కామ్రేడ్ ఎల్లన్నకు విప్లవ జోహార్లు…

నవ తెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
ప్రజాయుద్ధ పోరుకెరటం కామ్రేడ్ చండ్ర ఎల్లన్న స్పూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ తెలిపారు. కామ్రేడ్ ఎల్లన్న బూటకపు ఎన్కౌంటర్లో అమరత్వం చెంది నేటికీ 28 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ ఎల్లన్న చిన్నతనం నుండి ఎర్ర జెండా పట్టి ప్రజల కోసం ప్రజాయుద్ధ ప్రజాపంథాలో సుదీర్ఘ కాలం ప్రయాణం సాగించి పేద ప్రజల గుండెచప్పుడుగా మారారు అన్నారు.ఇల్లందు ప్రాంతంలో అనేకమంది నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు,పోడు భూములు ఇప్పించి ప్రతి గుడిసెపై ఎర్రజెండాను ఎగరవేసి ఇల్లందు ప్రాంతాన్ని విప్లవ విముక్తి ప్రాంతంగా ఏర్పాటు చేయడంలో ఎల్లన్న పాత్ర అనిర్వచనీయమైనది అన్నారు. ఎల్లన్న నేటికీ ప్రజల గుండెల్లో చెరగని మహోన్నత విప్లవకారుడుగా ముద్ర వేసుకొని, నేటి తరానికి నిలువెత్తు నిదర్శనంగా మారాడు అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడి వెంటాడి బూటకపు ఎన్కౌంటర్ చేసి విలువైన ప్రాణాలను బలి గొన్నది అన్నారు. కామ్రేడ్ ఎల్లన్న స్ఫూర్తితో సూర్యాపేట జిల్లాలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్,రాంజీ, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక,జయమ్మ, పిడిఎస్యు నాయకులు విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love