మనం ఉన్న ప్రదేశంలోనో, వెళ్తున్న దారిలోనో అరుపులు, పెడబొబ్బలు మన చెవినపడగానే మనదృష్టి అటువైపు మరలుతుంది. ఆరా తీయడం మొదలు పెడతాం. ఏమైంది, ఎలా జరిగింది, కారణాలేంటి? అలా అనేక ప్రశ్నలొస్తాయి. వాటిని నివృత్తి చేసుకుంటాం. కొన్ని ఉహించని ఘటనలు జరిగినప్పుడు ఆ ఇంట్లోనో, ఆ ఊరిలోనో ఏడ్పులు వినిపిస్తాయి. అందుకు రివర్స్‌గా ప్రస్తుతం ‘గులాబీ’ కారులో ఇలాంటి అరుపులే వినిపిస్తున్నాయి. ఏమైంది? అంటూ ఓ ముసలాయన ఆరా తీశారట! ఎవరైనా చనిపోయారా? ప్రమాదం జరిగిందా? కాలు, చేయి ఏమైనా విరిగాయా? అని తేరిపార చూశాడట. ఏమీ కాలేదు, అయినా ఒక్కటే గోల. అది ఏడుపే కాదు. నటన అని ముస లాయనకు అర్థమైంది. ‘సారు’ కారుకు బ్రేక్‌లు ఫెయిలై కదలడం లేదు. అందుకు ఏడుస్తున్నారట. కారుకు ఏదైనా సమస్య వస్తే ఎవరైనా రిపేర్ చేయించుకుంటారు. రంగు వెలసిపోతే పెయింటింగ్ వేయించుకుంటారు. డెంటింగ్కు కూడా ఇస్తారు. కానీ అదేందో బ్రేక్‌లు ఫెయిలైతే పక్కోడి మీద ఏడుస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఒకేసారి నలుగురు పడీపడీ ఏడుస్తున్నారు. ఆ ఏడుపుల్లో కూడా ఎంతో ఆనందం పొందుతున్నారు. టీవీలు, సోషల్ మీడియాలోనూ అరుస్తున్నారు. మైకులు కిరాయికి తీసుకుని, అందులోనూ ఏడుస్తున్నారు. చెప్పిన అబద్దాలు చెప్ప కుండా ఒక్కటే అబద్ధం. పదేండ్లు కారులో ఏసీ ఏసుకుని తిరిగారు. వారే అద్దాలు మూసుకోవడంతో ఏమీ కనిపించ లేదు. మనుషులైతే అస్సలే కనిపించలేదు. ఇప్పుడు కారును షెడ్డుకు పంపే స్థితిలో కారు అద్దాలను కిందకు దింపారు. అయినా ఎవ్వరూ ఆ కారు దగ్గరికి రావడం లేదు! దీంతో ఒకటే అరుపులు..పెడబొబ్బలు. ఇప్పటికే ఈ కథ ఎవరిదో మీకు అర్థమయ్యే ఉంటది.ఉంట మరి, ఎందుకీ లొల్లి నాకు!
– గుడిగ రఘు