నవతెలంగాణ-దుండిగల్
నాలుగేండ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్టు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 12న ఘటన జరిగిందని, బాధితులు దుండిగల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు విషయంలో తాత్సరం లేకుండా వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే ఈ కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచినట్టు వివిధ మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నాయని, తాము మానవీయ కోణంలో అలోచించి మీడియాకు కొంత దూరంగా ఉన్నట్టు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, వైద్య నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా దర్యాప్తు జరపాలని ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద బుధవారం డీసీపీ కోటిరెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిజాలు నిర్దారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపడతామని వివరించారు.