నవతెలంగాణ-హైదరాబాద్: పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యసభ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవమైయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలే సింహాభాగం దక్కించుకున్నాయి.మొత్తం 27 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి ఎన్నిక జరగగా.. అందులో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఈ మేరకు గురువారం ఫలితాలు వెలువడ్డాయి. వీరిలో 19 మంది బీజేపీ (ఎన్‌డీయే) అభ్యర్థులుకాగా, మిగతా ఐదుగురు కాంగ్రెస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మరోసారి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాజ్యసభలో ఎన్‌డీయే స్థానాలు 3 పెరగగా, కాంగ్రెస్ ఒక సీటు పెంచుకుంది. ఇంతకుముందు ఈ స్థానాల్లో ఎన్‌డీయే 16 రాజ్యసభ సీట్లు కలిగి ఉండేది. ఇప్పుడు 3 సీట్లు పెరిగాయి. ఇంతకుముందు ఇదే స్థానాల్లో కాంగ్రెస్ 4 సీట్లు కలిగి ఉండేది. ఇప్పుడు అదనంగా మరో సీటు గెలుచుకుంది. ఈ ఎన్నికల ద్వారా ఏపీకి చెందిన వైసీపీ.. మూడు రాజ్యసభ స్థానాల్ని కోల్పోయింది. అలాగే, ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ కూడా ఒక సీటును బీజేపీకి కోల్పోవాల్సి వచ్చింది. తాజా ఫలితాల్లో పార్టీ ప్రకారం గెలిచిన సీట్ల వివరాలివి. ఏపీ నుంచి ఎన్‌డీయే కూటమికి చెందిన పార్టీలు టీడీపీ, జనసేనలు 4 స్థానాలు దక్కించుకున్నాయి.
గుజరాత్ నుంచి నాలుగు స్తానాలు బీజేపీకే దక్కాయి. కర్ణాటకలో ఒక స్థానం ఎన్‌డీయేకు, మూడు స్థానాలు కాంగ్రెస్ (ఇండియా బ్లాక్)కు దక్కాయి. మధ్యప్రదేశ్ నుంచి 3 సీట్లు ఎన్‌డీయే కూటమికి దక్కాయి.
రాజస్తాన్‌లో రెండు సీట్లు ఎన్‌డీయేకు, ఒకటి కాంగ్రెస్‌కు దక్కాయి. తమిళనాడులో టీవీకే మద్దతుతో ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలిచింది. ఇక అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ బీజేపీ కైవసం చేసుకుంది. మేఘాలయ నుంచి జేమ్స్ కే సంగ్మా (ఎన్‌పీపీ), మహారాష్ట్ర నుంచి రాజేంద్ర జైన్ (ఎన్‌సీపీ), ఒడిశా నుంచి దేవాశిస్ సమంత్ రాయ్ (బీజేపీ) గెలిచారు.



