ప్రభుత్వరంగంలో విద్య ఉంటేనే విప్లవాత్మక మార్పులు

Narsireddyవిద్యా ప్రయివేటీకరణతో పెరుగుతున్న అంతరాలు
– సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలి
– పట్టణాల్లో కొత్త పాఠశాలలను తెరవాలి: చర్చాగోష్టిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వరంగంలోనే విద్యారంగం ఉండాలనీ, అప్పుడే విప్లవాత్మకమైన మార్పులు రావడం సాధ్యమవుతుందని తెలంగాణ పౌరస్పందన వేదిక (టీపీఎస్‌వీ) రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. టీపీఎస్‌వీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ బడులు నిలబడాలి- చదువులో అంతరాలు పోవాలి’అనే అంశంపై గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చర్చాగోష్టి నిర్వహించారు. అధ్యక్షత వహించిన నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో విద్యాప్రయివేటీకరణ ఎక్కువగా ఉందన్నారు. సర్కారు బడుల్లో ఉచిత విద్య అందుతుండగా, ప్రయివేటు బడుల్లో ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.ఆరు లక్షల వరకు వసూలు చేసే పరిస్థితి ఉందని వివరించారు. దీంతో అందరికీ ఒకేరకమైన విద్య అందడం లేదన్నారు. ఫలితంగా ఆ రంగంలో అంతరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు విద్యారంగం సమాజానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వ, మండల పరిషత్‌, గిరిజన సంక్షేమ పాఠశాలలను కనీసం 75 నుంచి వంద మంది విద్యార్థులుండేలా రీఆర్గనైజ్‌ చేయాలని కోరారు. తరగతికొక గది, టీచర్‌, పాఠశాలకొక ప్రధానోపాధ్యాయుడు, సర్వీసు పర్సన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవసరమైన చోట విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలనీ, లేకుంటే సర్కారు బడులు నిలబడబోవని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం ఇద్దరు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నియమించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల (యూపీఎస్‌)ల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటోందనీ, అవసరమైన చోట వాటిని ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలనీ, లేనిచోట ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్‌ చేయాలని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలనీ, కంప్యూటర్‌ విద్యకోసం ప్రత్యేక టీచర్‌ను నియమించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలపై పర్యవేక్షణ నిరంతరం కొనసాగించేందుకు మండల విద్యాధికారులు (ఎంఈవో), ఉప విద్యాధికారులు (డిప్యూటీఈవో) పోస్టులను మంజూరు చేసి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ, అవసరమైతే విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో అవసరమైన చోట కొత్త ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని సూచించారు. బస్తీ దవాఖానాల తరహాలో కాకుండా అన్ని హంగులతో బడులను ప్రారంభించాలన్నారు. మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రతినెలా ఐదో తేదీలోగా ఏజెన్సీలకు ఇవ్వాలని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చొరవ చూపితే ప్రభుత్వ పాఠశాలలను బాగుచేసుకోవచ్చని అన్నారు. హక్కులతోపాటు విద్యావిధానానికి సంబంధించిన అంశాలపై, బోధనపై కేంద్రీకరించి పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులతోపాటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కామన్‌ స్కూల్‌ విధానం కోసం పోరాడాలన్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం బోధనేతర అంశాలైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టిసారించాలని సూచించారు. సిలబస్‌లో అశాస్త్రీయ అంశాలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గత పాలకుల హయాంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బాగుచేస్తామంటూ కాంగ్రెస్‌ ప్రకటించిందనీ, దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి : రాధేశ్యాం
ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని టీపీఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల ప్రయివేటు విద్యాసంస్థలకే మేలు జరుగుతున్నదని అన్నారు. ఆ నిధులతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులను మెరుగుపర్చే అవకాశముందన్నారు. కేరళ, ఢిల్లీ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యారంగం బాగుందన్నారు. రాష్ట్రంలోనూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు పాలకులు దృష్టిసారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లక్ష్మణ్‌రావు, హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి ఎంఏ సమ్మద్‌, మేడ్చల్‌ అధ్యక్షులు పి సురేష్‌, సలహాదారులు మస్తాన్‌రావు, జతిన్‌తోపాటు వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love