– అసంపూర్తి ప్రాజెక్టులపై ఆర్థిక మంత్రి భరోసా
– ఇప్పటికే కొన్నింటికి నిధులు..మరికొన్నింటికి హామీ
– ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల పూర్తికి సర్కారు దృష్టి
– పూర్తయితే సాగులోకి రానున్న లక్షల ఎకరాలు
ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. వివిధ నదులు, వాగులపై నిర్మించిన పలు ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండగా.. వాటిని పూర్తి చేస్తామని భరోసానిచ్చింది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పలు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు పేర్కొనడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వీటితో పాటు కొత్తగా మరికొన్నింటినీ కూడా పూర్తిచేస్తామని భరోసా ఇవ్వడంతో పాటు పలు వాగులపై ఎత్తిపోథల పథకాలను నిర్మిస్తామని చెప్పడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేందుకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు నిధులు విడుదల కాగా..మిగితా వాటికి సైతం నిధులు కేటాయించి పూర్తిచేస్తామని పేర్కొన్నారు. మరోపక్క ఉమ్మడి జిల్లావాసుల అకాంక్ష అయిన ప్రాణహిత ప్రాజెక్టు పనుల ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో 80శాతం మంది రైతులు వర్షాధారం మీదనే ఆధారపడి పంటలు పండిస్తుంటారు. ఖరీఫ్‌లో అత్యధికంగా వర్షాధారమే సాగుకు కీలకం కాగా..రబీ సీజన్‌లో మాత్రం ఆయా సాగునీటి ప్రాజెక్టులే రైతులను కాపాడుతున్నాయి. ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో వాటి ఆయకట్టు కింద రబీలో వేలాది ఎకరాల్లో పత్తితో పాటు పాటు వరి, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు సాగుచేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో ఎల్లంపల్లి, సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ వంటి ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాల్లో పంటలు సాగులోకి రాగా.. మిగితా కొన్ని ప్రాజెక్టుల ద్వారా మరికొన్ని ఎకరాలు తడుస్తున్నాయి. కానీ కొత్తగా నిర్మించిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పనులను అప్పటి ప్రభుత్వాలు అసంపూర్తిగా వదిలేయగా.. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం జరగలేదు. దీంతో ప్రాజెక్టులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లా సరిహద్దు గుండా ప్రవహిస్తున్న ప్రాణహిత నదిపై తొలుత ప్రాజెక్టు నిర్మించాలని యోచిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తాజాగా ఆయా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై దృష్టిపెట్టింది.
దాదాపు అన్నింటికీ నిధులు..!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా అనేక హామీలు గుప్పించారు. గతంలో ఆయన సీఎల్‌పీ నేత హోదాలో ఉమ్మడి జిల్లాలోనే పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. పలు ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తిచేయాలని చెప్పడంతో అనేక సమస్యలను ప్రస్తావించారు. వాటిని విన్న ఉప ముఖ్యమంత్రి తాజాగా వాటిని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలో ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని మీడియం, మైనర్ ప్రాజెక్టులను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాణహిత ప్రాజెక్టు పనులను నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని, సదర్మాట్‌ను నెలలోనే పూర్తిచేస్తామని భరోసా ఇచ్చారు. వీటితో పాటు కుప్టి, చిక్‌మాన్, త్రివేణి సంగమం, పులిమడుగు, సుద్దవాగు, గొల్లవాగు తదితర వాటికి ఇప్పటికే నిధులు కేటాయించగా.. కుమురంభీం (అడ), చనక-కోర్ట ప్రాజెక్టుల కాల్వల నిర్మాణం చేపడుతామని భరోసా ఇచ్చారు. వీటితో పాటు పిప్పిరి, బుగ్గారం, తేజాపూర్ వద్ద ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరుచేశారు. ఇది వరకే నీల్వాయి, సదర్మాట్, మత్తడివాగు, పిప్రి ఎత్తి పోతల పథకాలకు నిధులు విడుదలయ్యాయి.
సాగులోకి మరిన్ని ఎకరాలు..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 17.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. కొత్త ప్రాజెక్టులన్ని పూర్తయితే ఈ సంఖ్య మరింత అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. వర్షాధారం మీదనే కాకుండా..ప్రాజెక్టులు సైతం పంటలకు జీవనాధారంగా మారనున్నాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహేటీ వద్ద ప్రారంభమైన ప్రాణహిత ప్రాజెక్టు పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది.ఇక్కడి ప్రాజెక్టును కాళేశ్వరం తరలించడంతో ఉమ్మడి జిల్లావాసులకు నిరాశ ఎదురైంది. తాజాగా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆశలు చిగురించాయి. ఇది పూర్తయితే కుమురంభీం, మంచిర్యాల జిల్లాలో అదనంగా లక్ష ఎకరాలు సాగులోకి రానున్నాయి. కుమురంభీం, చనక- కోర్ట ప్రాజెక్టులకు కాల్వ నిర్మాణం చేపడితే మరో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ వేలాది ఎకరాలు సాగులోకి రానున్నాయి.వీటితోపాటు కొత్తగా నిర్మించాల్సిన కుప్టి తదితర ప్రాజెక్టులతోనూ ఉమ్మడి జిల్లాలో అనేక ఎకరాలకు నీటి తడి లభించనుంది. అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది.