– టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం
– జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-ఆసిఫాబాద్
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో టీజేఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ”ప్రమాదంలో ప్రజాస్వామ్యం పార్లమెంట్ ఎన్నికలు కర్తవ్యం” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం రాకముందు దేశంలో కులమతాల వారీగా ప్రజలు విడిపోయి బతికే వారన్నారు. రాజ్యాంగం వీరిని కలపడమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలను మనుషులుగా బతికేలా ఒక వేదికగా నిలిచిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో అసమానతలు పెరిగాయన్నారు. అదాని, అంబానీల ఆస్తులు కోట్లలో పెరిగాయన్నారు. 10 సంవత్సరాల క్రితం లక్ష కోట్ల ఆస్తితో ఉన్న ఆదాని ప్రస్తుతం ఏడున్నర లక్షల కోట్లకు పెరిగాడని కానీ తిండి పెట్టే రైతు పరిస్థితి మాత్రం అలాగే ఉందన్నారు. వ్యవసాయంతో బతికే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యవస్థను బతికించేలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయం దండగ అని పట్టణాల్లో సెక్యూరిటీ గార్డ్ పనిచేయడం నయం అనే పరిస్థితి తలెత్తేల చేశారన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే రాజ్యాంగ రక్షణ ఒకటే సాధ్యమన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం చర్చించడం కాకుండా ప్రజల్లో దాని విలువలను పెంచేలా చేయాలన్నారు. రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వ పాలనలో నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. అలా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమికి ఓటు వేయాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, టీజేఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాబన్న, వివిధ సంఘాల నాయకులు రూప్నర్ రమేశ్, దుర్గం దినకర్, కార్తీక్, ఆత్మకూరు చిరంజీవి, కోరంగ మాలశ్రీ, సోయం చిన్నన్న, ధర్ము, మారుతి పటేల్, చాంద్ పాషా, శ్యామ్, ఆసిఫ్, అసద్, వసంతరావు పాల్గొన్నారు.