పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ – పరకాల
ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం మోపుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ ఆరోపించారు. సోమవారం పరకాల పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు నిర్దిష్ట బుక్ స్టాల్‌లతో కుమ్మక్కై ఇష్టానుసారంగా ధరలను పెంచి పుస్తకాల దందాకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకటో తరగతి, రెండో తరగతి చదువుతున్న చిన్న పిల్లల నుంచి కూడా పుస్తకాల పేరుతో ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా వ్యాపారంలో భాగంగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్లను విద్యాశాఖ అధికారులు వెంటనే అరికట్టాలని, దోపిడీకి పాల్పడుతున్న పాఠశాలలు మరియు బుక్ స్టాల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో జరుగుతున్న ఈ అక్రమాలను అరికట్టే వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, మండల కార్యదర్శి ప్రేమ్, పట్టణ ఉపాధ్యక్షుడు రోషన్, పాల్, మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.



