ఐపీఎల్‌కు శివమ్‌ మావి దూరం

ఐపీఎల్‌కు శివమ్‌ మావి దూరం– గాయంతో వైదొలిగిన లక్నో పేసర్‌
లక్నో: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17కు లక్నో యువ పేసర్‌ శివమ్‌ మావి దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ స్పీడ్‌స్టర్‌ సీజన్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బుధవారం లక్నో ఫ్రాంచైజీ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ‘గాయాల నుంచి కోలుకుని జట్టుతో కలిశాను. కానీ, మళ్లీ గాయపడ్డాడు. దాంతో, సీజన్‌ మొత్తానికి దూరమవుతున్నా… త్వరలోనే ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ మీ ముందుకు వస్తా’ అని మావి తెలిపాడు. పదిహేడో సీజన్‌ మినీ వేలంలో రూ.6.4 కోట్లు పలికిన శివం మావి.. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. ఇక లక్నో పేస్‌ యూనిట్‌లో షమర్‌ జోసెఫ్‌, యశ్‌ ఠాకూర్‌, మయాంక్‌ యాదవ్‌, స్టోయినిస్‌లు ఉన్నారు. ఐపిఎల్‌లో ప్లే ఆఫ్స్‌ గండం దాటలేకపోయిన లక్నో జట్టు ఈసారి అదరగొడుతోంది. మయాంక్‌ యాదవ్‌ సంచలన బౌలింగ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టిస్తుండగా.. బ్యాటింగ్‌లో నికోలస్‌ పూరన్‌, క్వింటన్‌ డికాక్‌లు బాదేస్తున్నారు. ఈ సీజన్‌లో లక్నో జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
మయాంక్‌ నాణ్యమైన పేసర్‌ : రబడా
టీమిండియాకు మరో నాణ్యమైన పేసర్‌ దొరికాడని దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడా పేర్కొన్నాడు. ఐపిఎల్‌లో సత్తా చాటుతున్న 21ఏళ్ల ఢిల్లీకి చెందిన మయాంక్‌ యాదవ్‌ టి20 ప్రపంచకప్‌ టీమిండియా జట్టులో తప్పకుండా చోటు కల్పించాలని సెలెక్టర్లకు ఓ సలహా ఇచ్చాడు. ఐపిఎల్‌లో లక్నో తరఫున ఆడుతున్న మయాంక్‌ యాదవ్‌ మంగళవారం నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో బెంగళూరుపై లక్నో జట్టు 28పరుగుల తేడాతో గెలిచింది. అతడు 4ఓవర్లలో కోటాలో కేవలం 14పరుగులిచ్చి మూడు ప్రధాన వికెట్లు పడగొట్టాడు. ఇదే క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Spread the love