ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో బొట్ల చక్రపాణి
నవతెలంగాణ – పరకాల
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సోమవారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. సిఐటియు జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి, ఎస్ఎఫ్ఐ నాయకులు బొచ్చు కళ్యాణ్, కార్మిక సంఘం అధ్యక్షులు మడికొండ ప్రమోద్ కుమార్ నేతృత్వంలో స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి బస్టాండ్, పోచమ్మ గుడి, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు.
అనంతరం వారు మాట్లాడుతూ..మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం శాశ్వత పనుల్లో ఉన్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, రిటైర్మెంట్ లేదా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే చొరవ చూపాలని, లేనిపక్షంలో దశలవారీగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన అనంతరం ఎమ్మెల్యే తరపున టౌన్ ప్రెసిడెంట్ ఒంటేరు శ్రావణ్ కుమార్, కౌన్సిలర్ కోయిడ శ్రీనివాస్, సమన్వయ కమిటీ సభ్యులు మెరుగు శ్రీశైలం కార్మికుల నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.



