సిధారెడ్డి సాహిత్యమంతా తెలంగాణ జీవితమే

నవతెలంగాణ – కంఠేశ్వర్ 

డాక్టర్ నందిని సిధారెడ్డి కవిత్వం రాసినా, కథలు రాసినా, సినిమా పాటలు రాసిన, సంగీత నృత్యరూపకాలు రాసినా వాటి నిండా తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరింప చేస్తాడని, ఇలా చేయగలిగిన కవి నిజమైన ప్రజాకవి అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. మంగళవారం రాత్రి సిద్దిపేట ప్రెస్క్లబ్ లో జరిగిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రాసిన బందారం కథలు కథా సంపుటి ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. బందారం కథలు కథా సంపుటి లోని పాత్రలు తెలంగాణ గ్రామాలలో చాలా చోట్ల కనిపిస్తాయని, తనకు నిజ జీవితంలో ఎదురైన మనుషుల స్వభావాలను వాటి ద్వారా ఆనాటి తెలంగాణ జీవితాన్ని ఆయన తన కథల్లో అద్భుతంగా ఆవిష్కరించాడని వివరించారు. త్వరలో  బందారం కథలు పుస్తక పరిచయ సభను నిజాంబాద్ తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నందిని సిధారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, మెదక్ జిల్లా అధ్యక్షురాలు కవిత, మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు కల్వకోట రంగాచారి, ప్రముఖ పాత్రికేయులు కే శ్రీనివాస్, తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య, సిద్ధంకి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Spread the love