త్రిపురలో బీజేపీ ప్రభుత్వ దాడులకు వ్యతిరేకంగా నేడు, రేపు నిరసనలు

– రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, టి. సాగర్‌
– ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా
నవతెలంగాణ – అడిక్‌ మెట్‌
త్రిపురలో బీజేపీ ప్రభుత్వ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, టి. సాగర్‌ పిలుపునిచ్చారు. త్రిపురలో రైతు సంఘం కార్యకర్తలు, సభ్యులు, ప్రజలపై బీజేపీ దుండగులు సాగిస్తున్న ఆటవిక హింసాకాండ పట్ల రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని దోమలగుడ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ.. త్రిపురలో ఎన్నికల అనంతరం బీజేపీ సాగిస్తున్న ఆటవిక హింసాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ హింసను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ చేసిన దాడుల్లో ఇప్పటివరకు ఐదుగురు మరణించారని, 630 మంది గాయపడ్డారని తెలిపారు. 85 ఇండ్లు దగ్ధం కాగా 65 పాక్షికంగా దగ్ధమయ్యాయని, 96 దుకాణాలు దగ్ధమయ్యాయని చెప్పారు. ఇక 1,647 ఇండ్లను ధ్వంసం చేసి దోచుకున్నారని, 1,000 ఎకరాలకు పైగా ఉన్న 211 రబ్బరు తోటలు దగ్ధమయ్యాయని తెలిపారు. దాదాపు 500 ఎకరాల్లోని 286 కూరగాయల తోటలు ధ్వంసం, 60 చేపల చెరువులు విషపూరితమయ్యాయని, 15 మేకలు, 10 ఆవులు, 50 బాతులు, కోళ్లు కాలి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపురలో శాంతిని నెలకొల్పేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. అలాగే ఈ హింసకు బాధ్యులైన వారందరిని అరెస్టు చేసి, ప్రజల జీవితాలకు, వారి జీవనోపాధులకు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని త్రిపుర చీఫ్‌ సెక్రటరీని, పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం సాగర్‌ మాట్లాడుతూ.. త్రిపురలో ఈ తరహా నిరంకుశవాదం, అప్రజాస్వామికవాదం, అమానవీయ ప్రవర్తనాశైలిని ఏ మాత్రమూ సహించలేమ న్నారు. అతి స్వల్ప మెజారిటీతో గెలుపొందడం, పైగా తన ఓటు బ్యాంక్‌ క్షీణించడం వంటి కారణాలు బీజేపీ నేతలను తీవ్ర నిరాశపరిచాయని, ఆ నిరాశా నిస్పృహలతోనే వారు ఈ ఆటవిక దాడులకు తెగబడ్డారని తెలిపారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి, బొంతల చంద్రా రెడ్డి, పి జంగారెడ్డి, బుర్రి శ్రీరాములు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, బస్సు మధుసూదన్‌ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, కందాల ప్రమీల, కున్‌రెడ్డి నాగిరెడ్డి, మాటూరు బాలరాజు గౌడ్‌, ఈసంపల్లి బాబు, ఎం. శ్రీనివాసులు, వాసుదేవరెడ్డి, అంజిలయ్య గౌడ్‌, తిరుపతి రెడ్డి, రాజయ్య, అశోక్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love