు రంగు ద్వారం), ‘హవేలీ-ఎ-ఖదీమ్’ (పురానీ హవేలీ)కి అసలైన ప్రధాన ద్వారంగా ఉండేది. ఇది ప్రారంభ ఆసఫ్ జాహీ కాలం నాటి అత్యంత పురాతన ,ముఖ్యమైన నిర్మాణపరమైన వారసత్వ ప్రదేశాలలో ఒకటి.
బీబీ-కా-ఆలం చరిత్ర
‘బీబీ-కా-ఆలం’ వ్యవస్థ గోల్కొండకు చెందిన షియా కుతుబ్ షాహీ పాలకుల హయాంలో ప్రారంభమైంది. అయితే, ఆసఫ్ జాహీల నిరంతర ఆదరణ, రాజ పోషణ, ఉత్సవాలలో పాల్గొనడం మరియు రాష్ట్ర ప్రజల ఆచార వ్యవహారాలలో దీనిని భాగం చేయడం ద్వారా ఇది హైదరాబాద్‌లో మొహరం యొక్క అత్యంత ప్రముఖ ప్రజా చిహ్నంగా మారింది. నిజాంలు కుతుబ్ షాహీల నుండి అనేక వ్యవస్థలను వారసత్వంగా పొందారు, వాటిలో ‘బీబీ-కా-ఆలం’ ఒకటి. అయితే, ఒక రాజవంశానికి చెందిన షియా మతపరమైన చిహ్నంగా ఉన్న బీబీ-కా-ఆలామ్‌ను హైదరాబాద్‌లో అత్యంత ప్రసిద్ధ మహర్రం ఆచరణాత్మక కార్యక్రమంగా మార్చడంలో ఆసఫ్ జాహీల ఆదరణ కీలక పాత్ర పోషించింది.



