విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి

Adilabad– ఎంఈఓ ముక్తవరపు వెంకటేశ్వర స్వామి
– స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశంలో ఉపాధ్యాయులకు శిక్షణ
నవతెలంగాణ-కాసిపేట
విద్యార్థులకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా గుణాత్మక విద్య అందించాలని కాసిపేట ఎంఈఓ ముక్తవరపు వెంకటేశ్వర స్వామి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాసిపేట జిల్లా పరిషత్‌ పాఠశాలలో కాసిపేట స్కూల్‌ కాంప్లెక్స్‌ మీటింగ్‌లో ప్రాథమిక ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంఈఓ ముక్తవరపు వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సామర్థ్యాలను ఉపాధ్యాయుడు పరిశీలించి, వారికి అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రాథమిక విద్యా దశ చాలా ముఖ్యమైనదని, ప్రైమరీ స్థాయిలో విద్యార్థులకు విద్యా అంశాలపై అవగాహన వచ్చినట్లయితే హై స్కూల్‌ స్థాయిలో ఉన్నత చదువుకు దోహదపడుతుందని, ఈ దిశగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పకుండా సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యా అంశాల్లో ఉపాధ్యాయులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి ఎంఈఓ సెడ్మాకి రాము, కాసిపేట కాంప్లెక్స్‌ హెచ్‌ఎం మామిడిపెల్లి సాంబమూర్తి, దేవాపూర్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం రాథోడ్‌ రమేష్‌, ధర్మరావుపేట కాంప్లెక్స్‌ హెచ్‌ఎం సుధాకర్‌ నాయక్‌, ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love