రాజ్యాంగాన్ని రక్షించేది డీఎస్పీ మాత్రమే

నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒకవైపు, భారత రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ ఒక వైపుగా ఉండి పోరాడుతున్నామని, భారత రాజ్యాంగాన్ని రక్షించేది దేశంలో డీఎస్పీ పార్టీ మాత్రమే అని ధర్మ సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్‌ మహారాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అగ్రకుల పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా మాట్లాడుతున్నాయని తెలిపారు. ఏళ్లుగా అగ్రకుల పార్టీలు దోపిడీ చేస్తూ ప్రజలను పట్టించుకోలేదని, అందుకే అణగారిన వర్గాల పక్షాన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా మెస్రం గంగాదేవిని బరిలో ఉంచడం జరిగిందన్నారు. ఆదివాసీ బిడ్డను అందరూ ఆదరించి అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ నెల 10న ధర్మ సమాజ్‌ పార్టీ అధినేత డా. విశారదన్‌ మహారాజ్‌ రానున్నట్లు తెలిపారు. అభ్యర్థి మెస్రం గంగాదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌ నుండి ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ వరకు ర్యాలీ ఉంటుందని, అనంతరం సభ ఉంటుందని తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అభ్యర్థి గంగాదేవి, నాయకులు బడుగు రాజేశ్వర్‌, తొంతికూరి సంతోష్‌, ధర్మాజీ, ఎనగంటి రవి, ప్రశాంత్‌, మెస్రం నారాయణ పాల్గొన్నారు.

Spread the love