‘ఉపాధి’లో ఇన్ని లక్షల అవినీతా..!

– ఎంపీడీవో, ఈజీఎస్, కార్యదర్శులపై చర్యలు తప్పవు 
– అడిషనల్ డీఆర్ డీవో
– చాలా గ్రామాల్లో లక్షల సొమ్ము పక్కదోవ..
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మర్కోడు, పెద్ద వెంకటాపురం, రాఘవాపురం, అనంతోగు, పాతూరు, బోడాయికుంట, నడిమిగూడెం, రాయిపాడు, రామాంజిగూడెం, తదితర  గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల్లో జరిగిన లక్షల రూపాయల అవినీతిని చూసి నివ్వెరబోయి జిల్లాలో ఏ మండలంలో ఈ స్థాయిలో అక్రమాలు చూడలేదని అడిషనల్ పీఆర్ డీఏ రవి అన్నారు. గత వారం రోజులుగా గ్రామ మండలంలోని 12 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామి పనులపై ఎస్.ఆర్.పి చెన్నకేశవులు, ఎస్.టీ.ఎం సాయి ఆనంద్ బృందంతో సామాజిక తనిఖీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి వరకు స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, జడ్పీటీసీ కొమరం హనుమంతరావు సమక్షంలో అడిషనల్ పీడీ రవి ఆధ్వర్యంలో గత 2023 సంవత్సరం మార్చి నెల నుంచి 2024 సంవత్సరం మార్చి నెల వరకు ఆళ్ళపల్లి మండలంలో జరిగిన సుమారు రూ.2 కోట్ల రూపాయల ఈజీఎస్ పనులపై ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఈ ఓపెన్ ఫోరంకు జవాబుదారీతనం ఇవ్వాల్సిన అప్పటి ఎంపీడీవో గైర్హాజరయ్యారు. అలాగే ఆళ్ళపల్లి గ్రామంలో సంవత్సర కాలంలో రూ.58 లక్షల రూపాయల ఈజీఎస్ పనులకు లెక్కలు చూపించాల్సిన టీఏ సైతం హాజరుకాలేదు. కాగా, ఓపెన్ ఫోరంలో అప్పటి, ఇప్పటి ఎంపీడీవో, ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శులు, మేట్ల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో జరిగిన అనేక పనుల్లో అక్రమాలు, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్టు సామాజిక తనిఖీ బృందం ఆధారాలతో ప్రజా వేదికలో నిరూపించారు. ఆళ్ళపల్లిలో 3వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఓపెన్ నిర్వహిస్తున్న అధికారులు తప్పడు పద్దతిలో, తప్పుడు లెక్కలు చూపి డబ్బులు దుర్వినియోగం చేసిన సంబంధిత అధికారులు, ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శుల నుంచి లక్షల రూపాయల సొమ్ము రికవరీ చేయించి, షోకాజ్ నోటీసులు, బదిలీలు ఉంటాయని, సాక్ష్యాధారాలతో అక్రమాలు నిరూపితం కావడంతో సస్పెండ్ కూడా చేస్తామని ఏపీడీ వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన సోషల్ ఆడిట్ లో లక్షల సొమ్ము రికవరీకి పెడతామని చెప్పారు.
ఫారెస్ట్ శాఖల అధికారులు 19 లక్షలకు పైగా రూపాయలకు నివేదికలు ఇవ్వక పోవడంతో పూర్తి స్థాయిలో తనిఖీ జరగని మర్కోడు గ్రామం సంబంధించి, అలాగే పెద్ద వెంకటాపురం, ఇతర శాఖలు, ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శులు సైతం చేసిన పనులకు సామాజిక తనిఖీ బృందానికి లెక్కలు ఇవ్వకపోవడంతో లక్షల రూపాయల పనులపై సామాజిక తనిఖీ జరగలేదని ఓపెన్ ఫోరం లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయని. నివేదికలు ఇవ్వని ఇట్టి పనులపై మరోసారి తనిఖీ చేస్తామని అడిషనల్ డీఆర్ డీవో అన్నారు. ఏదీ ఏమైనా  ఆళ్ళపల్లి జీపీలో రూ.58 లక్షల ఈజీఎస్ పనులపై చాలా వరకు తప్పుడు లెక్కలు చూపి డబ్బులు పక్కదోవ పట్టాయన్న విషయం తేలడంతో ఉపాధిలో అక్రమంగా లబ్ధిపొందిన కొందరు మేట్లు, ఉపాధి కూలీలు, ఓ ప్రజా ప్రతినిధి.. పని లెక్కల పూర్తి నివేదిక రాకుండా నానా రభస సృష్టించారు. దాంతో ఎంపీపీ పోలీసులను పిలిపించి సమావేశం కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. లక్షల అవినీతిపై ఓపెన్ ఫోరం జారుతుంటే వాటిని వెలుగులోకి రాకుండా అడ్డుపడిన ఓ ప్రజా ప్రతినిధి తీరుపై స్థానిక, ఇల్లందు మీడియాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో అంబూడ్స్ పర్సన్ నాగ ప్రకాష్, సామాజిక తనిఖీ అధికారి అనూష, విజిలెన్స్ వింగ్ అధికారి రమణ, జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ అనీల్, ఆళ్ళపల్లి ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love