దుఃఖ సాగరం!

Ocean of sorrow!ప్రేమసాగరాల్లో ఓలలాడే ప్రేమికుల్ని చూస్తే
నాలో విస్మయం విరబూస్తోంది.
నే పూలడిగితే ముళ్ళదండని మెడకి తొడిగారు.

ఆనందపు అంచులకై చూపుల్ని ఎగదోసినప్పుడు,
నాకు దుఃఖపు దుమ్మురేణువులు దర్శనమిచ్చాయి.
నే వలపుగీతికలకై కాంక్షించినప్పుడు,
చల్లని నిట్టూర్పుల్లో ముక్కు చీదపట్టాను.
చుట్టూరా మనసులు నా గుండె గులాబీలని
దిగులు దివిటీలో తుంచాయి.

ఏ తోడూ లేకుండా పోయిందిప్పుడు.
ఓ క్షణం నిట్టూర్చి, తీవ్ర వేదనల్లోంచి విడివడ్డాను.
అయినా, పిచ్చోళ్ళ చెయ్యట్టుకునే సమయం ఎవరికీ ఉండదు.
నా నీడని నేనే తరచూ అపరిచితంగా పరికిస్తాను.

మీరు దీన్నే జీవితమంటే నేనిలానే జీవిస్తాను.
ఒక్క మాటైనా మారు పలకకా, నా కన్నీళ్ళనే తాగుతాను.
దుఃఖసంద్రాల్లో ఈదుతున్న నాకు,
పిల్లకాలువంటి ఈ దుఃఖానికే భయమేస్తుందా?

(మూలం : ప్యాసా (1957) చిత్రం నుండి సాహిర్‌ లుధియాన్వి అందించిన సాహిత్యం)

అనువాదం : బాలాజీ పోతుల,
8179283830

Spread the love