ప్రేమ‌కు రూపాలెన్నో..!

There are many forms of love..!మనలో చాలా మందికి ప్రేమ అనగానే యువత మాత్రమే కనిపిస్తారు. కానీ ప్రేమ అనేది ఎవరిపైనైనా ఎప్పుడైనా కలిగే ఒక స్వచ్ఛమైన అనుభూతి. దాన్ని మాటల్లో వర్ణించలేము. ప్రేమ అంటే కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే అనుకుంటే పొరపాటు. ప్రేమకు భిన్నమైన రూపాలుంటాయి. భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల మధ్య వుండే ప్రేమ, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు వీరి మధ్య కూడా ప్రేమ వుంటుంది. కానీ మనలో చాలా మంది నేటి సమాజంలో కూడా ప్రేమ అంటే అదేదో చేయకూడనిది అనే భావనతో ఉన్నారు. అన్ని ప్రేమలు ఒక్కటి కావు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిపై చూపించే ప్రేమ రకరకలుగా ఉంటుంది. వారు చూపించే ప్రేమను బట్టే మనం వారి మధ్య వుండే బంధాన్ని అంచనా వేస్తాము. కానీ ఆ ప్రేమను పొరపాటుగా అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి ఇబ్బంది? అవి ఏమిటి..? అనేది ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదువుదాం…
పార్వతికి దాదాపుగా 52 ఏండ్లు ఉంటాయి. ఉద్యోగం చేసి వాలెంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాపకు పెండ్లి జరిగి అమెరికాలో ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. రెండు మూడేండ్లకు ఒకసారి ఇండియాకు వస్తుంటుంది. రెండో పాప ఉద్యోగం చేస్తుంది. ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇంట్లో గడిపేందుకు ఎక్కువ సమయం ఉండదు. ఎప్పుడైనా సమయం దొరికితే పార్వతితో కొద్దిసేపు గడుపుతుంది. అది ఎప్పుడో ఆరు నెలలకు, ఏడాదికి ఒక్కసారి. ఆమె ఉద్యోగరీత్యా కొంచెం బిజీగా ఉంటుంది. కాబట్టి ఆమెను తప్పుబట్టేందుకు అవకాశం లేదు. పెండ్లి చేసుకో అంటే ‘నాకు పెండ్లి చేసుకునే సమయం లేదు. ఇంట్లో ఉన్న మీకే సమయం కేటాయించలేక పోతున్నాను. అలాంటిది పెండ్లి చేసుకుంటే ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లుగా అత్తగారింట్లో ఉండదు కదా! పెండ్లి అయితే భర్తకు, అత్తమామలకు, వారి కుటుంబ సభ్యులకు కచ్చితంగా ప్రతి రోజూ నేను సమయం కేటాయించాలి. ప్రస్తుతం నా దగ్గర అంత సమయం లేదు. ఇంకా రెండేండ్లు అయితే అప్పుడు నేను ఫ్రీ అవుతాను. ఆ తర్వాత పెండ్లి గురించి ఆలోచిస్తాను’ అంటుంది.
ఇకపోతే భర్త సుదర్శన్‌. ఆయన పార్వతి కంటే మూడేండ్లు పెద్దవాడు. ప్రస్తుతం ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఇంకో ఐదేండ్లలో రిటైర్‌ అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో పార్వతితో మాట్లాడేవారు ఎవరూ లేరు. భర్త సుదర్శన్‌ కూడా ఉదయం వెళితే రాత్రికి వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఆమెతో కొంచెం సేపు మాట్లాడాలి అనే ఆలోచనే అతనిలో ఉండదు. ఈ వాతావరణంలో పార్వతికి జీవితంపై ఆశ అనేదే లేకుండా పోయింది.
‘అసలు నాకు నా జీవితం నుండి ఏమి కావాలి? నేను ఎవరి కోసం జీవిస్తున్నాను?’ అనే ఆలోచన మొదలు అయ్యింది. తీవ్రమైన నిరాశా, నిస్సహాయత ఆమెలో మొదలైంది. ఎవరితో కలిసేది కాదు. వాళ్ల చుట్టుపక్కల వారు కూడా ఒకరితో ఒకరు కలిసి సరదాగా మాట్లాడుకోరు. ‘నేను ఇలాగే వుంటే తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం వుంది’ అనుకొని ‘ఎలాగైనా నాకు నేను ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే కొంత సమయం అక్కడ వెళ్లిపోతుంది. నలుగురితో కలిసినట్లుగా కూడా ఉంటుంది’ అనుకొని పెయింటింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లింది. అక్కడ అందరూ ఆమె కన్న చాలా చిన్న వారు ఉన్నారు. మొదట్లో ‘పిల్లల మధ్య నేను ఎలా నేర్చుకోవాలి’ అనుకుంది. కానీ ‘నేర్చుకోవడానికి వయసుతో సంబంధం ఏమిటి మాకు వచ్చింది మేము నేర్పిస్తాము. అలాగే మీకు వచ్చింది మీరు మాకు నేర్పించండి’ అంటూ ఆ గుంపులో నుండి రమేష్‌ మాటలు వినిపించాయి ఆమెకు. ఇదేదో బాగుంది అనుకొని ప్రతి రోజూ వెళ్లడం ప్రారంభించింది. ఆమెకు రమేష్‌తో మాట్లాడడం, అతనితో సమయం గడపడం బాగా నచ్చింది. అది ఒక అలవాటుగా మారింది. నెమ్మదిగా ఆమెలో మార్పు మొదలయింది.
పార్వతిలో వచ్చిన మార్పును చూసి భర్తకు అనుమానం కలిగింది. ఎప్పుడూ లేనిది ఈమెలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. కానీ పార్వతికి విషయం అర్థం కాలేదు. ఒక రోజు ఆమె పెయింటింగ్‌ నేర్చుకునే దగ్గరకు వెళ్ళి అక్కడి వారినందరిని తిట్టడం, దూషించడం లాంటివి చేశాడు. పార్వతికి చాలా బాధ అనిపించింది. అది సరిపోదు అన్నట్టు పార్వతికి విడాకులు ఇవ్వడానికి నోటీసు కూడా పంపించాడు. అది తీసుకొని ఆమె ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
మేము సుదర్శన్‌ను ఆఫీసుకు పిలిచి ‘ఈ వయసులో విడాకులు ఎందుకు తీసుకోవాలను కుంటున్నారు’ అని అడిగితే ‘ఈమె ఈ వయసులో వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. లేకపోతే ఎందుకు ఇంత సంతోషంగా ఉంటుంది. నాతో గడిపిన ఇన్నేండ్లలో ఎప్పుడూ ఇంత ఆనందంగా లేదు. అప్పుడు ఎప్పుడో మాకు పెండ్లి అయిన కొత్తలో కనిపించిన ఆనందం ఇప్పుడు ఆమెలో కనిపిస్తుంది. కాబట్టి నాకు ఆమెపై అనుమానం వచ్చింది. అందుకే నోటీసు పంపించాను’ అన్నాడు.
‘ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా! నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉంటున్నావు అని ఆమెనే మీరు నేరుగా అడగాల్సింది. అలా కాకుండా ఈ వయసులో అనుమానించడమే కాకుండా విడాకుల నోటీసు పంపించారు. పార్వతి మధ్యలో కలగజేసుకొని ‘నేను పెయింటింగ్‌ నేర్చుకునే దగ్గర అందరూ చిన్న పిల్లలే మేడం. వాళ్లతో సమయం గడుపుతుంటే నాకు చాలా సంతోషంగా వుంది. మాకు పెయింటింగ్‌ నేర్పించే రమేష్‌కు కూడా 30 ఏండ్లు ఉంటాయి. అతని మాటలు కొత్తగా ఉంటాయి. అతనితో మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ రమేష్‌ వయసులో చాలా చిన్నవాడు. ఇంట్లో నాతో మాట్లాడటానికి ఎవరికీ టైం ఉండదు. అలాంటప్పుడు నేను బయటకు వచ్చి నాకు నచ్చిన ఆర్ట్‌ను నేర్చుకోవడంలో తప్పేముంది. సుదర్శన్‌కు నచ్చకపోతే ‘వద్దు నువ్వు బయటకు వెళ్ళకు’ అని చెబితే సరిపోతుంది కదా! మాకు పెండ్లి జరిగి దాదాపు 32 ఏండ్లు అవుతుంది. ఇన్ని ఏండ్లలో ఆయన నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా. అసలు ఎప్పుడైనా నాతో మాట్లాడితే కదా నా గురించి తెలిసేది. ఇంతకు ముందు నేను కూడా ఉద్యోగం చేసే దాన్ని. నాకు కూడా సమయం ఉండేది కాదు. కానీ ఈ మధ్యనే నేను ఒంటరిగా ఫీల్‌ అవుతున్నాను. అందుకే బయటకు వెళ్లాను. ఆయనకు కావల్సింది విడాకులే అయితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’ అంది.
ఇంకా మాట్లాడుతూ ‘రమేష్‌ అంటే నాకు ప్రేమ వుంది కానీ సుదర్శన్‌ అనుకునే విధంగా కాదు. నేను నా పిల్లలను కూడా ప్రేమిస్తాను. సుదర్శన్‌ను కూడా ప్రేమిస్తున్నాను. కానీ సుదర్శన్‌పై, పిల్లలపై చూపించే ప్రేమలో తేడా ఉంటుంది. అలాగే నా స్నేహితులను కూడా ప్రేమిస్తాను. వాళ్లపై చూపించే ప్రేమలో తేడా ఉంటుంది. స్నేహానికి కూడా వయసుతో సంబం ధం లేదు. రమేష్‌ నాకు మంచి స్నేహితుడు. అతని మీద చూపించే ప్రేమ వేరుగా ఉంటుంది. ఆ తేడాను అర్థం చేసుకోలేని సుదర్శన్‌కు భార్య స్థానంలో ఉండాలి అంటే కష్టంగా వుంది. కాబట్టి ఆయన అడిగినట్లుగానే విడాకులు ఇస్తాను’ అంది.
‘సుదర్శన్‌.. మీరు పార్వతికి సమయం ఇవ్వడం నేర్చుకోండి. భార్య అయినంత మాత్రానా ఆమెపై సర్వ హక్కులు నావే అనుకుంటే పొరపాటు. ఇన్ని రోజులు ఆమె సంతోషం గురించే కాదు, డిప్రెషన్‌లోకి వెళుతున్న విషయం కూడా గమనించలేదు. కానీ ఆమె ఇప్పుడు సంతోషంగా ఎందుకు ఉంది అని అనుమానిస్తున్నారు. విడాకులకు నోటీసు కూడా పంపించారు. అసలు తప్పు చేసింది మీరు. ముందుగా పార్వతితో కొంత సమయం కేటాయించి ఆమెతో కాస్త మాట్లాడండి. పెండ్లయిన కొత్తలో ఆమెపై ఎలాంటి ప్రేమ చూపించారో అందులో కొంత భాగమైన చూపించండి. అప్పుడే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు పోతాయి. పార్వతి చూపించే ప్రేమలో తేడాను గమనిస్తే మీకే అర్థం అవుతుంది. ఆమెను అనవసరంగా అనుమానించి మంచి భార్యను దూరం చేసుకోకండి’ అని నచ్చజెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి, 9948794051

Spread the love