సమసమాజ కాంక్షే ఇతని కవిత్వం

His poetry is a social construct.గన్నోజు ప్రసాద్‌ నాకు 2012 డిఎస్సీ ద్వారా పరిచయం. ఇద్దరం అదే డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు ఉద్యోగం సంపాదించాం. మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి. నిర్మల హదయుడు. స్నేహితులుగా ప్రయాణం చేస్తున్న క్రమంలోనే అతడు కవిత్వం రాస్తాడని తెలిసింది. తాను రాసిన కవితలు కొన్ని చదివాను. అందులో ప్రాసతో కూడిన పదాలతో అల్లిక చేసిన కవిత్వం కానొచ్చింది కానీ ఏదో తెలియని తాజాదనం మాత్రం నన్ను ఆశ్చర్యపరిచింది. అది అతని తొలినాళ్ల కవిత్వం.
ఇప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత ‘గాయమెరుగని సముద్రం’ కవితా సంపుటితో ముందుకు వస్తున్నాడు. ఇందులో పరిణతి చెందిన కవిత్వం కనిపిస్తుంది. సమాజాన్ని అవగాహన చేసుకున్న విధానం, వ్యక్తుల ఆంతరంగికత, వివిధ అనుబంధాలను గుర్తు చేసుకుంటున్న కవిత్వం ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. చాలా కవితల్లో తత్వాన్ని కూడా జోడించాడు. ఊరును, కన్నతల్లిని, కన్నతల్లి లాంటి బడిని కవితల్లోకి తీసుకువచ్చి నేటి కాలపు స్థితిగతులను పునః పరిచయం చేస్తున్నాడు. సమాజాన్ని ఒక రకంగా జాగతం చేస్తున్నాడు.హొహొహొహొ
అమ్మకు తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఈ కవితా పాదాలను పరిశీలిస్తే తల్లి గొప్పతనమేంటో పూర్తిగా అవగతమవుతుంది. ”తెలిసి తెలియని ఊహల్లో/ తెలివికి తోడైన మా అమ్మ/ అనుభవ పాఠాలు నేర్పిన ఆదిదేవత” అంటూ అమ్మను మొదటి దేవతగా కీర్తించడం ఎంత గొప్ప విషయం .అంతే కాకుండా కొలిమి మాటున దాగిన కష్టాల జీవితాన్ని కళ్ళముందు పరుస్తున్నాడు. ‘నిప్పుల కొలిమి’ అనే కవితలో తను బాల్యంలో అనుభవించిన స్థితిగతులను, బహుజన దక్పథ సోయితో తమ వత్తి పనితోహొ భారంగా జీవితాన్ని గడిపే స్థితిని కవితా వాక్యాల్లోకి పట్టుకొచ్చాడు. ”నిప్పుల కొలిమి నెగడు తాగుతుంది/ ఆకాశాన్ని తాకే అగ్నిజ్వాలల్లో ఎర్రని మంటలు/ ఎగిసిపడుతున్న ఆ చీకటి జ్వాలల్లో నా బాల్యం గుర్తుకొస్తుంది” అంటూ కొలిమి పని చేసే వాళ్ళు ఎదుర్కునే ఊపిరితిత్తుల సమస్యలను, కళ్ళ సమస్యలను అర్థం చేయించాడు. ఈ కవిత తన బాల్యం గురించి రాసినట్టు ఉంటుంది కానీ ఇది కొలిమి పని చేసే అందరికి వర్తిస్తుంది.
సామాజిక అసమానతలను తెలియజేస్తూ రాసిన మరోకవిత ‘తేడా’. ఇందులో పేదవాడికి, ఉన్నవాడికి మధ్య ఉన్న తేడాను స్పష్టం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. కవి సమసమాజ కాంక్షను తెలియపరుస్తున్నాడు. శ్రామికుల పక్షాన రాసిన కవితలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి.
”సమసమాజం అంటే/ క్రెడిట్‌ కార్డుకు డెబిట్‌ కార్డు కు ఉన్నతేడా/ పుస్తెలు తాడుకు పూలతాడుకున్న తేడా” అంటూ నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూపిస్తున్నాడు. ఉన్నవాడికేమో స్విస్‌ బ్యాంకుల్లో మూలధనం. లేనివాడికేమో అప్పుల తిప్పలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మనుషుల స్వభావాన్ని తెలియజేస్తూ నమ్మించి గొంతుకోసే మగాలు పూలతాడును పేనుతాయని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలోచనాత్మక కవితలు ఈ సంపుటి నిండా ఉన్నాయి. జీవితానికి, అద్దానికి ఉన్న సంబంధాన్ని చెబుతూ మనసు అద్దాన్ని తెరిచి చూసుకోమంటాడు. గాయాల బాటలో నడుస్తూ ‘సముద్రం’గా మారిన ఒకానొక సంకటస్థితిని పదాలుగా ఒప్ప జెప్పుతున్నాడు. మట్టిని, రైతును కలవరిస్తున్నాడు. ప్రకతితో మమేకమవుతూ తెల్లకొంగల పాదస్పర్శతో పులకించిపోతున్నాడు.
ఈ కవితాసంపుటి ద్వారా మనకు మంచి కవిత్వం రాస్తున్న కవిగా పరిచయం అవుతున్నాడు. భవిష్యత్తులో ఇంకా తనను తానే మించిపోయే కవిత్వాన్ని రాస్తాడని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. తనదైన నిర్మాణశైలితో, ‘పొసగ ముత్తెపుసరుల్‌ పోహణించిన లీల’ అన్నట్లుగా కవిత్వం రాస్తున్న మిత్రునికి అభినందనలు.
– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551

Spread the love