హైదరాబాద్ : బోయింగ్, జిఇ ఏవియేషన్, హనీవెల్, రోల్స్ రాయిస్, కాలిన్స్ ఏరోస్పేస్, వంటి అంతర్జాతీయ సంస్థలకు అత్యంత కీలకమైన పరికరాలను సరఫరా చేసే హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ గ్రూప్ బ్రిటన్ కంపెనీని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు విడిభాగాల్లో ప్రత్యేకత కలిగిన ప్రముఖ ప్రెసిషన్ మెషినింగ్ కంపెనీ పిఎంసి గ్రూపును 100 శాతం కొనుగోలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. ఈ కొనుగోలు ప్రకటన కార్యక్రమానికి భారత్‌లో యుకె డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పిఎ, మిధాని సిఎండి ఎస్‌కె ఝా, ఎఆర్‌సిఐ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాధీనం అంతర్జాతీయంగా విస్తరించడానికి, తన సామర్థ్యాలను విస్తరించడానికి రఘు వంశీ గ్రూపు ముందడుగుకు దోహదం చేయనుందని రఘువంశీ గ్రూపు ఎండి వంశీ వికాస్ తెలిపారు.