శాస్త్రవేత్త, కళాకారుడు- డాక్టర్‌ రాజా రామన్న

మన భారతీయ శాస్త్రవేత్తల్లో కొన్ని సుగుణాలు తప్పకుండా ఉంటాయి. అవి దేశభక్తి, సంస్కృతీ సంప్రదాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాల పట్ల ప్రేమ, సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచాలన్న తపన మొదలైనవి. డాక్టర్‌ రాజా రామన్న వంటి కొంతమంది శాస్త్రవేత్తల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈయనకు భౌతిక శాస్త్రవేత్తగానే కాదు, పియానో వాయిద్యకారుడిగా మంచి పేరుంది. ఈయనకు భారతీయ కళలంటే ఎంతో ఇష్టం ఉండడంతో పాటు, భారతీయ తత్త్వశాస్త్రంపై లోతైన అవగాహనా ఉంది. రాజా రామన్న 1925 జనవరి 28న సాంప్రదాయక మైసూర్‌ అయ్యంగార్‌ కుటుంబం – తమకూరు జిల్లా, కర్నాటకలో పుట్టాడు.
తల్లి: రుక్మిణి, తండ్రి: బి.రామన్న. ఈయన బాల్యం, కౌమారం అంతా పుట్టిన ఊర్లోనే గడిచింది. ఉన్నత విద్య బెంగళూరులో జరిగింది. సంగీతంపై ఉన్న అభిమానంతో సంగీత కళాశాలలో చేరాలనుకున్న రాజా రామన్న, సర్‌ సి.వి. రామన్‌ పరిచయ ప్రభావం వల్ల వైజ్ఞానిక రంగంలోకి ప్రవేశించాడు. తండ్రి న్యాయశాఖలో ఉద్యోగి. కానీ, ఆయన తల్లి సోదరి రాజమ్మ ఉపాధ్యాయురాలిగా ఉండేది. అలా ఆ పిన్ని ప్రభావం బాల్యదశలో రాజారామన్నపై పడింది. ఆరేండ్ల వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించాడు. పన్నెండో ఏట మైసూర్‌ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నాడు. మరోవైపు మైసూర్‌ డాల్వారు స్కూలు, గుడ్‌ షెప్పర్డ్‌ కాన్వెంట్లలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుని, బెంగళూరుకు వెళ్లి అకడి కాటన్‌ బార్సు స్కూల్లో పాఠశాల విద్య కొనసాగించాడు. తర్వాత మద్రాసు చేరుకుని, అక్కడి క్రిస్టియన్‌ కాలేజిలోనూ, తర్వాత మద్రాసు యూనివర్సిటీలోనూ చదివి పట్ట భద్రుడయ్యాడు. తర్వాత బొంబాయి యూనివర్సిటీ నుండి మాస్టర్స్‌ డిగ్రీ సాధించాడు. ఒక మామూలు ఉద్యోగి అయిన తండ్రి తన కొడుకు ఉన్నతవిద్య కోసం ఎంతగా తపించాడో ఎంత ఖర్చుపెట్టాడో ఊహించు కోవాల్సిందే. సహజంగా చురుకైన విద్యార్ధి కావడం వల్ల రాజా రామన్న 1949లో టాటా గ్రూపు- స్కాలర్‌ షిప్‌పై లండన్‌ వెళ్లి, అక్కడి కింగ్స్‌ కాలేజి నుండి నూక్లియర్‌ ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ తీసుకున్నాడు.
‘పి.హెచ్‌.డి తీసుకుని రాజా రామన్న స్వదేశం తిరిగివచ్చేసరికి – ఇక్కడ దేశానికి స్వాతంత్య్రం లభించిన తొలిరోజులు – అప్పుడప్పుడే భారతదేశంలోని సంస్థలన్నీ బ్రిటీషు విధానాలను వదిలి, దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తమను తాము పునరుద్ధరించు కుంటున్న సమయం. డాక్టర్‌ హోమీ జహంగీర్‌ బాబా నేతృత్వంలో దేశం, అణు పరిశోధనా రంగంలో ఆడుగు పెట్టిన తరుణం! హోమి బాబా ఆధ్వర్యంలో పనిచేయడానికి 1952లో డా. రాజా రామన్న టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో చేరాడు. బొంబాయి, ట్రాంబేలోని ఆ సంస్థ పేరు తర్వాత కాలంలో బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) గా మారింది. 1957లో అణుభౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు రాజారామన్న బార్క్‌లో శిక్షణా తరగతులు నిర్వహించాడు. 1960లలో అణ్వాయుధాలను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయడంలో – సాంకేతిక పరిశోధన చేపట్టాడు. అప్పుడే మనదేశంలో అణుబాంబుకు రూపకల్పన జరిగింది. 1966లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు- అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్‌ కొనసాగింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే 75మంది శాస్త్రవేత్తల బృందానికి డా.రాజా రామన్న నాయకత్వం వహించాడు. 1968-69లో బార్క్‌లో పూర్ణిమ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ స్థాపించబడింది. 1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. ఆ పరీక్షకు ‘స్మైలింగ్‌ బుద్ధ’ – అని పేరు పెట్టారు. దీన్ని పీస్‌ఫుల్‌ నూక్లియర్‌ ఎక్స్‌పోజివ్‌ (పిఎన్‌ఈ) అని పిలిచారు.
పద్మ విభూషణ్‌ స్వీకరించిన డాక్టర్‌ రాజా రామన్న, 1977-79 మధ్య ఇండియన్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌కు అధ్యక్ష్యుడయ్యాడు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశారు, డా.రామన్నను బార్క్‌ నుండి తీసుకొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియ మించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా డీఆర్‌డీఓ డైరెక్టర్‌ జనరల్‌గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌. అణుబాంబుల తయారీలో డా.రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందనుకుని, దేశ భక్తుడయిన డా.రాజా రామన్న చెప్పాపెట్టకుండా ఇండియా విమానం పట్టుకుని హుటాహుటిన తిరిగొచ్చాడు. నిబద్ధత గల దేశ భక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.
హోమి జె.బాబా అకాల మరణం తర్వాత, ఆయన నిర్ధేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి, అణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాడు. ఒక దశాబ్దకాలం పాటు డైరెక్టర్‌గా ఉండి, పోఖ్రాన్‌ అణుపరీక్షల్ని తొలిసారి నిర్వహించాడు. 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఎడారిలో మన దేశం అణు పరీక్షల్ని కొనసాగించింది. దీనికి ముఖ్య కారకులు మన రాజరామన్నానే! అయితే ఆయన బృందంలోని ఇతర శాస్త్రవేత్తలు కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల ఆ ప్రయత్నం విజయవంతమైంది. రాజా రామన్న విజయం ఇదొక్కటే కాదు. అంతకు ముందు కూడా ఆయన ఇలాంటి బాధ్యతల్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాడు. దేశంలో తొలి అణురియాక్టర్లను నెలకొల్పిన ఘనత కూడా ఆయనదే! అప్సర, సిరస్‌, పూర్ణిమ వంటి అణురియాక్టర్లు కూడా డాక్టర్‌ రాజారామన్న రూపకల్పనలే! భూగర్భంలో అణుపరీక్ష చేయడమన్నది అంతకుముందు లేదు. కాలువలు తవ్వడానికి, లేదా వంతెనలు కట్టడానికి సరిపోయినంత స్థలం సమ కూర్చుకోవడానికి, అణు వ్యర్థ పదార్థాలను భూగర్భంలో నిలువ చేసుకోవడానికి సామాన్యంగా డైనమైట్‌ ఉపయోగించేవారు. కానీ, డైన మైట్‌కు ప్రత్యామ్నాయంగా అణుశక్తిని వాడి అపాయ రహితమైన మంచి ఫలితాలను సాధించగలిగాడు – డాక్టర్‌ రామన్న. అదీగాక, దీర్ఘ కాలిక ఉపయోగాలను దృష్టిలో ఉంచుకుని లెక్కలు వేస్తే, డైనమైట్‌ కంటే అణుశక్తిని ఉపయోగించడమే చౌక అని తేలింది. అందువల్ల మాన వాళి శాంతియుత ప్రయోజనాల్ని దృష్ట్టిలో ఉంచుకుని, ఆణుశక్తిని ఇతోధికంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని డాక్టర్‌ రాజా రామన్న ఎత్తి చూపాడు.
ఇవిగాక,ఆయన నూక్లియర్‌ ఫిష్షన్‌ రంగంలో కూడా కృషిచేశాడు. బరువైన కేంద్రకాలను విభజించి, శక్తివంతమైన నూక్లియర్‌ రేడియేషన్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.ఆ సిద్ధాంతం అణు పరిశోధనారంగానికి, తద్వార దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది. 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణుకార్యక్రమం ఊపందుకుంది. ఆమె డా.రామన్నను మళ్లీ బార్క్‌కు డైరెక్టర్‌గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 1983లో అణుశక్తి శాఖకు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే- ఇంటర్నేషనల్‌ ఆటమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఎఈఎ)లో దక్షిణ ఆసియా, మధ్యప్రాచీ కూటమికి ప్రాతినిధ్యం వహించారు.1990లో వి.పి.సింగ్‌ ప్రభుత్వంలో డా.రామన్న కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1997-2003 మధ్యకాలంలో పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు డా.రామన్న. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌లతో పాటు శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ బహుమతి, మేఘనాథ్‌ సాహా మెడల్‌, ఆర్‌డి బిర్లా మెమోరియల్‌ అవార్డు, అశుతోష్‌ ముఖర్జీ గోల్డ్‌మెడల్‌ వంటి పలు పురస్కారాలు 1963- 1996 మధ్యకాలంలో స్వీకరించడమే కాకుండా, దేశంలోని పలు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు తీసుకున్నాడు.
డాక్టర్‌ రాజారామన్న తన ఇరవై ఏడోయేట 1952లో మాలతిని వివాహం చేసు కున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. తల మునకలయ్యే ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహిస్తూనే, పరిశోధనలు కొనసాగించడం – అందులో మళ్లీ సమయాన్ని సంగీతానికి కేటాయించి పియానో వాయిద్యకారుడిగా పేరు గడించడం మామూలు విషయం కాదుగదా? వీటన్నిటి వెనక ఆయనకు ఆయన భార్యా పిల్లల సహాయ సహకారాలు ఉండడం చెప్పుకోదగ్గ విషయం! అత్యున్నత ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించినా, అత్యున్నత ప్రభుత్వ పురస్కారాలు స్వీకరించినా డా. రాజా రామన్న దేనికీ పొంగిపోలేదు. వినమ్రంగా అణుకువగా నడుచు కుంటూ అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఈ శాస్త్రవేత్త జీవితం నేటి యువతరానికి ఆదర్శం కావాలి! ప్రపంచ దేశాల్లో అణ్వస్త్రాలకు పోటీ పెరుగు తున్నప్పుడు- మన రక్షణ అవసరాలకు, దేశ భద్రతకూ అణ్వస్త్రాలు రూపొందించుకోవడం ఏ మాత్రం తప్పుకాదని నాటి ప్రధ నులైన శ్రీమతి ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్‌గాంధీలను ఒప్పించగలిగాడు. అణుసామర్థ్యం పెంచుకోవడం లోనే దేశం శక్తివంతమౌతుందని ఆయన గాఢంగా విశ్వసించాడు.
శాస్త్రవేత్త అయి ఉండి కూడా కళాకారుడిగా మెప్పుపొందడం ఆయన ప్రత్యేకత. వైజ్ఞానిక పరిశీలన అయినా, కళా ప్రక్రియల్లో ప్రవేశమైనా అంతర్గతంగా మనిషిలో ఉన్న సృజనాత్మక శక్తికి విభిన్న రూపాలే! బాహ్యరూపాల్లో కళలు, విజ్ఞాన శాస్త్రాలు విడివిడిగా వేటికవి సంబంధం లేనట్లుగా అనిపించినా- అంతస్సూత్రంగా సృజనాత్మకత వాటిని కలుపు తూ ఉంటుంది. ఒక ఉన్నతమైన స్థాయిలో వాటి గురించి ఆలోచిస్తే- కళశాస్త్రమవుతుంది. శాస్త్రం- కళాత్మకంగా బయట పడుతుంది. అందుకు చాలామంది కవులు, చిత్రకారులు, సంగీతకారులు, శిల్పులు, వైజ్ఞానికులు కృషిచేశారు.
వైజ్ఞానిక స్పృహగల కవులున్నట్లే, కళాత్మక దృష్టిగల వైజ్ఞానికులూ ఉన్నారు. డాక్టర్‌ రాజా రామన్న అలాంటి వారికి ఒక మంచి ఉదాహరణ! మరో ముఖ్య విషయమేమంటే, ఇది డా.రాజా రామన్న శత జయంతి. (28 జనవరి 1925- 28 జనవరి 2025), మంచి మనిషిగా, అత్యున్నత స్థాయికి ఎదిగిన వైజ్ఞానికుడిగా, పియానో వాయిద్యకారుడిగా – ఎవరికి తోచిన విధంగా వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త: త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలి గ్రహీత
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love