అదానీ కోసం…శారదా నదిపై పిఎస్‌పి

– రహస్యంగా మట్టి నమూనాల సేకరణ
–  రైవాడ జలాశయానికి దెబ్బ
–  ఆందోళనలో ప్రజలు
అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చేస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో మరోసారి ప్రజా ప్రయోజనాలను తుంగలో తొక్కడానికి సిద్ధమౌతోంది. అదానీ అక్రమాలకు ఈ సారి రైవాడ జలాశయం బలికానుంది. ఫలితంగా ఆ జలాశయంపై ఆధారపడి బతుకులీడుస్తున్న ప్రజానీకం మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. రైవాడ జలాశయానికి ఎదరుయ్యే ముప్పు గురించి సాక్షాత్తు రాష్ట్ర జలవనరులశాఖే సవివరమైన నివేదికను సిద్ధం చేసినా ప్రభుత్వ పెద్దలు మాత్రం అదానీ వైపే మొగ్గుచూపినట్లు తెలిసింది. దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ బలిపురం వద్ద మట్టి నమూనాలు తీయడంతో మరో పీఎస్‌పీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రైవాడ జలాశయానికి వచ్చే శారద నదిపై పీఎస్‌పీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అదానీ గ్రూపు వివిధ సర్వేలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా బలిపురం వద్ద మట్టి నమూనాలు తీసి, నివేదించే బాధ్యతను కొల్‌కతాకు చెందిన ఓ సంస్థకు అప్పగించినట్టు తెలిసింది. బలిపురం నుంచి విజయనగరం జిల్లా వేపాడ మండలం, ఈలుపర్తి పంచాయతీలోని మారికకొండ మధ్య 60 అడుగుల లోతులో 20 చోట్ల మట్టి నమూనాలు తీయనునున్నట్టు తెలిసింది. బలిపురం, మారికకొండ మధ్య శారద నది ఉంది. ఈ నది నీరు రైవాడ జలాశయానికి ప్రధాన నీటి వనరు. దీంతో రైవాడ జలాశయ ఉనికి ప్రశ్నార్ధకంగా మారనుంది. ఇప్పటికే ఏజెన్సీలోని చింతపల్లి మండలం యర్రవరంలో శ్రీ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, అనంతగిరి మండలం పెదకోట వద్ద అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ పిఎస్‌పిలను అదానీకి అప్పజెప్పేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. యర్రవరం పిఎస్‌పి వల్ల తాండవ, పెదకోట పిఎస్‌పి వల్ల రైవాడ జలాశయానికి వచ్చే నీటి వనరులు దెబ్బ తింటాయని జలవనరుల శాఖ కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పిఎస్‌పిల ఏర్పాటుపై స్థానిక గిరిజనులు, ఆయకట్టుదారుల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అందరిలో ఆందోళన
తాజాగా జరుగుతున్న సర్వేలో నీటి వనరులు, నిర్మాణానికి ఉన్న నాణ్యత, అవకాశాలు, నీటి నిల్వ ప్రదేశాలు, నీటి ప్రవాహ ప్రాంతాలపై వివరాలు సేకరిస్తున్నట్లు చెబుతన్నారు. ఇవన్నీ అనుకూలంగా ఉంటే ప్రభుత్వానికి పిఎస్‌పి ఏర్పాటుకు దరఖాస్తు చేయనున్నారు. అయితే, ఈ ప్రక్రియ అంతా లాంఛనమేనని, ప్రభుత్వం నుండి ఖచ్చితమైన ఆమోదంతోనే ఇక్కడ సర్వే తంతు జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ప్రాంతం షెడ్యూల్‌ ఏరియాలో లేకపోవడం, అదానీ సంస్థ వ్యూహాత్మకంగా ఇక్కడే ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్నత స్థాయి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love