యానాది బతుకు పోరే ‘పాయి దరువులు’

'Pai Daruvu' fighting for survivalమనిషి పుట్టినప్పటి నుంచే తమ అనుభవాలను, అనుభూతులను, ఆలోచనలను కథగానో, నవలగాో పంచుకుంటున్నారు. ఇదంతా మనిషిలోని భాషా సామర్థ్యం వలన సాధ్యమైందని చెప్పవచ్చు. అయితే ప్రపంచ సాహిత్యంలో 17 వ శతబ్దంలో స్పానిష్‌, ఫ్రెంచి దేశాల్లో మొదటగా నవల పుట్టింది. అది తెలుగు సాహిత్యానికి వచ్చేసరికి యింకో శతాబ్ద కాలం పట్టింది. నవల విస్తతిచేతనో, విశాలతనం చేతనో, అనేకానేక పనుల ఒత్తిడి మధ్య విశ్రాంతి లేకపోవడం చేతనో కొత్త నవలల పుట్టుక కష్టమౌతున్నది. ఒకప్పుడు పతాక స్థాయిలో తెలుగు సాహిత్యాన్ని ఏలిన నవలా ప్రక్రియ యిప్పుడు పతనావస్థలోకి చేరింది.

ఆది నుండి కొంతమంతి చేతుల్లోని సాహిత్యం అస్తిత్వ ఉద్యమాల పుణ్యమా అని అందరి చేతుల్లోకొచ్చింది. ఫలితంగా ఎవరెవరి జీవితాలను వాళ్ళు సాహిత్యంలోకి తెచ్చారు. తెస్తున్నారు. అట్టడుగు జీవితాలను అక్షర ఆయుధంతో అజరామరం చేస్తున్నారు. ఈ కోవలోనే దళిత సాహిత్యం, స్త్రీవాద, ముస్లీం వాద సాహిత్యం తమతమ అస్తిత్వాలు, ఉనికిని నిలబెట్టుకుంటున్నాయి. అయితే దళిత సాహిత్యంలో యితర వర్గాల జీవితాలు వచ్చినంతగా యానాది జీవితపు సాహిత్యం రాలేదనేది కాదనలేని సత్యం. కేవలం వేళ్ళు మీద లెక్కబెట్ట కలిగే కేశవరెడ్డి గారి ‘చివరి గుడిసె’, ఏకీల వెంకటేశ్వర్లు గారి ‘ఎన్నెల నవ్వు’, చెంచు నవల మాత్రమే ప్రధానంగా ధర్శనమిస్తున్నాయి.
దీనికి కారణాలు ఆ సామాజిక వర్గాల్లో పెరగని అక్షరాస్యత, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కావచ్చు. అందుచేత ఆ వర్గంలోని నవలా సాహిత్యంలో చాలా కాళీలు ఏర్పడ్డాయి. ఏర్పడుతున్నాయి. ఆ ఖాళీలను పూరించాల్సిన బాధ్యత తెలుగు సాహితీకారుల పై ఎంతైనా ఉన్నది.
”ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిపుడు, దాచేస్తే దాగని సత్యం రావాలిపుడు” అన్న శ్రీ శ్రీ మాటలను నిజం చేస్తూ ఈ సందిగ్ధ సమయాన ఇటీవల కె.వి.మేఘనాధ్‌ రెడ్డి చిత్తూరు జిల్లా మొరుసునాడు సజీవ భాషలో వచ్చందే ‘పాయి దరువులు’ యానాది జీవితపు నవల. దీన్ని ఆ ఖాళీలను పూరించే గొప్ప ప్రయత్నంగా చూడవచ్చు.
ఆధిపత్య నిచ్చెన మెట్ల సమాజంలో దళిత ఆదివాసీలు అణచివేతకు గురవుతూనే వున్నారు. అందునా యానాది జీవితాలు అత్యంత దుర్భరమైనవి. వీరికి స్థలాన్ని బట్టి పేర్లు, పనులు మారిపోతుంటాయి తప్ప, వీరి బతుకులెప్పుడూ భారమే. వీరిని కొన్ని చోట్ల ఇరలోల్లంటే, మరికొన్ని చోట్ల చెంచులంటారు. ఒక చోట ఎలుకలు పడితే యింో చోట పాములు పడుతారు. మరికొన్ని చోట్ల ఒడుపుగా వెదురు బుట్టలల్లుతారు. మొత్తానికి అడవిలో క్రూర జంతువులను సైతం వేటాడిన బలమైన సమూహం. నేటి సాంఘిక సమాజంలో బలహీనమైపోయి నabఱ్‌బaశ్రీ ఉటటవఅసవతీర (తరచూ దొంగతనంచేసే నేరస్థులు) అనే ముద్రతోనే బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏర్పరిచారు. అయితే కొంతమంది త్యాగాల వలన ఒక తరానికి యింకో తరానికి మధ్య ఆలోచన స్థాయిలో, శైలిలో, సామాజిక చైతన్యంలో, అవగాహనలో ుస్పష్టమైన తేడాలున్నాయి. ముందు తరమోళ్ళకి అన్యాయం జరిగినా, నోరు మెదపకుండా అణిగిమణిగి భయపడుతూ బతుకీడ్చిన పాత తరం ఒకపక్క వుంటే అదే అన్యాయాన్ని మనసులో పెట్టుకొని గుండె ధైర్యంతో ఎదిరించే ‘పాయి దరువు’ నవలలోని నేటి తరపు యానాది చిన్నమ్మి గొప్ప ఉదాహరణ. ఈ నవల యానాది జీవితాన్ని, జీవన విధానాన్ని, అణచివేతను, అన్యాయాన్ని మాత్రమే చిత్రించలేదు. దానికి వ్యతిరేకంగా ఎదిరించిన బతుకు పోరును, మురికెరగని మట్టి మనుషుల సంబంధాలని, రంగులద్దని మట్టి భాషతో చిత్రించిందీ నవల.
”చందమామ వో.. చందమామ/ చిన్నమ్మి జాడేదే చందమామ/ అడివి దావల్లో, అల్చంద రాయిల్లో/ మెతుకు కాళ్ళతో, రాయితొక్కడతో/ ఏడేడ చిత్ర సెమ పడ్తుండాదో..!/ ఏడనేసి దొమ్మదాయికాలు పడ్తుండాదో..!!” అని పాపులమ్మ పాడే పాటొకటి చాలు చిన్నమ్మి బతుకు పోరు ఏపాటిదో చెప్పడానికి. చిన్నమ్మి చాలా కాలం వరకు గుండెలో గుర్తుండిపోయే సజీవ పాతర. ఎందుకంటే ఎవరి ప్రేమను పొందకుండానే అందరికీ సమానంగా ప్రేమను పంచే ప్రేమమూర్తి. వారానికి మేపిన బొల్లిమేకకి తమ బిడ్డలైన లింగాలగోడుకి పాయి దరువులేసిన (విడదీసిన) ఆధిపత్య, భూస్వామి రాజయ్య. పుట్టినప్పుడే అనాథైన లింగాలగోడిని చిన్నమ్మి తనలాగే ప్రేమిస్తుంది. లింగాలగోడికి పాల్తపిచ్చడానికి వొచ్చిన రాజయ్య కొడుకు ఆనందుడిని తనలాగే ప్రేమిస్తుంది. ఆనందుడితో పాటు అడివికి వచ్చిన కుక్కపిలల పొట్టోడిని తనలాగే ప్రేమిస్తుంది. ఈ విషయంలో చిన్నమ్మి యేసు క్రీస్తు చెప్పిన ”నీలాగే నీ పొరుగు వారిని ప్రేమించుమూ” అన్న మాటలు గుర్తుకొస్తాయి.
తమను తరతరాలుగా వేధిస్తున్న రాజయ్య కొడుక్కి కూడా అడివిలో జాగ్రత్తలు చెప్పిన అడివి మల్లెపువ్వులాంటి మనసున్న బాయన్న తారాస పడుతాడు.
లింగాలగోడు కనిపించక పోతే అడవింతా వెతికిన చిన్నమ్మి ప్రేమ, తపన, పట్టుదల కనిపిస్తుంది. దొడ్డి నుంచి డవికొచ్చేసరికి అలిసిపోయి శ్యాలమానొంక దగ్గిర నీల్లు తాగితే మనమూ కాసేపు మేకలతో పాటు సేదదీరుతాం.
వోడేసెట్ల గుంట కాడ చిన్నమ్మి ఆనందుడికి సంగటితో పాటు చింతొక్కిస్తే మన నాలుకూరి లొట్టలేస్తాం. గంగమ్మ జాతర కోసం లింగాల మేకపోతుని బలి కుట్టిగా నిర్ణయించి రాజయోల్లు చెవులు కోస్తే మనమూ అల్లాడిపోతాం. బాధపడిపోతాం. పాపులమ్మతో పాటు మనమూ ఒకరుగా గుడిసెలో నిలబడి దిగులుపడతాం. కౌండిన్య అడివి, కుంకూరి గుట్ట మొత్తాన్ని మేకలతో పాటుగా మనం కూడా ఓసారి తిరగాడిన అనుభూతి పొందుతాం.
అక్కడున్న వైదిగం చెట్లను, పుట్లను చూసొస్తాం. మేక కాపరుల్లో ఒకరిగా వుంటాం. చిన్నమ్మిపై లింగాల మేక ద్వారా ఆధిపత్య రాజయ్య పన్నిన కుట్రను చూసి కోప్పడతాం. ఇలా మనం కూడా నవల్లోని పాత్రల్లో ఒకరిగా, నవలతో పాటుగా ప్రయాణిస్తాం.
యానాదుల ఆయుధమైన గసిగ కర్ర (గూసి కొయ్యి) వారికి ఏవిధంగా తోడుంటాదో, ఈరమ్మ సినబ్బకు యానాది కులదైవం కన్నియమ్మ తన మహత్యంతో కాపుగాస్తాదో, నారప్ప కుండ డప్పు కొడితే యానాది గుడిసెలంతా ఏవిధంగా చిందులాడిందో స్పష్టంగా బొమ్మ కడతాడు రచయిత. తన రచనాశక్తితో, శైలితో, సామర్థ్యంతో సమర్థవంతంగా నడిపిన తీరు పాఠకుడిని ఏకబిగిన నవలను అమాంతం చదివిస్తుంది. నవల మొత్తం రచయిత వాడిన మోరుసునాడు యాస, భాష నవలకు అదనపు సింగారాన్ని, సొగుసును చేకూర్చింది. నవలలోని చాలా పదాలు తెలుగు సాహితీ నిఘంటువుల్లో చేర్చదగినవి. అర్థాలు తెలుసుకోదగినవి. మనసులో ఇంకిపోయి మనసును శుద్ధి చేసే వొడేసేట్ల గుంట నీరు లాంటిది.
పెద్దబ్బి భార్య బూలచ్చిని ఆధిపత్య కామహంకారుడు రాజయ్య చెడిపి చంపితే, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో తప్పంతా తమదేనని ఒప్పుకున్న పాపులమ్మ ఒకపక్క ఏడుస్తాంటే, చంపింది ఎవరని తెలిసినా ఏమిచేయలేని తనంతో బాధపడిపోయి, భార్యమీదున్న ప్రేమతో తాను చనిపోయిన పెద్దబ్బి మరణం యింకో పక్క ఏడపిస్తుంటే, వీరిమధ్య నేదర బిడ్డప్పుడే అనాధగా మిగిలిన చిన్నమ్మి బాధపెడుతుంది. నిజాన్ని చిన్నమ్మికి తెలియకుండా దాచేస్తూ వచ్చిన చిన్నాయిన బోడెన్న. బతుకు పోరులో కడుపు కోతతో అడవుల్లో కాయకష్టం చేసే చిన్నమ్మి, తల్లిని మంటుబెట్టిన రాజయ్య కొడుకు ఆనందుడుతో ప్రేమలో పడి, ఆ తర్వాత కొంత కాలానికి జరిగిన సంగతి తెలిసి రాజయ్యని ఏం చేస్తుంది? ఆనందుడుపై ప్రేమతో తల్లిని చంపిన రాజయ్యను వదిలేస్తందా? లేదా చిన్నమ్మి కన్నియమ్మగానో, కాళీ మాతగానో మారి వధించిందా? చిన్నమ్మి ఆనందుడు కలుస్తారా? చిన్నమ్మి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న లింగాల మేక ఏమవుతుంది? చిన్నమ్మినే తనకున్న ఏకైక దిక్కుగా భావించిన పాపులమ్మ ఎలా బతుకుతాది? అనేదే నవల. ఇదంతా తెలియాలంటే పాయి దరువులు నవల చదవాల్సిందే. మూల వాసుల గోసను, యానాది గుడిసెల గాయాల వెతలను కథలు కథలుగా వినాల్సిందే.
ఈ నవల చదివిన తర్వాత ఒక మంచి ప్లె ప్రేమను సినిమాగా చూసినంత తప్తినిస్తుంది. యానాది జీవితాల పట్ల స్పష్టమైన అవగాహనను తెప్పిస్తుంది. చిన్నమ్మి ప్రేమ, ప్రాణ త్యాగాలు మనల్ని వెంటాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదివాసీ గిరిజన నవలా సాహిత్యంలో మైలు రాయిగా ఈ నవలను పేర్కొనవచ్చు. గొప్ప చేర్పుగా భావించొచ్చు. రచయిత కె .వి. మేఘనాథ్‌ నుంచి మరిన్ని రచనలు రావాలని కోరుకుందాం.
– గిడ్డకింద మాణిక్యం, 9492164107

Spread the love