హైదరాబాద్ మహానగరం అందమైన పరిశుభ్రత కలిగిన నగరం అని గతంలో ఘనంగా కీర్తింపబడేది. దానికి కారణం ఉదయం మనం లేవకముందే సిటీని మొత్తం శుభ్రపరిచేది సపాయి కార్మికులు. కానీ సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత ఇప్పుడు వారికి అదనంగా పనులు కల్పించడంతో నగర శుభ్రత ప్రశ్నార్థకంగా మారింది. నగరం ఎంత అందంగా ఉన్నా రోడ్ల మీద చెత్త, డ్రెయినేజీ కంపు కనపడకూడదు. ఇది వాహనదారులకే కాదు, ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేదే. నాలుగైదు దశాబ్దాలతో పోలిస్తే జనాభా గృహాలు, వాటి సముదాయాలు, ఆకాశహార్మ్యాలు, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు విస్తృతస్థాయిలో ఏర్పడ్డాయి. కానీ, సమయానుకూలమైన యాజమాన్య పద్ధతులు పర్యవేక్షణ అవలంభించకపోవడం వలన ప్రస్తుతం గత కీర్తి ప్రతిష్టలకు నోచుకోవడం లేదు. ఏ ఇంటికి,లేదా అపార్ట్‌మెంట్, ఫ్యాక్టరీ, ఆఫీసులకు ఊడ్చేందుకు మనుషులు ఉన్నా వారు అక్కడికే పరిమితమవుతారు. కానీ నగరాన్ని ఉదయమే శుభ్ర పరచడానికి సపాయి కార్మికులుతమ శక్తి వంచన లేకుండా ఎండకాలం, చలికాలం, వానాకాలమనే తేడాలేకుండా ఏ కాలమైనా విధులను నిర్వహిస్తుంటారు. వీరి సేవలకు పాదాభివందనం చేయవలసిందే. ముఖ్యంగా స్త్రీలు నిర్వహిస్తున్న పాత్ర ఇందులో ప్రశంసించ తగినది. గతంలో వీరికి వీధులను ఊడ్చుటకు ఏడాదికి సరిపడా చీపురు కట్టలు, వాటికి రక్షణకు కావలసిన చేతి గ్లౌజులు, మాస్కులు, చేతులు శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్‌వాష్‌తో కూడిన కిట్‌ను అందజేసేవారు. కానీ, ప్రస్తుతం ఈ కిట్స్‌ను ప్రభుత్వం వీరికి అందజేయడం లేదు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వారు వాపోతున్నారు. అలాగే వీరి సేవలను కేవలం వీధులు శుభ్రం చేసుకోవడానికి కాకుండా ఇతర పనులకు కూడా ఉపయోగించడం వలన శుభ్రత లోపిస్తున్నది. వాడల్లో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరికిన తర్వాత వాటిని వాహనాల్లో తరలించుటకు వీరి సేవలను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా వాడల శుభ్రత అధ్వానంగా మారుతున్నది. ఇతర గ్యాంగ్ పనులకు కూడా వీరినే ఉపయోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఆయా కాలనీల గృహాల సంఖ్య జనాభా ఇతరత్రా దృష్టిలో పెట్టుకొని ముగ్గురు లేదా నలుగురుని సఫాయి ఉద్యోగులను కేటాయిస్తుంటారు. ఇందులో ఒకరు వారాంతం సెలవు, మరొకరు స్వంత అవసరాల కోసం లీవ్‌లో ఉంటే వీధుల శుభ్రత లోపిస్తున్నది. ఇతర శాఖల్లో అదనంగా సపాయి కార్మికులకు బదులుగా పనిచేసే వారు వేరే లేరు.దీంతో కష్టమైనా సరే, ఉన్నవారే విధుల్లో ఉండాల్సి వస్తున్నది. ఇతర శాఖల్లో ఉండే అదనపు సిబ్బందిని ఈ పనులకు కేటాయించడం ద్వారా విధుల్లో ఉన్న కార్మికులకు కాస్త ఉపశమనం దొరికే అవకాశముంది.దీనివల్ల వీరు ఆరోగ్యవంతంగా ఉండి నగరాన్ని మరింత శుభ్రంగా తీర్చిదిద్దుతారు. అందుకే వీరి అరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలి. వీరి పని ప్రదేశాల్లో కేటాయించే కిట్, అలాగే శానిటైజర్, మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించాలి.
-డి.ఆర్.సి.రావు,
9849592958