Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌మహిళా ఎమ్మెల్యేలపై దాడికి రేవంత్‌‌రెడ్డిదే బాధ్యత

‌మహిళా ఎమ్మెల్యేలపై దాడికి రేవంత్‌‌రెడ్డిదే బాధ్యత

- Advertisement -

పోలీసులపై చర్యలు తీసుకోవాలి :బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
సీఎం క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం
ఇదేనా ఇందిరమ్మ ప్రజాపాలన ?
బీఏసీ సమావేశం బహిష్కరణ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

మహిళా ఎమ్మెల్యేలపై దాడికి సీఎం రేవంత్‌‌రెడ్డిదే పూర్తి బాధ్యత అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. సీఎం క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టబోమని చెప్పారు. ఆడబిడ్డల చీరలు లాగి గొంతులు పట్టి జుట్టు లాగడమే ఇందిరమ్మ ప్రజాపాలన అని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెయ్యి రోజుల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామనే భయంతోనే ప్రభుత్వం తమను అడ్డుకుందని చెప్పారు.
రాహుల్‌‌గాంధీకి ఒక నిబంధన, తమకు మరో నిబంధన వర్తిస్తుందా?అని ప్రశ్నించారు. దళిత, మహిళా వ్యతిరేకి ముమ్మాటికీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?అని సవాల్‌ ‌విసిరారు. ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా బీఏసీ సమావేశాన్ని బహిష్కరించామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దాడి చేసి‌న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించామనీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లకు వెళ్తామని అన్నారు. సీఎం కూడా ఎమ్మెల్యేనే అనీ, స్పీకర్‌ ‌పక్షపాత వైఖరిని వీడాలని డిమాండ్‌ ‌చేశారు.
నెలరోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నడపాలని కోరారు. యాదవరెడ్డి, జగదీశ్‌‌రెడ్డి, శంభీపూర్‌ ‌రాజు, సంజయ్‌, హరీశ్‌‌రావుతోపాటు తనను కూడా పోలీసులు గాయపరుస్తూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.

జగదీశ్‌‌రెడ్డికి కేటీఆర్‌ ‌పరామర్శ
అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆస్పత్రితో చికిత్స పొందుతున్న మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌‌రెడ్డిని కేటీఆర్‌ ‌పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీమంత్రులు వేముల ప్రశాంత్‌‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, పాడి కౌశిక్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -