అఫ్గాన్‌తో వన్డేలకు దూరం
రోహిత్, హార్దిక్ అనుమానమే
ముంబయి : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గాయం బారిన పడ్డాడు. ఐపీఎల్19 ఫైనల్లో అజేయ అర్థ సెంచరీతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండో సీజన్‌లో టైటిల్ అందించిన విరాట్ కోహ్లి.. టైటిల్ పోరులో బ్యాటింగ్ చేస్తుండగా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. వికెట్ల మధ్య పరుగు తీస్తుండగా విరాట్ కోహ్లి ఇబ్బంది పడ్డాడు. గాయం వేధిస్తున్నా బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లి వరుసగా 4, 6 సిక్సర్‌తో చాంపియన్ సంబురాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నెల 13 నుంచి అప్గనిస్తాన్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్న విరాట్ కోహ్లికి బీసీసీఐ వైద్య బృందం స్కానింగ్ చేసినట్టు సమాచారం. వైద్య నివేదికల్లో కోహ్లికి మోకాలి కింద భాగంలో అరుదైన గాయమైనట్టు తెలిసింది. దీంతో కోహ్లి అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఐపీఎల్‌లో గాయాల బారిన పడిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య సైతం భారత వన్డే జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యలకు వైద్య పరీక్షల అనంతరం ఓ నిర్ణయం వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లితో పాటు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య సైతం అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు అనుమానంగా మారింది. విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ భారత జట్టులోకి రానుండగా.. రుతురాజ్ స్థానంలో భారత్-ఏ తరఫున రజత్ పటిదార్ శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌లో ఆడతాడని సమాచారం. భారత్, అఫ్గాన్‌లు ఈ నెల 13న ధర్మశాలలో తొలి వన్డే ఆడనుండగా.. 17న లక్నోలో రెండో వన్డే, 20న చెన్నైలో ఆఖరు వన్డే జరుగనుంది.



