విప్లవ ధృవతార మల్లు స్వరాజ్యం

Revolutionary star Mallu Swarajyamవెట్టిచాకిరీ రద్దు చేయాలని, దున్నేవానికి భూమి కావాలని, నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. ఆ పోరాట ఫలితంగానే తెలంగాణలో నాలుగు వేల మంది వీరమరణం పొందారు.మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.పది లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు. భూస్వాముల భూములు,గడీలు ప్రజల స్వాధీన మైనవి.వెట్టిచాకిరీ రద్దయింది.వడ్డీ వ్యాపారం అక్రమ భేదాఖళ్లు నిలిపి వేయబడ్డాయి. వ్యవసాయ కూలిరేట్లు పెంచబడ్డాయి. గ్రామాలను గ్రామ రైతు కమిటీలు పాలించాయి. ఇలాంటి విప్లవ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ధీర వనిత, అణగారినవర్గాల హక్కుల గొంతుకగా నిలిచారు కామ్రేడ్‌ మల్లుస్వరాజ్యం. ఆమె తృతియ వర్థంతి నేడు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో ని ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. చిన్ననాడే పోరాట పంథాను ఎంచుకున్నారు. పదకొండేండ్ల వయస్సులో ఆమె తండ్రి చనిపోయాడు.అక్క శశికళ కూడా పోరా టంలో మూడేండ్లపాటు జైలు జీవితం గడిపారు.స్వరాజ్యం తల్లి చుక్కమ్మ గొప్ప సామ్యవాది.తన కుటుంబమంతా నేటికి విప్లవ రాజకీయాలతో పెనవేసుకొని ఉన్నది.నాడు చెక్క పలకలపై ఇసుకలో ఓనమాలు దిద్దుకొని క్రమంగా ఐదో తరగతి వరకు విద్యను అభ్యసించారు. చిన్నతనంలో కమ్యూనిస్టు భావాలు అలవర్చుకొని దోపిడీకి వ్యతిరేకంగా,తన సొంత గ్రామంలో గ్రామ పటేళ్ళను,పెత్తందార్లను ఎదిరించి పాలేర్ల సంఘం పెట్టి కూలిరేట్ల ఉద్యమంతో ప్రారంభమైన ఆమె విప్లవ జీవితం ఎనిమిది దశాబ్దాల పాటు ఎన్నడూ వెనుదిరగలేదు.విప్లవమే జీవితంగా భావించారు. ఎన్ని కష్టనష్టాలొచ్చినా, పోరాటాలకు తట్టుకోలేక భూస్వాములు ఆమె సొంత ఇంటిని ధ్వంసం చేసినా, స్వరాజ్యంను పట్టుకుంటే బహుమతులిస్తామని నాటి సర్కార్‌ ప్రకటించినా మొక్కవోని ధైర్యంతో తన అన్న భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి (బి.యన్‌.) అడుగు జాడల్లో నడిచిన పోరాటయోధురాలు స్వరాజ్యం.
1945, 1948 సంవత్సరాల్లో సాగిన వీరోచిత రైతాంగ పోరాటంలో స్వరాజ్యం కీలక పాత్ర పోషించారు. నైజాం సర్కారును గడగడలాడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో దళ కమాండర్‌గా, గోదావరి అడవుల్లో మూడేండ్ల పాటు పాటు పనిచేశారు. ఆమె మొదట జోన్‌ కార్యకర్తగా ఆ తర్వాత ప్రాంతీయ కమిటీ సభ్యురాలిగా, గుండాల కేంద్రంలో కోయ లను ఉత్తేజపరిచి వారికి నాయకత్వం వహించి పోరాటాల్లోకి దింపారు. భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ అణగారిన వర్గాల్లోకి, వ్యవసాయ కార్మికుల్లోకి చొచ్చుకొని పోయి వారిలో ఒకరిగా ప్రజలతో మమేకమయ్యే లక్షణం కలిగి ఉన్న స్వరాజ్యం జీవితాంతం పేదల అభ్యు న్నతికే తపించారు. తదనంతరం మార్క్సిస్టు పార్టీ ఉద్యమంలో కీలకమైన బాధ్యత నిర్వహిస్తూ తుంగతుర్తి శాసనసభ్యురాలిగా గెలిచి ప్రజాప్రతినిధిగానూ సేవలందించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా,మహిళా సంఘం ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వ హిస్తూ అనేక పోరాటల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నైజాం రజాకార్ల బారి నుండి రైతాంగాన్ని రక్షించుకొనేందుకు పదివేల మంది గ్రామరక్షక దళాలు, రెండు వేల మంది గెరిల్లా సాయుధ దళాలు నిర్మించారు. ఫలితంగా సాగిన పోరాటంలో మధ్యయుగాల నాటి నైజాం నవాబు పాలన అంతమొందింది.కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన సాయుధ రైతాంగ పోరాటం అనేక విజయాలు సాధించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా భూసంస్కరణ చట్టం, కౌలుదారి చట్టాలు రూపొందాయి. పౌర హక్కులు, ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాయి. ఈ చారిత్రక పోరా టంలో కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం పాత్ర అద్వితీయం, అజరామరం.ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శం
(నేడు సూర్యపేటలో మల్లు స్వరాజ్యం తృతీయ వర్ధంతి సభ)
– ములకలపల్లి రాములు, 9490098338

Spread the love