
నవతెలంగాణ -దుబ్బాక
అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆశాలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ.భాస్కర్ డిమాండ్ చేశారు.ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రూ.18 వేల కనీస వేతనం, ప్రమోషన్, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్ యోగ భద్రత, మట్టి ఖర్చులు అందించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం దుబ్బాకలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్,మరణిస్తే మట్టి ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లిస్తామని,రిటైర్మెంట్ బెనిఫిట్ లు,సెలవులు ఇస్తామని,టార్గెట్లను రద్దు చేస్తామని పలు నిర్దిష్ట హామీలను ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని.. 2022-23 లో ఆశాలు చేసిన ‘లెప్రసీ సర్వే’ డబ్బులను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.లేనియెడల పోరాటాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ధర్నాలో సీఐటీయూ నాయకులు మహేష్,ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఆశాలు శ్యామల శారద, చంద్రకళ, సంతోష, వసుందర, శోభ, లత, పలువురు పాల్గొన్నారు.