– వడ్డి వ్యాపారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
– రూ.10 లక్షల ఆర్థిక సహాయ అందజేయాలిఅందించాలి
– అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక రాష్ట్ర ప్రతినిధులు వి ప్రభాకర్, దేవారం
నవతెలంగాణ-జక్రాన్‌పల్లి
రైతు కుంట రాజేష్ కుటుంబాన్ని వేధించిన వడ్డీ వ్యాపారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని , రాష్ట్రవ్యాప్తంగా ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రాజేష్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని రాష్ట్ర అఖిలభారత ప్రగతిశీల వ్వసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రతినిధులు వి ప్రభాకర్, దేవారం శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల పరిధిలోని అర్గుల్ గ్రామంలో కుంట రాజేష్ రైతు ఆత్మహత్యపై అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, ఉమ్మడి ప్రతినిధులు నిజనిర్ధారణ సేకరణ శనివారం నిర్వహించారు. వాస్తవాలు సేకరించడానికి ప్రతినిధులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవారం, జిల్లా అధ్యక్షులు సారా సురేష్, నాయకులు బి బాబన్న, గంగారాం, గంగాధర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కే. గంగాధర్, దేవన్న, పి డి ఎస్ యు పి డి ఎస్ సి జిల్లా అధ్యక్షులు నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్‌తో కూడిన ప్రతినిధి బృందం గ్రామంలో పర్యటించి వివరాలు ఆరా తీసింది.
ఈ సందర్భంగా నాయకులు వివరాలు వెల్లడించారు. ‘కుంట రాజేశ్(42)కు ఉమ్మడి కుటుంబంలో ఎకరం 20 గుంటల భూమి తన భాగంగా వచ్చింది. తనకి ఇద్దరుమారులు. పెద్దబాబు ఇంటర్మీడియట్. చిన్నబాబు 9వ తరగతి చదువుతున్నాడు.. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన ఎకరం 20 గుంటల భూమిలో వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపడలేదని 13 సంవత్సరాలు దుబారు, కత్తర్ దేశాలకు వెళ్లి అక్కడ పనిచేశాడు. వచ్చిన తర్వాత 14 ఈసాల భూమిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ కు ధరణి ఆటంకాలతో రిజిస్ట్రేషన్ కాలేదు. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన ఎకరం 20 గుంటలు కూడా తన పేరు నమోదు కాలేదని ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. సాగుకు నీళ్లు సౌకర్యం లేక 550 ఫీట్ల వరకు బోర్ వేశాడు. నీళ్లు పడలేదని మరొక బోరు 450 ఫీట్లు వేశాడు. అందులోని సైతం నీళ్లు పడలేదు. కానీ అప్పుల భారం పెరిగింది. అప్పులు తీర్చడానికి ఇటుక బట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇటుక బట్టి వ్యాపారంలో సైతం కూలీలు సహకరించకపోవడంతో అప్పుల పాలయ్యాడు. గ్రామంలో ఫైనాన్స్ వడ్డీ 100కు మూడు రూపాయల చొప్పున 50 లక్షలకు పైగా అప్పు చేయడంతో నెలకు 80 వేల రూపాయలు వడ్డీలకే అప్పులు తెచ్చి కట్టడం అప్పుల భారం పెరిగిందని కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు.
మరొక 30 లక్షల వరకు రెండు రూపాయల వడ్డీల కాడికి స్నేహితుల దగ్గర, మహిళా సంఘాల ,దగ్గర అప్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ అప్పులు ఇచ్చిన వారు ఇంటికొచ్చి హెచ్చరించారని, ఫోన్లో ఈ నెల 18వ తేదీ వరకు కట్టకపోతే బాగుండదని హెచ్చరించారని తమ ఆవేదనలు గుర్తు చేశారు.’
ఎలాంటి చట్టబద్ధత లేని ఫైనాన్స్ వ్యాపారులు ఒత్తిడి మూలంగా, తమకున్న భూముల అమ్మడానికి ధరణి కలిగించిన ఇబ్బందులతో భూములు అమ్మకాలు జరగకపోవడంతో అప్పులు తీర్చలేని స్థితిలో ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి తన ముందు ఏ మార్గం కనిపించలేదని ఆత్మహత్యే మార్గంగా ఎంచుకున్నాడని తాము భావిస్తున్నట్టు తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కలిగించిన ధరణి శాపం మూలంగా ధరణి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం మూలంగా ఒక యువ రైతు నిండు ప్రాణం పోయిందని దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేఆరు. రైతు బీమా కింద వచ్చే ఐదు లక్షలు.. కుటుంబానికి మరో ఐదు లక్షలు మొత్తం 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని, పిల్లలకు ప్రభుత్వమే ఉన్నత చదువులు చదివించాలని డిమాండ్ చేశారు.
ఫైనాన్స్ వేధింపులకు గురిచేసినవడ్డీ వ్యాపారుల పైన క్రిమినల్ కేసులు పెట్టి వడ్డీలకు వడ్డీలు వసూలు చేసిన మొత్తం రుణాన్ని రద్దు చేయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ధరణి సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని లేనియెడల ఇలాంటి ఆత్మహత్యలు మరెన్నో జరిగే అవకాశం ఉంద రైతు ఆత్మహత్యలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రైతులకు అన్ని పంటలకు మద్దతు ధరపై అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ ధర ఇవ్వాలని.. సాగులో ఉన్న రైతులు అందరికీ రైతు భరోసా ఇవ్వాలని.. కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.