Friday, June 5, 2026
E-PAPER
Homeఆటలువైభవ్‌‌కు చోటు దక్కేనా?

వైభవ్‌‌కు చోటు దక్కేనా?

- Advertisement -

సూర్యకుమార్‌ భవితవ్యంపై కీలక నిర్ణయం!
ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనలకు సహా ఆసియా క్రీడలకు టీ20 జట్టు ఎంపిక నేడు

ఐపీఎల్‌ ‌హంగామా ముగిసింది. స్వదేశంలో ఓ వైపు అఫ్గాన్‌‌తో టెస్టు సవాల్‌‌కు రంగం సిద్దమవుతోంది. కానీ, ఐపీఎల్‌‌లో వీరోచిత ఇన్నింగ్స్‌‌లతో ప్రపంచ క్రికెట్‌ ‌దిగ్గజాలతో పాటు అభిమానుల దృష్టిని తనవైపునకు తిప్పుకున్న వైభవ్‌ ‌సూర్యవంశీ.. భారత టీ20 జట్టులో చోటు దక్కించుకుంటాడా? లేదా? అనే ఆసక్తి ఇప్పడు సరికొత్త చర్చకు దారితీస్తోంది. భారత జట్టు ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ ‌పర్యటనలో ఏడు టీ20లు ఆడనుండగా, జపాన్‌ ‌వేదికగా ఆసియా క్రీడల్లో పోటీపడనుంది. ఈ మూడు పర్యటనలకు భారత సీనియర్‌ ‌సెలక్ష‍న్‌ ‌కమిటీ శనివారం జట్లను ఎంపిక చేయనుంది. 15 ఏండ్ల వైభవ్‌ ‌సూర్యవంశీతో పాటు 
35 ఏండ్ల సూర్యకుమార్‌ ‌యాదవ్‌ ‌భవితవ్యంపై అజిత్‌ అగార్కర్‌ ‌ప్యానెల్‌ ఓ నిర్ణయం తీసుకోనుంది.

​నవతెలంగాణ-క్రీడావిభాగం
బీసీసీఐ సీనియర్‌ ‌సెలక్ష‍న్‌ ‌కమిటీ శనివారం ముంబయిలో సమావేశం కానుంది. ఐర్లాండ్‌‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌‌తో ఐదు టీ20లు సహా ఆసియా క్రీడల్లో పోటీపడే భారత జట్లను ఎంపిక చేయనుంది. ఆసియా క్రీడలు జపాన్‌ ‌వేదికగా సెప్టెంబర్‌‌లో జరుగనుండగా, అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్‌‌తో టీమ్‌ ఇండియా టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించటమా? లేదంటే పసిడి పతకం వేటలో తొలి ప్రాధాన్య ఆటగాళ్లనే ఎంపిక చేయాలా? అనే అంశంపై చీఫ్‌ ‌సెలక్టర్‌ అజిత్‌ అగర్కార్‌ ‌సారథ్యంలోని సెలక్ష‍న్‌ ‌కమిటీ శనివారం తేల్చనుంది. దీనితో పాటు ఐపీఎల్‌‌లో సత్తా చాటిన క్రికెటర్లను జాతీయ జట్టులోకి తీసుకునే అంశంపై సెలక్ష‍న్‌ ‌కమిటీ వాడీవేడీగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.

​సూర్యకుమార్‌ ‌నిలిచేనా?
సూర్యకుమార్‌ ‌యాదవ్‌ ‌ఫామ్‌ ‌తీసికట్టుగా తయారైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌‌ను నిలబెట్టుకున్న సారథిగా సూర్యకుమార్‌ ‌యాదవ్‌ ‌చరిత్ర సృష్టించినా.. అటు ప్రపంచకప్‌‌లో అటు ఐపీఎల్‌‌లో అతడు పెద్దగా రాణించలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌‌లో 13 మ్యాచ్‌‌ల్లో 20.76 సగటు, 147.54 స్ట్రయిక్‌‌రేట్‌‌తో 270 పరుగులే చేశాడు. టీ20 ప్రపంచకప్‌‌లో 9 ఇన్నింగ్స్‌‌ల్లో 242 పరుగులు చేశాడు. స్ట్రయిక్‌‌రేట్ 136.72 మాత్రమే. యుఎస్‌ఏతో మ్యాచ్‌‌లో అజేయంగా 84 పరుగులు చేసిన సూర్య మ్యాన్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌‌గా నిలిచాడు. వాంఖడెలో ఆ ఒక్క ప్రదర్శన మినహా టీ20 ప్రపంచకప్‌‌లో సూర్య చేసిందేమీ లేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో సూర్యకుమార్‌ ‌యాదవ్‌‌కు 36 ఏండ్లు వస్తాయి. లాస్‌ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌‌ సహా దక్ష‍ిణాఫ్రికా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌‌లో ఆడాలని సూర్యకుమార్‌ ఆశిస్తున్నాడు. కానీ సెలక్ష‍న్‌ ‌కమిటీ అతడిని కెప్టెన్‌‌గా కొనసాగిస్తుందా? లేదంటే సారథ్య పగ్గాలు మరో ఆటగాడికి ఇచ్చి.. సూర్యను ఆటగాడిగా జట్టులో కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టు కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్‌‌లో సూర్యకుమార్‌ ‌యాదవ్‌ ‌పేరు లేదు. దీంతో సూర్యకుమార్‌ ‌యాదవ్‌ ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనలకు వెళ్తాడా? కెప్టెన్‌‌గా లేదంటే ఆటగాడిగా వెళ్తాడా అనేది తేలాల్సి ఉంది.

​సూర్యవంశీకి సరైన సమయం!
15 ఏండ్ల వైభవ్‌ ‌సూర్యవంశీ ఈ ఏడాది ఐపీఎల్‌లో రికార్డులు తిరగరాశాడు. గత ఏడాదే ఐపీఎల్లో అరంగ్రేటం చేసినా.. ఈ సీజన్లో వైభవ్‌ ‌సూర్యవంశీ రాజస్తాన్‌ ‌రాయల్స్ తరఫున అన్ని మ్యాచ్‌‌ల్లోనూ ఆడాడు. 16 ఇన్నింగ్స్‌‌ల్లో ఓ సెంచరీ, ఐదు అర్థ సెంచరీలు సహా 776 పరుగులు చేశాడు. స్ట్రయిక్‌‌రేట్‌ 237 కాగా.. 63 ఫోర్లు, 72 సిక్స్‌‌లు బాదాడు. ప్రపంచ మేటీ బౌలర్లను ఉతికారేసిన వైభవ్‌ ‌సూర్యవంశీ ఇప్పడు భారత సీనియర్‌ ‌జట్టు తరఫున బరిలోకి దిగేందుకు ఎదురుచూస్తున్నాడు. అభిషేక్‌ ‌శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ ‌కిషన్‌‌లతో కూడిన టాప్‌ ఆర్డర్‌ ఇటీవల టీ20 ప్రపంచకప్‌‌లో భారత్‌ ‌విజయంలో కీలక పాత్ర పోషించింది. వైభవ్‌ ‌సూర్యవంశీని టాప్‌ ఆర్డర్‌‌లో చేర్చటం సెలక్ష‍న్‌‌ కమిటీకి తీయని తలనొప్పిగా మారనుంది. అభిషేక్‌ ‌శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ ‌కిషన్‌‌లను కొనసాగిస్తూనే.. వైభవ్‌ ‌సూర్యవంశీకి రొటేషన్‌‌లో అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. లేదంటే, మిడిల్‌ ఆర్డర్‌‌లో సూర్యకుమార్‌‌ యాదవ్‌‌పై వేటు పడితే.. అతడి స్థానాన్ని సంజు శాంసన్‌, ఇషాన్‌ ‌కిషన్‌‌లలో ఒకరితో భర్తీ చేసి.. సూర్యవంశీని టాప్‌ ఆర్డర్‌‌లో ఆడించవచ్చు. కానీ అజిత్‌ అగార్కర్‌ ‌బృందం అంతటి సంచలన నిర్ణయం తీసుకుంటుందా? చూడాలి.

​శ్రేయస్‌, పటిదార్‌ ఎదురుచూపు
భారత టీ20 జట్టులో చోటు కోసం శ్రేయస్‌ అయ్యర్‌, రజత్‌ పటిదార్‌ ఎదురుచూస్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్ భారత టీ20 సారథ్య పగ్గాలకు అన్ని విధాల అర్హుడు. కానీ తొలుత అతడికి జట్టులో చోటు దక్కాలి. ఐపీఎల్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ ‌కింగ్స్‌‌ను ఫైనల్స్‌‌కు చేర్చిన శ్రేయస్‌.. కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ను చాంపియన్‌‌గా నిలిపాడు. అటు ఆటగాడిగా, అటు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ‌విమర్శకుల మన్ననలు పొందాడు. ఇదే సమయంలో రజత పటిదార్‌ ‌సైతం జట్టులో చోటు కోసం పోటీపడుతున్నాడు. వరుసగా రెండు ఐపీఎల్‌ ‌టైటిల్స్‌ ‌సాధించి దిగ్గజ కెప్టెన్లు ఎం.ఎస్‌ ‌ధోని, రోహిత్‌ ‌శర్మ సరసన నిలిచిన పటిదార్‌.. బ్యాటర్‌గా ఈ సీజన్లో గొప్పగా రాణించాడు. మిడిల్‌ ఆర్డర్లో ఆర్‌‌సీబీకి వెన్నెముకగా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌, రజత్ పటిదార్‌ ఇద్దరూ మిడిల్‌ ఆర్డర్‌‌ బ్యాటర్లు. ప్రస్తుతం తిలక్‌ ‌వర్మ మిడిల్ ఆర్డర్‌‌లో వీరి బ్యాటింగ్‌ ‌పొజిషన్‌‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌‌తో పాటు దేశవాళీ క్రికెట్‌‌లోనూ శ్రేయస్‌, పటిదార్‌ ‌గొప్పగా రాణిస్తున్నారు. 2025 సయ్యద్‌ ‌ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌ ‌ఫైనల్లో శ్రేయస్‌ అయ్యర్‌ ‌ముంబయిని గెలుపు బాటలో నడిపించగా.. రజత్‌ ‌పటిదార్‌ ‌సారథ్యంలోని మధ్యప్రదేశ్‌ ‌రన్నరప్‌‌గా నిలిచింది. 2025 ఐపీఎల్ ఫైనల్లో పటిదార్‌ ‌కెప్టెన్సీలో బెంగళూరు విజేతగా నిలువగా.. శ్రేయస్‌ ‌కెప్టెన్సీలో పంజాబ్‌ ‌కింగ్స్‌ ‌రన్నరప్‌‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

​హార్దిక్‌‌కు కఠిన పరీక్ష‍
భారత జట్టు విజయాల్లో హార్దిక్‌ ‌పాండ్య విశేష పాత్ర పోషిస్తున్నా.. గాయాలతో అతడు జట్టుకు తరచుగా దూరం అవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌‌లో హార్దిక్‌ ‌పాండ్య కెప్టెన్‌‌గా, ఆటగాడిగా విఫలం అయ్యాడు. గాయంతో పాండ్య వంద శాతం ప్రదర్శన ఇవ్వలేదు. అఫ్గనిస్తాన్‌‌తో వన్డేలకు హార్దిక్‌ ‌పాండ్యను ఎంపిక చేసినా.. నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, శివం దూబెల వైపు సెలక్ష‍న్‌ ‌కమిటీ చూస్తోంది. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌‌కప్‌ నేపథ్యంలో హార్దిక్‌ ‌పాండ్య నిలకడగా ఆల్‌‌రౌండ్‌‌గా ప్రతిభ చాటాల్సి ఉంది. లేదంటే, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, శివం దూబెలు జట్టులో అతడి స్థానాన్ని ఎగరేసుకుపోయే అవకాశం కనిపిస్తోంది. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ ‌పర్యటనలకు సైతం నితీశ్‌ ‌కుమార్‌, శివం దూబెలు ఎంపికయ్యే సూచనలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -