నాణ్యతలేని మాంసం విక్రయాలు?

– జబ్బు పడిన జీవాల మాంసం విక్రయం
– మామూళ్ల మత్తులో అధికారులు
– పట్టించుకోని మంథని మున్సిపల్‌ పాలకవర్గం
నవతెలంగాణ-మంథని
వారంతం వచ్చిందంటే చాలు సగటు జీవులు రైరు మని మాంసం మార్కెట్‌కు పరిగెత్తుతారు.కంటికి ఇంపుగా కనిపించిన మాంసాన్ని కావలసినంత తూకం వేయించి కొనుగోలు చేస్తారు. ఇంటికి తీసుకొచ్చి కుటుంబంతో కలిసి విందు చేసుకుంటూ ఆదివారం హాయిగా గడిచింది అనుకుంటారు. కానీ ఆ మాంసం జబ్బు పడిన గొర్రెది అని తెలిస్తే తూకంలోనూ,నాణ్యతలోనూ వ్యాపారి మోసం చేశాడని గ్రహిస్తే ఆ వినియోగదారుల మనసు చివక్కుమంటుంది. ఆదివారం అనే ఆనందం ఆవిరై పోతుంది. ఇవేవీ తెలియక ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రులు పాలు కాక తప్పదని తెలుస్తుంది. అందులోనూ మంథని ప్రాంతంలో ఈ తంతుకు అడ్డుకట్ట వేసే వారే లేకపోవడంతో వారి మాంసం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. మంథని పట్టణంలోని 6 మాంసం విక్రయశాలలో ప్రతిరోజు 6 నుండి 10 వరకు మేకలు గొర్రెలను వధించి మాంసం విక్రయాలు జరుపుతు న్నారు.కొందరు మాంసం వికయోగదారులు అనారోగ్యాల బారిన పడిన మేకలను,గొర్రెలను వధించి ప్రజలకు రోగాల మాంసం అంటగడుతున్నారని విమర్శ‌లున్నాయి. ఇంత జరిగినా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంథనిలో పశువధశాల లేకపోవడంతో జనావాసాల మధ్య గొర్రెలు మేకలను వధిస్తున్నారు.దీంతో అక్కడ పేరుకుపోయిన వాటి రక్తం,వ్యర్థ పదార్థాలపై ఈగలు,దోమలు చేరి అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.మున్సిపల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో కాంట్రాక్ట్‌ చేజిక్కించుకున్న కాంట్రాక్టర్‌తో మాంసం వ్యాపారులు కుమ్మక్కై విచ్చలవిడిగా మేకలు, గొర్రెలను వధిస్తూ గ్రామీణ ప్రాంత అమాయకులను దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు శుభ్రమైన మాంసాన్ని అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్యశాఖ సహకారంతో కొన్ని నిబంధనలు రూపొందించింది.
మాంసం విక్రయదారులు సాయంత్రం వేళ స్థానిక వెటర్నరీ వైద్యుడు, (పంచాయతీ),మున్సిపల్‌ అధికారి ఆధ్వర్యంలో మేకలకు,గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి.అనంతరం వారు వాటి ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ వాటి మెడవద్ద లేదా చెవులకు గుర్తులు వేస్తారు.ఇలా గుర్తు వేసిన మేకలు,గొర్రెలను మాత్రమే పశు వధశాల వద్ద వధించేందుకు వీలుంటుంది. మున్సిపల్‌ ఆధీనంలోని సిబ్బంది ముందు మాత్రమే మేకలు,గొర్రెలను వధించాలి. ప్రభుత్వ నిబంధనలను విక్రయదారులు తుంగలో తొక్కుతున్నారు. మంథని మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అండదండలతో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా మంథని మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు,ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మాంసం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని మంథని మండల ప్రజలు కోరుతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి
– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్‌
రోగాల బారిన పడిన మేకలు గొర్రెలను వధిస్తూ మాంసం విక్రయదారులు సొమ్ము చేసుకుంటున్నారు. వీరిపై సంబంధిత అదికారులు చర్యలు తీసుకోవాలి.మున్సిపల్‌ పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతోనే వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

రోగాలు వ్యాపిస్తున్నాయి: ఆర్ల సందీప్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు
మంథనిలో మేకలు,గొర్రెలను వధించడానికి సరైన స్లాటర్‌ స్థలం లేదు. వ్యాపారులు తమ తమ ఇళ్ల మధ్యనే వధిస్తుండడం వాటి వ్యర్ధాలతో దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

స్లాటర్‌ కోసం ప్రతిపాదనలు పంపాం
– గట్టు మల్లికార్జున స్వామి, మున్సిపల్‌ కమిషనర్‌
మంథనిలో మేకలను వధించేందుకు స్లాటర్‌ కోసం పాలకవర్గంతో తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం అవి రాగానే పనులు మొదలు పెడతాం.. మంథని వెటర్నిటీ డాక్టర్‌ ప్రతిరోజు మేకలను పరీక్ష చేసి సర్టిఫికెట్‌ ఇస్తారు. వాటికే మున్సిపల్‌ ముద్రలు వేస్తుంది. అక్రమాలకు పాల్పడిన వారి లైసెన్సులు రద్దు చేస్తాం.

Spread the love