కోర్టుకు హాజరైన ఎస్‌హెచ్‌ఓ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఓదెల వెంకటేష్‌ శుక్రవారం హైకోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఒక జడ్జి కుమారుడిపై ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని చెప్పారు. ఒకరోజు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరధే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌ జాప్యంపై ఎస్‌హెచ్‌ఓ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని చెప్పింది. విచారణను మార్చి 4కి వాయిదా వేసింది. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వాళ్లు చేసే ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలనీ, దర్యాప్తులో ఆ ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని తేలితే అందుకు అనుగుణంగా తుది నిర్ణయం ఉండాలని చెప్పింది. ఇలాంటి అంశాలపై పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వాళ్లు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించితీరాలని చెప్పింది. డీజీపీకి పలు సూచనలు చేసింది. పోలీసుల ప్రవర్తన శైలి మారాలని చెప్పింది, ప్రజలతో ఎలా వ్యవహరించాలో పోలీసులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన విషయాల గురించి సర్క్యులర్‌ జారీ చేయాలనీ, ప్రజలకు ఉపయోగపడేలా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

Spread the love