వర్థంతి అంటే మరణానంతరం కూడా వర్థిల్లే వారసత్వాన్ని సంస్మరించుకోవడం. ఆ మాట పూర్తిగా వర్తించే వ్యక్తి మార్స్స్. పందొమ్మిదో శతాబ్ది ప్రథమపాదంలో పుట్టిన ఆ మహామనీషి సిద్ధాంతాలు ఇరవయ్యవ శతాబ్దాన్ని అనన్య సామాన్యంగా మలచి, ఆ శతాబ్ది చివరలో చిందరవందరలు అధిగమించి 21వ శతాబ్దంలో పునరుజ్జీవం పొందడానికి కారణమైనాయి. అంతకుముందు నడిచింది పాలక వర్గాధిపత్య చరిత్ర. ఆయన భావ ధారతో మొదలైంది పాలకవర్గ ధిక్కార చరిత్ర. మార్క్స్ తత్వాలకూ, సూక్తులకూ పరిమితమైన తాత్వికుల స్థానాన్ని చరిత్ర నిర్మాతల సరసన చేర్చిన అఖండ మేధావి. ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించడం కాదు, మార్చాలంటూ విప్లవ శంఖం పూరించిన సాహస సైద్ధాంతికుడు. వాల్టేర్, రూసో, హెగెల్, లెస్సింగ్, హైనే వంటి మహా తాత్వి కులందరూ ఒక్కటిగా రూపుదాలిస్తే మార్క్స్ అవుతాడని మోజెస్ హెస్ ప్రశంస చేసేనాటికి ఆయన వయస్సు కేవలం 23. ఆయన మరణించి ఇప్పటికి 140 ఏండ్లు గడిచిపోయినా మార్క్స్‌నూ మార్క్సిజాన్ని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా గడవదు. అంతెందుకు? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చి వికృత విధ్వంస విధా నాలు అమలు చేస్తుంటే విశ్లేషకులు మార్క్స్ 18 బ్రూమియర్ ఆఫ్ లూయీ బోనపార్టీని తలుచుకుంటున్నారు. చరిత్ర ఒకసారి విషాదాంతంగా మరోసారి పరిహాసప్రాయంగా పునరావృతమవుతుందన్న ఆయన వ్యాఖ్యలను అమెరికా అధినేతకు అన్వయిస్తున్నారు.
చరిత్ర తర్కం
దేశ దేశాల్లో ప్రాచీనకాలపు వేదాంతులు మనుషుల గురించి చాలా తత్వాలు పాడారు. మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి గాని ప్రతిచోటా సంకెళ్లతో బంధితుడై వున్నాడని ఫ్రెంచి తత్వవేత్త రూసో వాపోయాడు. ఆ మెట్ట వేదాం తాన్ని బద్దలు కొట్టడానికి ఈ తత్వవేత్త వేదన పారదోలడానికి ఏకకాలంలో మార్గదర్శనం చేశాడు మార్క్స్. ఆయన పుట్టక ముందు శ్రమదోపిడీ, విలువ, వర్గం, విముక్తి వంటి పదాలకు వున్న అర్థం వేరు. కష్టపడేవారిపై, జాలి పేదలపై సానుభూతి చాలామంది చూపించినా పరిష్కారం చేయడం అటుంచి చెప్పడం కూడా సాధ్యం కాలేదు. అనేక మంది శ్రమను అతి కొద్ది మంది చట్టరీత్యా దోచుకోవడం వల్లనే శత సహస్ర కోటీశ్వరులు కాగలుగుతున్నారనే పరమ సత్యం చాటి చెప్పి సిద్ధాంత రూపం ఇచ్చాడాయన. ఇప్పటివరకూ నడిచిన (లిఖిత) చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రేనని తేల్చిచెప్పేశాడు. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అని అభయమిచ్చాడు. ఈ క్రమంలోనే వలస దేశాల స్వతంత్ర కాంక్ష కూడా చూడగలిగాడు. భారత స్వాతంత్య్ర పోరాటం గురించి ఏ విదేశీ మేధావి కన్నా ముందు సమగ్రంగా చర్చించిన వ్యక్తి ఆయనే! సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవ స్థల పరిణామ క్రమాన్ని జమిలిగా చూడాలని గ్రహించాడు గనకనే తర్కాన్ని, చరిత్రనూ మేళవించగలిగాడు. అది అతితర్కం కాదు, అనునిత్యం అధ్యయనంతో ప్రతి పరిణామాన్ని పరిశీలిస్తూ పరిపూర్ణం చేసుకోవాల్సిన గతితర్కం. ఆయన చెప్పిన చరిత్రక్రమం రాజవంశాల అనుక్రమణిక కాదు, మానవాళి మజిలీలను మధనం చేసిన మహా ధ్యయనం. ప్రకృతిలో లాగే మానవ సమాజంలోనూ మార్పులొస్తాయని అందుకు శ్రమజీవులు చోదకశక్తులుగా వుం టారని చెప్పిన సారాంశం మార్క్సిజం. అయితే శ్రమదోపిడీ పాఠాలు వల్లె వేస్తేనో లేక బానిస సమాజం, భూస్వా మ్య సమాజం, పెట్టుబడిదారీ సమాజం, సోషలిజం అని ఒక పరంపరను జపిస్తేనో మార్క్సిజమై పోదు. మార్పు రానూ రాదు. ఆ మూల సూత్రాల ప్రాతిపదికన ఆయా దశల్లో శ్రమ దోపిడీ రూపాలు గాని పీడక వర్గ వ్యూహాలు గాని అర్థం చేసుకుని రాజకీయ బలంతో సంఘటిత శక్తితో ఎదిరించాలి. ఒక్కముక్కలో దీన్నే నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్య యనం అన్నారు. ఆచరణలో దాన్ని ఆచరణలో పెట్టి అనుకున్న విజయాలు సాధించడం, వచ్చిన విజయాలు నిలబెట్టు కోవడం నిరంతర సంఘర్షణ.
మన కాలపు దీపధారి
అంతులేని దారిద్రాన్ని, అష్టకష్టాలనూ భరిస్తూనే మేధావిగా రచనలు చేయడమే గాక విప్లవకారుడుగా నిరంతరం పోరాడాడు గనకే మార్క్స్ చరిత్ర గమనంలో ప్రజల పాత్రను పసిగట్టగలిగారు. ఆయన 1883లో మరణిస్తే 1917లో అంటే తను పుట్టిన వందేళ్లకు ఆ విప్లవ సిద్ధాంతం లెనిన్ జయప్రదంగా అమలు చేశాడు. వర్గాలనే కూలగొట్టే ఇంత సమూలమైన మార్పు ఇంత త్వరితంగా వచ్చిన దాఖలా చరిత్రలో మరొకటి లేదు. అది మార్క్స్ బోధనల లెనిన్ వ్యూహాల ఔన్నత్యం. సోవియట్ యూనియన్‌ను స్థాపించాక మార్క్సిజంతో లెనినిజం కూడా చేరినా పునాది మార్క్సిజమే. ఈ విప్లవానికి ముందు వందేళ్లు, తర్వాతి వందేళ్లలో ప్రపంచం ఎలా మారిందీ మారు తున్నదీ పరిశీలించకుండా మార్క్స్ సూత్రాలు బట్టీ వేస్తే ముందుకు పోగలిగింది వుండదు. మార్క్స్ చెప్పిందే అది. నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అంచనా వేయండి అని. కాలం మారింది కాబట్టి విప్లవం, కార్మికవర్గం, శ్రమదోపిడీ వంటి పదాలకు అర్థం లేదని ఎవరైనా అంటే అంతకన్నా తప్పువుండదు.’మార్క్స్ ప్రతీకారం: ప్రపంచాన్ని మలుస్తున్న వర్గపోరాటం’ అని అమెరికన్ పత్రిక టైమ్ 2013లో ముఖపత్ర కథనం ఇచ్చింది. ప్రపంచ దేశాల్లో అన్నిచోట్ల కన్నా ఎక్కువగా అమెరికాలో ఆర్థిక కేంద్రీకరణ ఎలా పెరుగుతున్న తీరుపై తీవ్ర హెచ్చరికలు చేస్తూ వీటిపై మార్క్స్ చెప్పిన వర్గ పోరాటాలు ప్రజ్వరిల్లడం తథ్యమని హెచ్చరించింది. పచ్చి మితవాద భావజాల ప్రతీఘాత దాడి, జాతీయ దురభిమానం, భావ ప్రకటనా స్వేచ్చపై అణచివేత ఇవన్ని మార్క్స్ బోధనలను మరింత ముందుకు తెస్తున్నాయి. దేశ దేశాల్లో కమ్యూనిస్టులు, కార్మిక నాయకులు, ప్రజాస్వామికవాదులు, మానవతా మూర్తులు పోరాడుతున్నారు. ఉద్య మాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజాస్వామిక శక్తులు వీటిపై పోరాడుతూనే ప్రభుత్వాలు నిర్వహిస్తున్నారు. సైద్థాంతిక ఘర్షణలు సాగిస్తున్నారు. కొత్త గుణపాఠాలు నేర్చుకుంటున్నారు. ఇందులో తప్పొప్పులు వుంటాయి. చిన్న పెద్ద విజ యాలూ వుంటాయి. ఎదురు దెబ్బలుంటాయి. కాని మహత్తర త్యాగాలూ వున్నాయి. చెక్కుచెదరని నిబద్ధతలు వున్నాయి. ఈసంక్లిష్ట క్రమాన్ని అవగాహన చేసుకోకుండా శత్రుశక్తులూ మిత్రులనుకునేవాళ్లు కూడా పోరాడే శక్తులను అవహేళన చేయవచ్చు గాని వాటితోనే చరిత్ర ఆగిపోదు.
నిజానికి మార్క్సిజం సైద్ధాంతిక జైత్రయాత్ర కొనసాగుతూనే వుంది. ఈ ముప్పైల్లో పుట్టుకొచ్చిన చరిత్రాంతం, కాలానికి అంతం, దూరానికి అంతం, మహా సిద్ధాంతాల అంతం, ఆధునికత అంతం, సత్యం అంతం అంటూ అంతు పట్టని అంతం సిద్ధాంతాలే సోదిలోకి లేకుండా పోతున్నాయి. మార్క్స్ బోధనలు మార్గదదర్శకంగానే వున్నాయి. సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ దుష్ఫలితాలు ప్రతివారూ అనుభవిస్తున్నారు. అరగంటకో రైతు ఆత్మహత్య, నయా కంపెనీలు నరాలు తెగిపోయేలా సరికొత్త వెట్టిచాకిరి చేయించుకోవడం కనిపిస్తున్నది. ఉద్యోగాలు రాకపోగా వున్న వాటికే భద్రత లేకుండా పోతున్న తీరు మేధావులనే కలవర పెడుతున్నది. మొదట చెప్పినట్టు ట్రంప్ మలిపాలనలో దేశ దేశాలు ఈ మధనానికి గురవుతున్నాయి. ఇప్పుడు ఎలన్ మస్క్ బుల్లి కుమారుడు అమెరికా అధ్యక్షుని పక్కన కూర్చుని మీడియాకు ఫోజులిస్తున్నాడంటే విదేశాంగ మంత్రి రిబిరే, మస్క్ ట్రంప్ ముందే కీచులాడుకుంటున్నారంటే అంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? వరప్రసాదంగా గోచరించిన నూతన సాంకేతిక నిపుణులు కూడా ఎ.ఐ దెబ్బకు విలవిల్లాడక తప్పడం లేదు. వీటిపై మరింత అధ్యయనం చేయడం మార్క్స్ అనుయాయుల కర్తవ్యం. ఉదాహరణకు సిపిఎం మహాసభ ముసాయిదా నయా ఫాసిజంగా పరిస్థితిని వర్ణిస్తే వెంటనే దాడి చేసిన మిత్రులూ శత్రులూ కూడా నిర్దిష్ట అధ్యయనం అనే సూత్రాన్ని విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాలంచెల్లిన మాటలే చెబుతున్నారని ఎగతాళి చేసేవారు వందేళ్ల కిందటి పదాలను భావాన్ని నేటి సందర్భానికి తగినట్టు అర్థం చేసుకోకుండా అలాగే వాడాలనడం మార్క్స్ శైలికే విరుద్ధం. ఆవిరి యంత్రం నుంచి కృత్రిమ మేధా కాలం వరకూ ఒకే మంత్రం వల్లెవేసే వారు ఈ అంశాన్ని గ్రహించలేరు.
అదే బాటలో…
గత ముప్పయేళ్లలో ప్రతికూల పరిణామాలు ఎవరూ కాదనరు. సోవియట్, తూర్పు యూరప్ దేశాల్లో పతనం గాని, దేశంలో బెంగాల్, త్రిపుర వంటి చోట్ల ఓటమి గాని వాస్తవాలే. ఆ ప్రభుత్వాలు వున్నప్పుడు సవాళ్లు లేవని, ఇప్పుడు సర్వం పోయిందని అనుకుంటే అవాస్తవికత అవుతుంది. మార్క్స్ జీవిత కాలంలోనే తొలి కార్మికవర్గ పాలనా వ్యవస్థగా పారిస్ కమ్యూన్ అవతరించి కూలిపోయింది. అయినా సోవియట్ విప్లవం ఆగలేదు. ఇప్పుడు సోవి యట్ లేకున్నా జరిగే పరిణామాలు ఆగడం లేదు. చరిత్ర గమనశీలమైందన్నదే ఆయన ప్రధాన బోధన. వివిధ రూపాల్లో పెట్టుబడిదారీ సంక్షోభాలు, కల్లోలాలూ విరుచుకు పడుతూనే వుంటాయని మార్క్స్ ఎప్పుడో చెప్పింది అడు గడుగునా చూస్తున్నాం. ఇప్పుడు కంపు ట్రంపు దుందుడుకు వ్యూహాలను టారిఫ్ యుద్ధాలనూ మతతత్వ మోడీల కార్పొరేట్ లొంగుబాట్లనూ అర్థం చేసుకోగలం. నయా ఫాసిస్టు తరహా శక్తులు ప్రజావ్యతిరేకులు పంజా విసురుతున్నా ప్రపంచంలో ప్రగతిస్పూర్తి గొడ్డుపోలేదు. మార్క్స్ అంటేనే ఒక ఆగని మార్చ్. మేము అమరులను తలుచుకోవడంతో ఆగిపోక వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం పారడతామని ఆయన అస్తమించిన సమయంలో ఆప్త మిత్రుడైన ఎంగెల్సు అన్నమాట ఇప్పటికీ పరమ సత్యమై నడిపిస్తుంది. మార్క్స్ అంటేనే మార్చ్. అహరహం అధ్య యనంతో అవిశ్రాంత కార్యాచరణతో త్యాగనిరతితో ఆ మహాప్రస్థానం కొనసాగించాల్సి వుంటుంది.
(నేడు కారల్ మార్క్స్ 142వ వర్థంతి)
– తెలకపల్లి రవి