ఇంకెన్నాళ్లీ… నినాదాలు?

ఇంకెన్నాళ్లీ... నినాదాలు?రాబోయే పంద్రాగస్టు ‘థీం’ (నినాదం)ను ‘వికసిత్‌ భారత్‌’గా కేంద్రం తీర్మానించింది. గత వారం రోజుల ముందు ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ నినాదాన్ని బలంగా వినిపించాలని ఆర్థిక శాఖ యోచిస్తున్నట్లు కూడా తెలియవచ్చింది. కవులు, రచయితలు, మేధావులిచ్చే నినాదాలను స్ఫూర్తిగా తీసుకొని పాలకులు విధానాలను రూపొందించాలి, వాటిని సఫలీకృతం చేయాలి. పాలకులే నినాదాలు ఇస్తూపోతే ఇక ప్రజల కడుపుకిందికి నీళ్లెవరు తోస్తారు? గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వానికి మెజారిటీ తగ్గడానికి ప్రధాన కారణం ప్రజల సమస్యల పట్ల సరైన స్పందన లేదనేది స్పష్టం. ఇది గుర్తించకుండా ఇంకా నినాదాలతో కాలం గడపాలనుకోవడం మోసపూరితం, వారి నిస్సాహాయత. భారత్‌ వికసిస్తోందని నమ్మే వారు కింది అంశాలను కాస్త పరిశీలించాలి.
నెలసరి 20 వేలలోపు ఆదాయానికి అవకాశమున్న 2200 ఎయిర్‌పోర్ట్‌ హమాలీ (లోడింగ్‌ అన్‌లోడింగ్‌) పోస్టులకు 25వేల మంది అభ్యర్థులు ఎగబడ్డారు. దేశం నలుమూలల నుండి ముంబై ఎయిర్‌పోర్టుకు వీరందరూ తరలి వెళ్లారు. సదరు ఉపాధికి కావలసిన అప్లికేషన్‌ ఫారం కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి తిండి నీరు లభించక అనేకమంది సొమ్మసిల్లి పోయారు. అయినా పట్టు వదలకుండా ఊపిరి బిగపట్టుకుని అప్లికేషన్‌ ఫారం కోసం క్యూ లైన్‌లో ముందుకు నడుస్తూ ఆర్గనైజర్ల నిర్లక్ష్యం వలన పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి అనేకమంది ఆసుపత్రి పాలయ్యారు. అత్యంత పదునైన యువతలో నిరుద్యోగం తాండవిస్తోందనడానికి ఇది ఉదాహరణగా సరిపోదా? ఇలాంటి సమస్యను నివారించడానికి ప్రయత్నించకపోగా యూనియన్‌ హోమ్‌ మినిస్టర్‌ సమక్షంలోనే మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ”యువత డిగ్రీ సర్టిఫికెట్ల కోసం ప్రయత్నించకుండా మోటార్‌ సైకిల్‌ పంక్చర్‌ దుకాణం పెట్టుకుంటే బాగుపడతారని” ఎద్దేవా చేస్తూ సలహా ఇచ్చారు. పంక్చర్ల షాపులు పెట్టుకోవడం తప్పేమీ కాదు. కానీ చదువుకోవాల్సిన అవసరం లేదని ప్రజాప్రతినిధి సలహా ఇస్తున్నారంటే అది వారి తెలివి తక్కువ తనమా, లేక ఉపాధి కల్పనలో తమ చేతగానితనాన్ని బయట పెట్టుకుంటున్నట్టా? చదువుకున్న వాళ్లలో డిగ్రీ స్థాయికి చేరలేని వాళ్లు 70 శాతం మంది ఉన్నారు. వీరంతా విరామమెరుగని ఉపాధికి ఆమడ దూరంలో ఉన్నారు. అలాంటి వారికి పంక్చర్‌ షాపు, సమోసా బండి లాంటి అనేక ప్రత్యామ్నాయ ఉపాధిని సూచించండి. దానికోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి. కానీ డిగ్రీ స్థాయికి చేరుకోవడం కూడా తప్పే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే ఈ దేశ యువతను ఏ రకంగా ప్రోత్సహించినట్లౌతుంది? ఇలాంటి నినాదాలతో భారత్‌ను వికసింప చేయాలని చూస్తున్నారా?
యువతలో కొరవడిన నైపుణ్యం
18వ లోక్‌సభ కొలువు తీరగానే ప్రధానమైన ఎనిమిది క్యాబినెట్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపాధి కల్పనపై ప్రతి సందర్భంలోనూ ఒక కమిటీ ఏర్పడుతుంది. ఈసారి ఉపాధి కల్పనపై ఏర్పడే కమిటీ పేరు మారుస్తూ ‘నైపుణ్యం మరియు బతుకుదెరువు’ (స్కిల్‌ అండ్‌ లైవ్లీ హుడ్‌) అనే పదాలను జోడించారు. ఇది అభినంద నీయం. ఎందుకంటే భారత దేశంలో పెరుగుతున్న మానవ వనరులలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సరిగా లేదని, దాని వలన బతుకుదెరువు కష్టమవుతుందన్న అంశాన్ని ఒప్పుకున్నందుకు. అయితే ఈ పేరు మార్పు కమిటీకే పరిమితం కాకుండా విద్యా విధానంలో, నైపుణ్యాలను ఒనగూర్చే విభాగాలలో విధానాలను రూపొందించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఏటా 15 లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్ట భద్రులు తయారవుతున్నారు. వీరందరిలో అత్యధికులకు క్యాంపస్‌ ప్లేస్మెంట్‌లు దొరకడం లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయమేమంటే 2022-23 సంవత్సరానికి ఇంజినీరింగ్‌ పట్టా పొందిన ఐఐటి ఉత్తీర్ణుల్లో 37 శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్మెంట్లు రాలేదు! ఒక మూస పద్ధతిలో భారత యువతకు నైపుణ్యాభివృద్ధి చొప్పించబడుతుంది అని ఈ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. దీన్ని రివ్యూ చేసే కమిటీ తక్షణం కావాలి మనకి. ఇదిలా ఉండగా మెడికల్‌ ‘పీజీ’ ఎంట్రన్స్‌కు సంబంధించిన నీట్‌ పరీక్ష పత్రాలు లీకవడం, ఇదివరకే నిర్వహించవలసిన పరీక్ష వాయిదా పడటం, విద్యార్థులను వారి తల్లిదండ్రులను కలవరపెట్టడమే కాకుండా ఇంతటి ప్రతిష్టాత్మకమైన పరీక్ష నిర్వహణలో ఏర్పడుతున్న వైఫల్యాలు దేశ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి నిందితుల వివరాలు అడిగితే తప్ప అరెస్టులు జరగలేదు.
ఇక భారత దేశ ప్రతిష్టకే వన్నెతెచ్చే ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌)కు సంబంధించిన ఎంపికల్లోనూ అవకతవకలు జరిగినట్లు బట్టబయలైంది. పూజా ఖేడ్కర్‌ అనే ఒక అభ్యర్థి నకిలీ ధృవ పత్రాలతో ఉద్యోగానికి అర్హత సాధించడం, సదరు పత్రాలు అధికారులకు చూపించే క్రమంలో బోల్తా కొట్టించడం జరిగాయని తేలింది. అదీగాక అర్హతకు మించి 12 సార్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలకు హాజరయ్యిందని తేలడమంటే ఎంతటి సంస్థాగత లోపభూయిష్టానికి ఇది అద్దం పడుతోంది? బయటపడని ఇంకెన్ని కుంభకోణాలు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన నియామకాల్లో జరిగాయో అని అనుమానించడంలో తప్పే లేదు. బడా బాబుల పిల్లలందరూ ఇలాంటి పైరవీల ద్వారా గద్దెనెక్కుతున్నారని బహిర్గతమవు తున్నప్పుడు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూతురు కూడా దొడ్డిదారిన ఐఏఎస్‌ సాధించిందని చక్కర్లు కొడుతున్న వదంతులను కూడా ప్రజల విశ్వసించే అవకాశం ఉంది! నైపుణ్యాభివృద్ధి మాటేమో గాని నైపుణ్యాలను గుర్తించి ప్రతిభావంతులను ప్రజాపాలనలోకి తీసుకొచ్చే క్రమంలో ఇంతటి అవకతవకలు జరుగుతుంటే అది ఈ దేశాన్ని ఎలా వికసింపజేయ గలదు?
ఐటీరంగంలో ‘లేఆఫ్‌’లు
గత రెండేండ్లుగా ప్రపంచ వ్యాప్త ఐటి రంగంలో నియామ కాలలో తగ్గుదల, ఉన్న ఉద్యోగాలను ‘లే ఆఫ్‌’ల పేరున తొలగింపులు సర్వసాధారణమై ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను బహు కలవరానికి గురిచేస్తున్నాయి. వెలువడిన గణాంకాలను బట్టి భారత ఐటీ రంగంలోని ఉద్యోగుల జీతాలలో పెరుగుదల అత్యంత స్వల్ప స్థాయికి పడిపోయింది. ఇన్ఫోసిస్‌ కంపెనీ సాధారణంగా ప్రతి ఏటా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లలో మంచి పెంపుదల కనబరుస్తది. కానీ 2022 సంవత్సరంలో 14.6శాతం పెరిగిన ఇంక్రిమెంట్లను 2024 సంవత్సరానికి గాను కేవలం 9 శాతం పెంపుదల చేసింది. గతంలో 10.5శాతం సాలిన వేతనం పెంచిన టిసిఎస్‌ కంపెనీ ఇప్పుడు 7.9 శాతానికి పరిమితమైంది. విప్రో కంపెనీ కూడా 9.5శాతం సాలీనా వేతనాలు పెంచి సింగిల్‌ డిజిట్‌ కే పరిమితమైంది. ఉద్యోగుల నియామకాలలో, వారి నుండి ఆశించే పని విషయంలో, వారికి ఇచ్చే పారితోషికంలో ఎలాంటి యూనిఫార్మిటీ ఈ ఐటీ రంగంలో లేదు. దీనివలన యాజమాన్యం ఎవరినైనా, ఎప్పుడైనా, ఏ విధంగానైనా నియమించుకోవచ్చు, తొలగించవచ్చు. జీతభత్యాల పెంపుదల ల్లోనూ అదే విధానాన్ని పాటించవచ్చు! కార్మిక చట్టాలు ఉద్యోగుల హక్కులను కాపాడేందు కోసం కాకుండా యాజమాన్యాల సంతృప్తి మేరకే అమలు జరుగుతున్నట్టుగా పేపర్‌ పైన చూపించి సంఘాలు పెట్టుకునే అవకాశాలు లేకపోవడం వల్ల ప్రశ్నించడమే కరువైపోతున్నది ఈ ఐటీ రంగంలో. వాతావరణ మార్పులే మానవ వనరు పునరుత్పత్తిపై ప్రభావాన్ని చూపుతాయి అన్నప్పుడు ఇంతటి మానసిక ఒత్తిడి మరెంత ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవాలి. అందుచేత ఇలాంటి అనిశ్చితి గల రంగాలపై ప్రత్యేకమైన దృష్టి సారించకపోతే భారత్‌ ఎలా వికసించగలుగుతుంది?
పేదలపై పన్నులు…పెద్దలకు రాయితీలు
ఉపాధి సంబంధిత అంశాలను నిర్లక్ష్యం చేస్తూ తమ ఆశ్రితులకు మాత్రం తాయిలాలు ప్రకటించడంలో వెనుకాడడం లేదు. ఉదాహరణకు; బ్యాంకు రుణాల ఎగవేతదారులను కాపాడడానికి ఇదివరకే ఐబీసీ (ఇన్సాల్విన్సీ బ్యాంక్రఫ్టసి కోడ్‌)ను తీసుకువచ్చి డిఫాల్టర్లుగా డిక్లేర్‌ చేయడానికి ఉన్న 180 రోజుల వ్యవధి కాలాన్ని 90 రోజులకు కుదించి ఎంతో మేలు చేశారు. అసలు డిఫాల్టర్లుగా డి క్లియర్‌ చేసే కన్నా ముందు మరింత కాలాన్ని ఇవ్వడం కోసం ‘ఎవర్‌ గ్రీనింగ్‌’ (స్వల్పరుణాలను మంజూరు చేసి ఖాతాను జీవింపజేయడం) పేరుతో ఇచ్చిన రుణాలను ఎన్‌.పీ.ఎ లుగా మారకుండా చూసేందుకు మరో ప్రతిపాదనతో ఆశ్రిత పెట్టుబడిదారులకు సహాయపడ జూస్తున్నారు. ఇలాంటి వికాసానికి తహతహలాడు తున్నారు కాబట్టే దేశంలోని ఒక శాతం జనాభా 40 శాతం సంపదను తమ గుప్పిట్లో పెట్టుకున్నదని థామస్‌ పీకేటీ లాంటి వాళ్లే కాదు అధికారిక గణంకాలు కూడా చెబుతున్నాయి. ఇదే ఒక శాతం జనాభా దగ్గర సరిగ్గా 30 ఏళ్ల క్రితం 12.5శాతం సంపదనే ఉండేది. సాలీనా నమోదవుతున్న ఆదాయంలో 20శాతం ఈ ఒక శాతం జనాభా ఇప్పుడు అందుకుంటుంటే గత 30 ఏండ్ల క్రితం ఇది 7.9 మాత్రమే ఉండేది. ఎండాకాలంలో మోడు వారిన చెట్టుపై వికసించే మోదుగు పూల రంగుల లాంటిదే ఈ అసమానతల వికసిత్‌ భారత్‌. దీనికితోడు పరోక్ష పన్నులను మరింతగా పెంచి, సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కార్పొరేట్లకు పన్ను రాయితీలిస్తూ, ఎగవేత దారులను, బడా వ్యాపారులను పన్ను పరిధిలోకి తీసుకువచ్చే సాహసమే చేయకపోవడం వల్ల ‘వికసిత్‌’ కొందరికే పరిమితమై కష్టాల కడలిలో ఎదురీదడమే అనేకుల కర్తవ్యమవుతున్నది.
సెల్‌ : 99513 00016

Spread the love