– తొలి రోజే 90 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
జాతీయ పల్స్ పోలియో రోగనిరోధక కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట మండలంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మండలంలో వినాయకపురం,గుమ్మడవల్లి రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు మొత్తం 5849 మంది చిన్నారులను లక్ష్యంగా నిర్ణయించగా, తొలి రోజున 5209 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో సుమారు 90 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాందాస్ నాయక్ తెలిపారు.
కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మండల వ్యాప్తంగా 39 పోలియో బూత్‌లు, 4 ట్రాన్సిట్ బృందాలు, ఒక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు చేపట్టారు.
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తొలి రోజున పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన అర్హులైన చిన్నారులకు రానున్న ఇంటిింటి సర్వే, ఫాలోఅప్ కార్యక్రమం ద్వారా పోలియో చుక్కలు అందజేస్తామని, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.



