బాధ్యతలను గుర్తుచేస్తున్న మహిళా దినోత్సవం

Women's Day reminds us of our responsibilitiesఅంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా ప్రపంచ కార్మికుల పండుగ ”మే డే” వంటి ప్రధాన తేదీలు నూతన సంవత్సరం లాంటి సరదాగా చిందులేసే సందర్భాలు కావు. ఈరోజు మనం అనుభవిస్తున్న మెరుగైన జీవన ప్రమాణాలకు ఎందరెందరు, ఏయే సందర్భాల్లో, ఎన్నెన్ని త్యాగాలు చేశారో గుర్తుచేసుకునే సందర్భమిది. ఇప్పుడు కూడా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, ఆర్థిక సమానత్వానికి నోచుకోని అభాగ్యుల కోసం మన వంతు కృషిగా ఏమి చేయగలమన్న ఆలోచనలకు పదును పెట్టే అవకాశాలుగా భావించాలి. చారిత్రక సందర్భాలను సామాజిక చైతన్య పూర్వక దిశలో కాకుండా సంబరాలుగా జరుపుకునే విషసంస్కృతి నేడు చాప కింద నీరులా ఆవహిస్తున్నది. స్త్రీలకు ఓటు హక్కు లేని, ఆస్తి హక్కు లేని, కనీసం ఒంటి నిండా గుడ్డలు కూడా కట్టుకునే అర్హత లేని, అందరు తినగా మిగిలినది మాత్రమే తినాలన్న నిబంధన నుండి అన్ని రంగాల్లో శాసించే స్థాయికి మహిళలు చేరుకుంటున్నారు. ఇది దానంతట అది జరిగినది కాదు.ఎందరో త్యాగాల వల్ల, మరెందరో బలిదానాల వల్ల మాత్రమే సాధించబడిందని మరిచిపోరాదు.
మహిళా దినోత్సవం రోజున ఒకరికొకరు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలుపుకుని, యాజమాన్యాలు ఇచ్చే చిన్నపాటి బహుమతులు తీసుకోని, సరదాగా కాసేపు ఆటాపాటలు అడ్డుకుని కావాల్సిన విందును ఆరగించి, ఆనక ఇంటికి వెళ్లిపోవడం లాంటివి మహదానందాన్ని ఇస్తున్నట్లు అనిపించవచ్చు. ఇలాంటివి చేయకూడదని కాదు. వేరే ఏ సందర్భంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు చేయవచ్చు. అయితే చారిత్రక సందర్భాల ఇతివృత్తాన్ని పెడచెవిన పెడితే ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఎంత మాత్రం ఉండవు అని గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాటాలకు ప్రతీకగా కాకుండా సంబరాల సందర్భంగా నేటి యాజమాన్యాలు కూడా ఒక పుష్పగుచ్ఛాన్ని తన దగ్గర పనిచేస్తున్న మహిళకు ఇచ్చి సంతృప్తి పరుస్తున్నాయి. యాజమాన్యాల నుండి ఇలాంటి ప్రతిస్పందన కూడా పోరాటాలు సాగినంత కాలం మాత్రమే ఉంటుందని మనం మర్చిపోకూడదు.
లక్షలకొలది జీతభత్యాలు పొందుతూ, పెద్దపెద్ద కార్లలో ప్రయాణిస్తూ, కార్పొరేట్‌ కంపెనీల్లో మంచి మంచిహోదాల్లో ఉన్నవారంతా అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని ఒక వాట్సాప్‌ గ్రీటింగ్‌కు పరిమితం చేసేశారు. లేదా క్లబ్బుల్లో, స్టార్‌ హోటళ్లల్లో సరదా సామూ హిక విందులకు కుదించివేశారు. ఇలాంటి పోకడల పర్యవసానంగా కాబోలు పట్టుమని పాతికేళ్లు కూడా ఒక వెలుగు వెలగని సాఫ్ట్‌వేర్‌ రంగం ఒక్కసారిగా లక్షల్లో జీతాల నుండి వేలల్లో జీతాలకు పడిపోయింది. ఆయా కంపెనీలో జరుగుతున్న శ్రమ దోపిడీ (ఎక్స్‌ప్లాయిటేషన్‌) పైన గళం విప్పి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. జీత భత్యాలు, వసతులు బాగా పెరిగిపోయిన ప్రభుత్వ రంగాల్లో, ప్రభుత్వ డిపార్ట్‌ మెంటుల్లో కూడా ఈవిధమైన పోకడలు పెరిగితే చాలా ప్రమాదం. మహిళా దినోత్సవం సందర్భంగా మీటింగ్‌ ఎందుకు, ఆ మీటింగ్‌లో ప్రసంగాలెందుకు, ప్రశాంతంగా పసందైన విందు వినోదాలతో రిలాక్స్‌ అయితే సరిపోదా! అనే భావజాలం పెరిగితే అది మొదటికే మోసం. మహిళా దినోత్సవాలో లేక మరేదైనా సందర్భాలో జరుపుకునేటప్పుడు సెలబ్రిటీలైనా సినీతారలను, క్రీడాకారులను, ప్రవక్తలను లేదా కమెడియన్లను లేదా ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌ వాళ్లను పిలిచి జరుపుకోవచ్చుగా అని సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వ్యాయా మం చేస్తే అనారోగ్యం దానికి చేరదని అన్నట్టుగానే, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడే కనీసం సందర్భోచిత పోరాటాలను మరువకుండా నిర్వహించినప్పుడే భవిష్యత్‌ ప్రమాదాలను తప్పించుకోగలం.
పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమంటే విద్యాబుద్ధులు నేర్పించి, ఉద్యోగస్తులుగా స్థిరపరిచి, కావాల్సినన్ని స్థిరాస్తులు సమకూర్చడమే అని అనుకుంటాం. కానీ అది చాలావరకు పాక్షికం. ఒక మనిషి ఆర్థిక సామాజిక సమానత్వం తాను జన్మించే ప్రదేశాన్ని బట్టి ఉంటుందట. ఒకే సమయంలో అమెరికాలో, ఇండియాలో పుట్టిన బిడ్డలకి చూస్తే అమెరికా పౌరుడికి ఎనభై శాతం సంపద ఎక్కువ! అనగా మన పిల్లలకు మనము సమకూర్చుకోవాల్సినవి విద్యా,ఉద్యోగ,ఆస్తులు మాత్రమే కాదు, అవన్నీ పుష్కలంగా అందుబాటులో ఉంచగల సమాజం. అలాంటి సమాజం ఏర్పడడానికి జరిగిన కృషిలో మన పాత్ర ఎంత? ఇంకా మిగిలి ఉన్నది ఎంత! ఇట్లాంటి అవగాహనను పెడచెవిన పెట్టడమంటే మన పిల్లలకి భవిష్యత్తు ప్రమాదాన్ని మనమే కల్పిస్తున్నట్లు. అట్లాగని అందరూ ఉద్యమకారుల్లా తిరగబడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి సమూహానికి, లభించిన అవకాశాల్లో ప్రతిస్పందించే అలవాటు చేసుకోవాలి.
ఆర్థికంగా బాగా స్థిరపడి బాధ్యతలన్నీ తీరిన తర్వాత సామాజిక సమస్యలను చర్చించడానికి కొందరు సుముఖంగా లేరు. అన్యాయాల గురించి పీడితుల గురించి, స్త్రీలపై, దళితులపై జరుగుతున్న లైంగికదాడులను ఎవరైనా ఎత్తిచూపితే, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎవరైనా ఎండగడితే.. ఇవన్నీ మనకు అవసరమా అనే విసుర్లు వేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నవి. నినాదాలివ్వడమో, ప్లకార్డులు ప్రదర్శించడమో, ధర్నాల్లో పాల్గొనటమో లేదా ప్రత్యక్ష పోరాటాల్లో భాగం పంచుకోవడం వంటివన్నీ ఆర్థికంగా స్థిరపడిన కొందరికి నామోషీగా అనిపిస్తున్నవి. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. మనం చాలా కష్టపడి చదివాం, అందుచేత మంచి ఉద్యోగం సంపాదించాం, తద్వారా మంచి జీతాన్ని పొందుతున్నాం, మనకెందుకు పోరాటాలు, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే భావన కూడా కొందరిలో కనిపిస్తుంటుంది. పట్టపగలైనా సరే పోలీసోడు తలుపు కట్టి అసంబంధ ప్రశ్నలడిగినప్పుడో, లేదా అకారణంగా ఆఫీసులో నిందలు మోపడమో లేదా నిందితులను చేయడమో జరిగినప్పుడు మనకున్న స్వేచ్ఛ స్వాతంత్య్రాల సంగతి అర్ధమవుతుంది! అప్పుడు గదా సంఘము, సమాజము..అన్ని గుర్తుకొస్తాయి! ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం గుర్తుకు రాదు. తిరగబడి పోరాటాలు చేసే నాయకులు వారి సంఘాలు గుర్తుకొస్తాయి.
చాలా మెరుగైన సమాజంలో ఉన్నాం, స్త్రీలకు అన్ని రకాల హక్కులున్నవి అని భావించేవాళ్లు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిమంటే డెబ్బయి ఐదేండ్ల స్వతంత్ర భారతంలో మహిళల అక్షరాస్యత ఇంకా 75 శాతానికి కూడా చేరలేదు. 35శాతం గర్భిణులు రక్తహీనతతో సతమత మవుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 40శాతం కుంటుబడి ఎదుగుతున్నారు. గృహహింస చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గృహ హింస బారిన పడుతున్న వారి సంఖ్య ఏమీ తగ్గలేదు. ప్రభుత్వ రంగాలు ప్రభుత్వ డిపార్ట్మెంట్‌లో తప్ప ఎక్కడ కూడా స్త్రీలకు పురుషులతో సరి సమానమైన వేతనాలందడం లేదు. పెన్షన్‌ పొందుతున్న వృద్ధుల్లో 30శాతం మంది పురుషులు నిర్లక్ష్యానికి గురౌతుంటే 70శాతం మంది మహిళ పెన్షన్‌దారులు తిండికి నోచుకోలేనంత నిర్లక్ష్యానికి గురవుతున్నారట. ఇలాంటి ఘోరాతిఘోరమైన దౌర్జన్యాలను ప్రశ్నించడానికి మనకు సమయం లేకపోయినా అలాంటి సంఘాలకు చేయూతనివ్వడం నేటి అవసరమని మరిచిపోతే ఎలా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 సందర్భంగా ప్రతిఘటించటం, పోరాటాలు చేయటం ఎవరో ”అలాగా జనాలు” (నిరుపేదలు) చేసేవి కావు. భవిష్యత్తులో మన సొంత పిల్లలే అలాంటి అలాగా జనంగా మారకూడదనే విచక్షణతో జరుపుకోవాలన్న చైతన్యం మనల్ని విడిచిపోరాదు.
(రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
జి.తిరుపతయ్య
9951300016

Spread the love