పోడు భూముల సమస్యలు పరిష్కరించండి

– గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి
– కొండపర్తి లక్ష్మయ్య గుత్తి కోయ గుంపు, ట్రెంచ్ పనులు అడ్డుకున్న గిరిజన సంఘం నాయకులు
నవతెలంగాణ – తాడ్వాయి
గత ఎన్నో సంవత్సరాల నుండి జీవిస్తున్న గుత్తి కోయ ఆదివాసి పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని, అటవీశాఖ అధికారులు ఆదివాసీలపై దాడులు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు, అత్యుత్సంగ వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్ర పరిధిలో గల కొండపర్తి లక్ష్మయ్య గుంపులో గత ఎన్నో సంవత్సరాల నుండి జీవిస్తున్న వారి భూములలో ట్రెంచ్ పనులను గిరిజన సంఘం, రైతు సంఘం, స్థానిక గుత్తి కోయ నాయకులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దిగ్గి చిరంజీవి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటి కార్డు పొంది, పోడు వ్యవసాయం, కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ఆదివాసి గుత్తి కోయల భూములలో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టడం, వలస ఆదివాసి గిరిజనులపై దాడులు చేయడం అనాగరిక చర్య అని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి రానప్పుడు, వలస గుత్తి కోయ ఆదివాసిల పై ముసలి కన్నీరు కార్చారని, వారి ఓట్లు వేసుకొని గెలిచిన అనంతరం, ఇప్పుడు వారిని ఫారెస్ట్ అధికారులతో అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఎన్నికల ముందు గత ఎన్నో సంవత్సరాల నుండి జీవిస్తున్న వలస ఆదివాసి గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వారి జీవనం సాఫీగా జరిగేటట్టు చూడాలని తెలిపారు. లేకుంటే గిరిజన సంఘం ఆధ్వర్యంలో అంచలంచెలుగా, ఉధృత గా ఉద్యమాలు ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, సంఘం నాయకులు దాసరి కృష్ణ, స్థానిక గుత్తి కోయ గిరిజన నాయకులు పోడెం లక్ష్మయ్య స్థానిక గుత్తి కోయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love