వరల్డ్ నం.1 చేతిలో ఓటమి
ఇండోనేషియా ఓపెన్
జకర్తా (ఇండోనేషియా) : భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. గత వారం సింగపూర్ ఓపెన్‌లో వరల్డ్ నం.1 ఆన్ సె యంగ్ చేతిలో ఓటమి పాలైన సింధు… తాజాగా ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లోనూ దక్షిణ కొరియా షట్లర్ ముందు తలొంచింది. జకర్తాలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో పి.వి సింధు 17-21, 14-21తో వరుస గేముల్లో టాప్ సీడ్ ఆన్ సె యంగ్ చేతిలో ఓటమిపాలైంది. ఆన్ సె యంగ్ చేతిలో పి.వి సింధుకు ఇది వరుసగా పదో ఓటమి. ఇప్పటి వరకు దక్షిణ కొరియా షట్లర్‌పై సింధు ఒక్క విజయం సాధించలేదు. ఎటాకింగ్ షట్లర్ పి.వి సింధుపై ఆన్ సె యంగ్ తిరుగులేని ఆధిపత్యం ఇండోనేషియాలోనూ కొనసాగించింది. ఆన్ సె యంగ్‌తో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌ను సింధు సానుకూలంగా షురూ చేసింది. తొలి గేమ్‌లో 10-10తో సమవుజ్జీగా నిలిచింది. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సింధు 15-14తో ఆన్ సె యంగ్‌పై పైచేయి సాధించింది.
కానీ ఆన్ సె యంగ్ వేగంగా పుంజుకుంది. 19-16తో ముందంజ వేసింది. ఉత్కంఠ రేపిన 41 షాట్ల ర్యాలీతో పాటు వరుసగా రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుని తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో ఆన్ సె యంగ్ అదే జోరు కొనసాగించింది. సులువుగా 13-6తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. సింధులో వెనుకంజ వేసినా.. పుంజుకునే ప్రయత్నం ఆపలేదు. పాయింట్ల అంతరం తగ్గిస్తూ పోరాట పటిమ చూఇపంచింది. కానీ ఆన్ సె యంగ్ మరోసారి మెరుగైన ప్రదర్శన చేసింది. సింధుపై వరుస గేముల్లో గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి నిరాశపరిచాడు. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో హాంగ్‌కాంగ్ ఆటగాడు లీ చెక్ చేతిలో 21-16, 13-21, 14-21తో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ను సొంతం చేసుకుని ముందంజ వేసినా.. వరుసగా రెండు గేముల్లో ఓటమి పాలైన ఆయుష్ శెట్టి థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, గద్దె రుత్విక శివాని జోడీ ఓటమి పాలైంది. ప్రీ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ జంట టామ్, డెల్ఫిన్ చేతిలో 13-21, 12-21తో వరుస గేముల్లోనే ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించారు.
హరిహరణ్ జోడీ ముందంజ
పురుషుల డబుల్స్ విభాగంలో హరిహరణ్, ఎంఆర్ అర్జున్ జోడీ ముందంజ వేసింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో హరిహరణ్, అర్జున్ జోడీ 16-21, 21-15, 21-19తో వరల్డ్ నం.23 మలేసియా షట్లర్లు ఆరోన్ థాయ్, కాంగ్ జింగ్‌లపై మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందారు. తొలి రౌండ్లో సాత్విక్, చిరాగ్‌లు ఫిట్‌నెస్ సమస్యలతో వాకోవర్ ఇవ్వగా ముందంజ వేసిన మలేషియా షట్లర్లను.. ప్రీ క్వార్టర్స్‌లో అర్జున్, హరిహరణ్‌లు నిలువరించారు. తొలి గేమ్‌ను కోల్పోయినా.. కీలక రెండో గేమ్‌లో నిలబడ్డారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ 16-17తో వెనుకంజ వేశారు. 48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో పుంజుకున్న అర్జున్, హరిహరణ్‌లు 21-19తో మూడో గేమ్‌తో పాటు క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ను ఎగరేసుకుపోయారు. నేడు క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్ నం.6, ప్రపంచ చాంపియన్‌షిప్స్ మెడలిస్ట్‌లు యూ సిన్, థియో యి (మలేషియా)తో పోటీపడనున్నారు.



