ఏకకాలంలో గోల్డెన్‌ బేర్‌, ఆస్కార్‌ అవార్డులు

పి. జ్యోతి ఆటిజం గురించి ఇప్పుడు మన దేశంలోనూ ఎంతో చర్చ జరుగుతుంది. 1988 లో డస్టిన్‌ హాఫ్మాన్‌, టాం క్రూస్‌ కలిసి నటించిన ‘రెయిన్‌ మాన్‌’ చిత్రం ఆటిజం విషయంగా తెరకెక్కిన ఓ గొప్ప కథ. అయితే ఇందులో ప్రధాన పాత్ర రేమండ్‌ ఆటిజంతో మాత్రమే జీవిస్తున్న వ్యక్తి కాదు, అతనో ఆటిజం సావంత్‌. ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌. దీనితో బాధపడే వ్యక్తులు సామాజిక సంభాషణ, చర్యలలో అనేక సందర్భాల్లో సామాన్యులకు విరుద్దంగా ప్రవర్తిస్తారు. వీరిలో భావ నియంత్రణ శక్తీ, వ్యక్తీకరణ శక్తి సాధారణ మనుషులకు భిన్నంగా ఉంటుంది. సావంత్‌ సిండ్రోమ్‌ అనేది ఏదో ఓ విషయంలో ముఖ్యంగా గణితశాస్త్రంలో అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించే ఒక లక్షణం. ఈ వ్యాధితో బాధపడుతున్న 10 మందిలో ఒకరికి సావంత్‌ తెలివితేటలు ఉంటాయి అన్నది డాక్టర్లు గుర్తించిన విషయం. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులందరూ సావంత్స్‌ కాదు. అలాగే సావంత్స్‌ అందరికీ ఆటిజం ఉండదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటూ మనం ఒప్పుకోవలసిన విషయం ఆటిజంతో ఉన్న కొందరిలో అంటే పైన చెప్పినట్లు పదిమందిలో ఒకరు సావంత్‌ల స్థాయి ప్రతిభ కలిగి ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి కథ ఈ ‘రెయిన్‌ మాన్‌’.
చార్లీ బాబిట్‌ కార్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు. పాత ఆంటిక్‌ కార్లను కొని అమ్మడం ఇతని వత్తి. స్వభావరీత్యా స్వార్ధపరుడు. తన గురించి తప్ప మరేదీ పట్టని వాడు. వ్యాపారంలో గొడవలను తప్పించుకోవడానికి తన గర్ల్‌ఫ్రెండ్‌తో వీకెండ్‌ గడపడానికి బయల్దేరతాడు చార్లీ. అయితే దారిలో తండ్రి లాయర్‌ నుండి అతని ఫోన్‌ వస్తుంది. చార్లీ తండ్రి సాన్ఫోర్డ్‌ బాబిట్‌ మరణించాడని, ఆస్థి విషయాలు మాట్లాడుకోవడానికి రమ్మని లాయర్‌ కబురు చేస్తారు. తండ్రి మరణం చార్లీని బాధించదు. అతను తండ్రితో ఎప్పుడో మానసికంగా సంబంధం తెంచుకున్నాడు. చార్లీ తండ్రి ఆస్థిపరుడు. ఇప్పుడు చార్లీకి వ్యాపారం కోసం డబ్బు అవసరం కూడా ఉంది. పైగా ఆస్థి అతని హక్కు కాబట్టి దాని కోసం తండ్రి ఊరికి గర్ల్‌ఫ్రెండ్‌ సూసానా తో కలిసి వెంటనే బయలుదేరతాడు. కాని అక్కడకు వెళ్లాక తండ్రి తనకు కొన్ని గులాబి మొక్కలు ఓ పాత కారు మాత్రమే వదిలి వెళ్ళాడని, మూడు మిలియన్ల ఎస్టేట్‌ ఓ అజ్ఞాత వ్యక్తికి రాశాడని తెలుస్తుంది. చార్లీకి ఇది చాలా కోపం తెప్పిస్తుంది. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే పట్టుదల పెరుగుతుంది.
ఆ డబ్బు ఓ మానసిక ఆసుపత్రి అధీనంలోకి వెళ్ళిందని తెలుసుకుని చార్లీ అక్కడకు వెళతాడు. అప్పుడే రేమండ్‌ అనే ఓ ఆటిస్టిక్‌ వ్యక్తిని చూస్తాడు. అతను తనకు సోదరుడు అని, తండ్రి అతనికే ఆస్థి మొత్తం రాశాడని తెలుసుకుంటాడు. అప్పటి దాకా తనకో అన్న ఉన్నట్లు చార్లీకి తెలియదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు చార్లీ తండ్రి నడిపే 1949 మోడల్‌ బిక్‌ రోడ్మాస్టర్‌ కారును దొంగతనంగా నడిపి పోలీసులకు చిక్కి ఓ రాత్రి జైలులో గడపాల్సి వస్తుంది. ఆ సమయంలో తండ్రి అతన్ని జైలు నుండి విడిపించడు. అది చార్లీ చేసిన తప్పుకు అనుభవించవలసిన శిక్షగా అతను భావిస్తాడు. ఇది చార్లీకి తండ్రిపై కోపాన్ని పెంచుతుంది. అందుకని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. ఆ తరువాత తండ్రి ఎన్ని సార్లు అతన్ని కలవాలని, మాట్లాడాలని ప్రయత్నించినా చార్లీ తండ్రికి ఆ అవకాశం ఇవ్వడు. ఇప్పటికీ అతనికి తండ్రిపై అదే కోపం ఉంటుంది. అందుకే తనను కాదని డబ్బు అంటే ఏంటో తెలియని ఓ పిచ్చివాడికి తండ్రి ఆస్థి ఇవ్వడం, పైగా అతను తన అన్న అన్నది తనకే తెలియకపోవడం ఇవన్నీ చార్లీని ఇంకా అసహనానికి గురి చేస్తాయి. రేమండ్‌ తండ్రి కారు గుర్తు పట్టడం తాను ప్రతి వారం ఆ కారుని నడిపానని చెప్పడంతో చార్లీకి తండ్రి రేమండ్‌ కోసం తరుచు ఆ పిచ్చాసుపత్రికి వచ్చేవాడని అర్ధం అవుతుంది. రేమండ్‌ తన అన్న అన్నది నమ్మాల్సి వస్తుంది. రేమండ్‌ ను మాటల్లో పెట్టి అతన్ని తనతో కారు ఎక్కుంచుకుని ఆ ఆసుపత్రి నుండి బైటపడతాడు చార్లీ.
ఆ రాత్రి వాళ్ళు ఓ హోటల్లో గడుపుతారు. రేమండ్‌ తన రోజువారి దినచర్యను కచ్చితంగా ఎక్కడ ఉన్నా అమలుపరచాలంటాడు. ఏ సందర్భంలోనూ ఎమోషన్లు బైటపెట్టడు. చార్లీ అసలే కోపంగా ఉండడం వల్ల రేమండ్‌ తో కాస్త కటువుగానే ప్రవర్తిస్తాడు. ఇది సూసానా కు నచ్చదు. అతని వైఖరిలో స్వార్ధం ఉందని, అలాంటి వ్యక్తితో తాను కలిసి ఉండలేనని చెప్పి ఆమె ఆ రాత్రే చార్లీని వదిలి వెళ్లిపోతుంది. చార్లీ రేమండ్‌ డాక్టర్‌ కు ఫోన్‌ చేసి ఆస్తిలో సగం తనకు రాసి ఇస్తే తాను రేమండ్‌ ను తిరిగి వాళ్ళకు అప్పగిస్తానని అంటాడు. దానికి డాక్టర్‌ ఒప్పుకోడు. దీనితో చార్లీ తనతో పాటు రేమండ్‌ ను తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తన ఊరు చేరి తన లాయర్‌ తో సంప్రదింపులు జరపాలన్నది అతని ఆలోచన.
రేమండ్‌ లాస్‌ఏంజల్స్‌కు వెళ్లడానికి ఫ్లైట్‌ ఎక్కనంటాడు. ఏ ఎయిర్‌ లైన్‌ పేరు చెప్పినా అవి ఎదుర్కొన్న ప్రమాదాలను, అందులో మరణించినవారి సంఖ్యను తేదీల వారీగా గుర్తు చేసి తాను అలాంటి విమానాలలో ప్రయాణించనని మొండికేస్తాడు. రేమండ్‌ సురక్షితం అని సూచించిన ఎయిర్‌ లైన్‌ లాస్‌ ఏంజిల్స్‌ వరకు విమానాలు నడపదు. రేమండ్‌ ఇష్టపడని పని అతనితో చేయించలేనని చార్లీకి తెలుసు. పైగా తాను దొంగతనంగా అతన్ని తీసుకొస్తున్నాడు. అందుకని రేమండ్‌ తో గొడవ పెట్టుకోలేడు. దీనితో తప్పక కారు ప్రయాణం పెట్టుకుంటాడు చార్లీ. హైవే మీద ఎవరికో ఆక్సిడెంట్‌ అయితే అది చూసి తాను ఇక హైవే పై ప్రయాణించనని మొండికేస్తాడు రేమండ్‌. అందుకని ఊర్లలోనుండి ప్రయాణించవలసి వస్తుంది. అంతే కాకుండా వర్షంలో తాను ప్రయాణించనన్నది రేమండ్‌ మరో డిమాండ్‌. అలాగే రాత్రి తాను రోజు చూసే టీవీ షో తప్పకుండా చూడాలన్నది అతని మరో కండిషన్‌. వీటన్నిటిని ఒప్పుకుని ప్రయాణించడంతో కొన్ని రోజులు రేమండ్‌తో చార్లీ కలిసి ప్రయాణించవలసి వస్తుంది.
ఈ ప్రయాణంలో రేమండ్‌ అద్భుత జ్ఞాపక శక్తి, అసాధారణ గణిత శక్తి చార్లీ గమనించి ఆశ్చర్యపోతాడు. ఓ హోటల్‌ లో భోజనానికి వెళితే క్రింద పడిన టూత్‌ పిక్స్‌ అన్నిటికి పది సెకెండ్లలో లెక్కపెట్టగల అతని శక్తి, ఓ గంట టెలిఫోన్‌ డైరీ చేతికి ఇస్తే సగంపైగా చదివేసి అన్ని పేర్లను ఫోన్‌ నెంబర్లతో సహా గుర్తు పెట్టుకోగల అతని అసాధారణ మేదస్సు చార్లీని విశేషంగా ఆకర్షిస్తుంది. రేమండ్‌ తో కలిసి ప్రయాణిస్తూ ఓ దగ్గరితనాన్ని అనుభవిస్తాడు చార్లీ. అతన్ని తన రక్తంగా, తన కుటుంబంగా ఒప్పుకోవడం మొదలెడతాడు చార్లీ. ఇది అతని మనసులో దాగి ఉన్న సున్నితత్వాన్ని, బాధ్యతనూ తట్టిలేపుతుంది.
తాను చిన్నప్పుడు ఆడుకుంటూ రెయిన్‌ మాన్‌ అంటూ ఒక బాల్య స్నేహితుడిని పిలిచేవాడినని చార్లీ గుర్తు చేసుకుంటాడు. అతను తన అన్న రేమండ్‌ అన్న సంగతి ఇప్పుడు చార్లీకి అర్ధం అవుతుంది. తనకు స్పష్టంగా పలకడం రాని చిన్నతనంలో తనతో ఆడుకుంటున్న రేమండ్‌ పేరును సరిగ్గా పిలవలేక తాను రెయిన్‌ మాన్‌ అని అనేవాడినని చార్లీకి గుర్తుకొస్తుంది. ఆ రెయిన్‌ మాన్‌ ఒడిలో ఆడుకోవడం అతనికి లీలగా జ్ఞాపకం. పెరిగిన తరువాత అది ఓ చిన్నప్పటి ఊహగా అతను మర్చిపోయాడు. ఎందుకంటే ఉహ తెలిసేసరికి ఇంట్లో ఒంటరిగా పెరగడమే చార్లీ కి గుర్తు.
అన్నతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడే చిన్నతనంలో మరిగిన నీళ్ళతో నిండి ఉన్న బాత్‌టబ్‌ లో చార్లీ పడబోతుండగా రేమండ్‌ అడ్డుకున్నాడని, కాని తండ్రి ఈ విషయం తెలియక చార్లీని వేడి నీటిలో రేమండ్‌ తెలియనితనంతో ముంచబోయాడని అర్ధం చేసుకుని అతన్ని పిచ్చాసుపత్రిలో చేర్చాడని చార్లీ తెలుసుకుంటాడు. దీనితో అతనికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్ధమవుతాయి. భార్య మరణించాక ఇద్దరి పిల్లలను ఒంటరిగా పెంచే బాధ్యత తీసుకున్న తండ్రి మతి లేని బిడ్డ చార్లీకి ఆపదగా మారతాడేమో అన్న అనుమానంతో కేవలం చార్లీపై ప్రేమతో అతని భద్రత కోసం రేమండ్‌ ను ఆసుపత్రి పాలు చేశాడు. చార్లీ పెరిగిన తరువాత స్వార్ధంతో మితి మీరిన కోపంతోనూ ఆ తండ్రినే దూరం చేసుకున్నాడు. చార్లీ తనతో తెగతెంపులు చేసుకుంటే తండ్రి రేమండ్‌ ను ఆసుపత్రిలోనే ఉంచి అతని సౌకర్యాలను చూసుకునేవాడు. తండ్రి ఎంత ప్రయత్నించినా చార్లీ అతన్ని తిరిగి కలవలేదు. ఇప్పుడు రేమండ్‌ భవిష్యత్తు కు డబ్బు అవసరం ఉంది అని, ఆసుపత్రిలో రేమండ్‌ సౌకర్యంగా జీవించడానికి తండ్రి ఆ ఆస్థి రేమండ్‌ కు అందేలా చూశాడని చార్లీకి అర్థమవుతుంది. దీనంతటికి తాను తండ్రిని కోపంతో దూరం చేసుకోవడం కారణం అని కూడా అతను అంగీకరిస్తాడు. అతనిలో ఆలోచన మొదలవుతుంది. దానితో చార్లీలో మనిషితనం బైటికి వస్తుంది. ముందుగా సుసానా కి ఫోన్‌ చేసి తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకుంటాడు. ఆమె స్నేహం తనకు కావాలని మొదటి సారి మనసువిప్పి మాట్లాడతాడు.
చార్లీ వ్యాపారం దివాళా తీసే స్థితికి వెళ్తుంది. అప్పటికప్పుడు ఎనభైవేల డాలర్ల అవసరం కలుగుతుంది. రేమండ్‌ తెలివిని, అంకెలను గుర్తుపెట్టుకునే శక్తిని, పేక ముక్కలను గురించే శక్తిని చార్లీ గమనిస్తాడు. అన్నతో పాటు లాస్‌వేగాస్‌ లో జూదం ఆడడానికి వెళతాడు. అక్కడ ఒకే రోజు రేమండ్‌ అద్భుతశక్తితో తనకు కావలసినదంతా సంపాదిస్తాడు. రేమండ్‌ దష్టి మళ్లడంతో మూడువేల డాలర్లు పోగొట్టుకున్నప్పుడు చార్లీ తాను ఇక ఆట ఆపేయాలని అర్ధం చేసుకుని ఆ డబ్బుతో తన అప్పు తీర్చుకుంటాడు. మరుసటి రోజు ఆ క్లబ్‌లో వాళ్లను లోపలికి రానివ్వరు. ఇక మళ్ళీ తమ ప్రయాణం సాగిస్తారు అన్నదమ్ములు.
వీళ్లు లాస్‌వేగాస్‌ చేరాక రేమండ్‌ డాక్టర్‌, చార్లీకి కొంత డబ్బు ఇచ్చి రేమండ్‌ ను తీసుకువెళతానని ఫోన్‌ చేయిస్తాడు. చార్లీ దీనికి అంగీకరించడు. ఆస్థి దక్కక పోయినందుకు ఇప్పుడు తనకు బాధ లేదని, తన అన్నతో తాను అనుబంధం పెంచుకుందామని అనుకుంటున్నానని, తనకు ఆ అవకాశం కావాలని వాదిస్తాడు. దీనితో కోర్టు సైక్రియాటిస్ట్‌ కు ఈ కేసును అప్పగిస్తుంది. కాని డాక్టర్‌ అడిగిన ప్రశ్నలకు రేమండ్‌ సరిగ్గా సమాధానం చెప్పలేకపోతాడు. తన భవిష్యత్తు నిర్ణయించుకునే శక్తిని రేమండ్‌ ప్రదర్శించలేకపోతాడు. దీనితో అతను హాస్పిటల్‌ లోనే ఉండాలని కోర్టు నిర్ణయిస్తుంది. డాక్టర్‌ ప్రశ్నలకు అన్న ఇబ్బంది పడడం చార్లీ చూడలేకపోతాడు. ఆ ప్రశ్నల పరంపరను ఆపు జేస్తాడు. రేమండ్‌ కు తమ్ముడిగా ఉండడం తనకు ఇష్టం అని రేమండ్‌తో చార్లీ చెప్పడం ప్రేక్షకుల మనసును తడి చేస్తుంది. డాక్టర్‌ రేమండ్‌ ను తనతో రైలులో తీసుకెళ్లుతున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి చార్లీ వెళతాడు. తాను రెండు వారాలలో అన్నని వచ్చి కలుస్తానని చార్లీ చెబుతూ ఉండగా సినిమా ముగుస్తుంది.
రేమండ్‌ పాత్రకు డస్టిన్‌ హాఫ్మాన్‌ ఓ సంవత్సరం పాటు హోంవర్క్‌ చేశారు. ఆటిజం ఉన్నవారిని కలిసి వారితో కొన్ని నెలలు గడిపాడు హాఫ్మాన్‌. పైగా పూర్తి స్థాయి నటుడు కాకముండు హాఫ్మాన్‌ హెల్పర్‌ గా సైకియాట్రిక్‌ హాస్పిటల్‌ లో పని చేశాడు. అక్కడ పేషంట్లతో గడిపిన అనుభవం ఈ సినిమాకు ఉపయోగించుకున్నాడు హాఫ్మాన్‌. రేమండ్‌ పాత్రను అప్పటి అమెరికాలో సావాంత్‌ సిండ్రోమ్‌ తో పుట్టిన లారెన్స్‌ కిమ్‌ పీక్‌ ఆధారంగా రాసుకున్నారు దర్శకులు బారీ మారో. డస్టిన్‌ హాఫ్మాన్‌ ఈ పాత్ర చేయడానికి కిమ్‌ తో చాలాకాలం గడిపారు. వివిధ సందర్భాలలో కిమ్‌ ప్రదర్శించే శరీర భాష, అతని ప్రవర్తను యథాతధంగా పట్టుకుని తన పాత్రని చెక్కుకున్నారు ఆయన. అందుకే ఈ సినిమా అంత సహజంగా వచ్చంది.
ఈ సినిమాకు నాలుగు ఆస్కార్లు లభించాయి. ఇది ఉత్తమ చిత్రంగాను, డస్టిన్‌ హాఫ్మాన్‌ ఉత్తమ నటుడిగా, బారీ లెవిన్సన్‌ ఉత్తమ దర్శకుడిగా, బారీ మారో ఉత్తమ స్క్రీన్‌ ప్లే కు ఆస్కర్‌ అందుకున్నారు. అయితే వీరంతా కూడా లారెన్స్‌ కిమ్‌ పీక్‌ ఈ సినిమాకు ప్రేరణ అని ఎన్నో సందర్భాలలో చెప్పారు. డస్టిన్‌ హాఫ్మాన్‌ ఈ సినిమాతో రెండవ ఆస్కార్‌ అవార్డును పొందారు.
టామ్‌ క్రూస్‌ ఈ తరానికి గొప్ప యాక్షన్‌ హీరోగా పరిచయం. ఈ సినిమాలో నటించేటప్పటికి హాఫ్మాన్‌ కు 51 సంవత్సరాలయితే టాం వయసు కేవలం 25 సంవత్సరాలు. కాని డస్టిన్‌ తో పోటీ పడి నటించాడు టాం. సినిమా అంతా ఈ అన్నదమ్ములిద్దరు కలిసి చేసే ప్రయాణం. అంటే సగం పైగా సినిమాలో వీరిద్దరే కనిపిస్తారు. అప్పుడు వాళ్ళ శరీర భాష గమనిస్తే టాం లో ఓ నిర్లక్ష్యం, కోపం, డస్టిన్‌ లో ఒక లోతు, అసహనం కనిపిస్తాయి. ఇద్దరూ ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతికే వ్యక్తులు. బైటి ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకోలేని అసహాయత రేమండ్‌ ది అయితే, తన షరతుల పై ప్రపంచం నడవాలనే అహం చార్లీది. దీన్ని తమ శరీర భాషతో ఆ ఇద్దరు నటులు ప్రతి సీన్‌ లో చూపించే విధానం చాలా బావుంటుంది. ఈ సినిమా పోస్టర్‌ లో వీరిద్దరిని చూస్తే ఆ నటుల ప్రతిభ అర్ధం చేసుకోవచ్చు.
చివరకు వచ్చేసరికి చార్లీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అతనిలో ఆలోచన పెరిగి, మనసులో ఇతరుల పట్ల ప్రేమ జనించడం కూడా టాం తన శరీర భాషలో చాలా బాగా చూపిస్తాడు. ఈ మార్పును ఆ లేత వయసులో ప్రతి సీన్లో స్పష్టంగా తన శరీర కదిలికలతో టాం క్రూస్‌ స్క్రీన్‌ పై పండిస్తూ తనలోని గొప్ప నటుడిని పరిచయం చేసుకున్నారు. మరో పక్క డస్టిన్‌ హాఫ్మాన్‌ ఎంతో భావోద్వేగిత నిండిన సీన్లలో కూడా ఒకటే రకంగా కనిపిస్తారు. అతని ఆటిజమ్‌ భావోద్వేగాలను ప్రదర్శించనీయదు. కాని ఆయనను స్క్రీన్‌ పై మొదటి నుండి చూస్తున్న ప్రేక్షకుల మనసుల్లో మాత్రం రకరకాల భావోద్వేగాలు వచ్చి పోతూ ఉంటాయి. తనను చూస్తున్న ప్రేక్షకులలో భావోద్వేగాలను తాను ఒకే రకంగా ప్రవర్తిస్తూ, అభావంగా చూస్తూ, పూర్తి బాలెన్స్‌ తో ఉంటూ కలిగించడం గొప్ప నటులకే సాధ్యం. డస్టిన్‌ హాఫ్మాన్‌ ఈ పాత్రను పోషించిన విధానమే నటులకు చక్కని పాఠం అవుతుంది. హాలీవుడ్‌ గర్వంగా చెప్పుకునే నటులలో డస్టిన్‌ ఒకరు. ఆయన ప్రతిభకు ఈ సినిమా గొప్ప తార్కాణంగా నిలుస్తుంది.
రెయిన్‌ మాన్‌ 39వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పోటీ పడింది. అక్కడ అది గోల్డెన్‌ బేర్‌ అవార్డు గెలుచుకుంది. అలా ఒకే సంవత్సరం గోల్డేన్‌ బేర్‌, ఆస్కార్‌ నూ గెలుచుకున్న ఏకైక ఉత్తమ చిత్రంగా రెయిన్‌ మాన్‌ చరిత్ర సష్టించింది. ఆ రికార్డు ను ఇప్పటి దాకా అంటే 2024 దాకా మరే సినిమా కూడా దాటలేకపోయింది.
– పి. జ్యోతి 

Spread the love