రామయ్య మాట..

 Sampadakiyamభగభగ మండుతున్న ఎండాకాలంలోనూ అర్ధాంతరంగా కుండపోత వర్షం…చలికాలంలో సూర్యుడు నడినెత్తి మీద మోత మోగించడం చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాలవల్ల ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పర్యవ సానంగా తుపానులు, వరదలు, కరువు పరిస్థితులు, భూకంపాలు తరచూ తలెత్తుతున్నాయి. వీటికి తోడు ఆర్థిక యుద్ధాలు వంటివీ మానవాళిని ప్రమాదంలోకి నెడుతున్నాయి. అందుకే పర్యావరణహితం కోసం పర్యావరణ ప్రేమికులు ‘మొక్కల్నినాటండి…అడవుల్ని కాపాడండి’ అని పిలుపునిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఓ సంక్షోభ కాలం కొనసాగుతున్నది. అడవుల పరిరక్షణకు పూనుకోకపోతే సంక్షోభ సమయాన్ని చవిచూడాల్సి రావడం ఖాయం. మొన్నటివరకు నేనీ రాడార్‌ ఏర్పాటుకు వ్యతరేకంగా దామగుండాల పరిరక్షణ ఉద్యమం. లగచర్ల ఘటన. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటం అందర్నీ అటువైపు తొంగిచూసేలా చేసింది. ఈ తరుణంలో పచ్చదనం కోసం..పచ్చనిలోకం కోసం పరితపించి.. మొక్కలే ప్రాణంగా జీవించిన వ్యక్తి ‘వనజీవి’ రామయ్య నిష్క్రమణ పర్యావరణ ఉద్యమాలకు ఒక వెలితి.
మానవ ప్రేరేపిత చర్యలవల్ల పెద్దయెత్తున పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటూ…ఆ దుష్పరిణామాలే తిరిగి విపత్తుల రూపంలో మానవాళిపై విరుచుకుపడుతున్నాయి. మయన్మార్‌ భూకంపాలు, ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు కార్చిచ్చులు చోటుచేసుకుంటున్నాయి. మన దేశంలోనూ ఆకస్మిక వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. హిమాలయ సానువుల్లో తవ్వకాలు జరిపి మోడీ కలల ప్రాజెక్టు అయిన చార్‌దమ్‌ నిర్మించడం ద్వారా భూమి పగుళ్లతో హిమాలయ ప్రాంతాల్లో పెద్దయెత్తున నష్టం సంభవిస్తున్నాయి.ప్రకృతి పరిరక్షణలో కీలకపాత్ర పోషించే అడవులు మానవాళి అత్యాశ, అక్రమ వేట, రవాణాల మూలంగా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గనుల తవ్వకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, పట్టణ ప్రాంతాల విస్తరణ కోసం అడ్డూఅదుపూ లేకుండా అడవుల నరికివేత, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల మూలంగా ఆవాసాలు కోల్పోయిన అనేక జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భారత్‌లో గత దశాబ్దకాలంలో అడవుల క్షీణత అధికంగా నమోదైంది. అభివృద్ధి పనులూ భవన నిర్మాణాలు వంటి వాటికి ఏటా పెద్దమొత్తంలో చెట్లు బలవు తున్నాయి. ఈ దుష్పరిణామాలకు పాలకులు కారణం కాదా?
ప్రజలు, పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలు చట్ట విరుద్ధంగా ఇష్టారీతిన చెట్లను కొట్టేస్తుండటంతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతున్నది. జిమ్‌ కార్బెట్‌ పులుల సంరక్షణ కేంద్రంలో పర్యాటకాభివృద్ధి పేరిట వేల సంఖ్యలో వృక్షాలను నరికివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తాజ్‌ ట్రెపీజియం జోన్‌లో వందల చెట్లపై గొడ్డలివేటు వేసిన వ్యక్తికి ఇటీవల పెద్దమొత్తంలో జరిమానా విధించింది సర్వోన్నత న్యాయస్థానం. కొట్టేసిన చెట్లకు సమంగా పచ్చదనం పెరగాలంటే కొన్ని ఏండ్లు పడుతుంది. ఆలోగా జీవావరణం జబ్బుపడి, జనజీవనం వ్యథాభరితమవుతుంది. కాబట్టి, చెట్లను నరకడం హత్యకన్నా ఘోరమైన అపరాధమన్న ధర్మాసనం వ్యాఖ్యలు అక్షరసత్యాలు. ప్రపంచ దేశాలు, వాటి ప్రభుత్వాలు, పౌరులు సామాజిక బాధ్యతగా, మానవతావాదంతో ప్రకృతితో స్నేహం చేస్తూ పచ్చదనాన్ని పరిమళించేలా చేయాలి అదే వనజీవి ‘రామయ్య సమాజానికి ఇచ్చిన సందేశం. అతను పెద్దగా చదువుకోకపోయినా చెట్లు లేకపోతే కలిగే నష్టాలను బాల్యం లోనే తెలుసుకుని నాటినుంచి పట్టువదలని విక్రమార్కుడిలా మొక్కలను పెంచడం తన జీవితాశయంగా మార్చుకున్నారు. అతను చిప్కో ఉద్యమకారుడు సుందర్‌ లాల్‌ బహుగుణ సహచరుడు కాకపోయినా ‘అభినవ అశోకుడి’గా తెలంగాణ సమాజం గుర్తించింది. తల్లికి బిడ్డకు ఉన్న అవినాభావ సంబంధమే మానవుడికి ప్రకృతికి ఉన్న సంబంధంగా అభివర్ణించే రామయ్య ‘దేవుడిపై ఉన్న భక్తి, భయం మొక్కలపై కూడా ఉండాలి’ అని అభిలషించేవారు. ఆయన మాటల అర్థాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటే పర్యావరణానికి మేలు.
అభివృద్ధి పేరుతో, పెట్టుబడులను ఆకర్షించాలనే ఎజెండాతో అడవులను లేకుండా చేస్తే మానవ మనుగడే ప్రమాదంలోకి వెళ్తుంది. అడవిని నరికేసి, గుట్టలను ధ్వంసం చేసే విధానానికి ఇకనైనా స్వస్తిచెప్పాలి. ఒక ఆపద వచ్చిన తర్వాత దానిపై యాగీ చేసే బదులు ప్రత్యామ్నాయ మార్గా లను అన్వేషించి ఆపదలు రాకుండా చూసేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడు కోగలం. తమ రాజకీయ అస్తిత్వానికి, అధికారాన్ని నిలబెట్టుకో వడం కోసం కాకుండా ప్రజలకు, పర్యావరణానికి ధీర్ఘకాలం మేలుచేసే పనులు చేసినప్పుడే అవి ప్రజా ప్రభుత్వాలు కాగలవు. ఆరోగ్యం సహకరించని సమయంలోనూ తన వనదీక్షను వదలని రామయ్య కృషి అనన్య సామాన్యమైనది. ‘వృక్షో రక్షతి రక్షిత:’ అన్న భావనను మనసావాచా విశ్వసించి, ఆచరించి, విస్తృత ప్రచారం కల్పించిన ఆయన బాట… అందరికీ అనుసరణీయమైనది.

Spread the love