జల వివాదాల పరిష్కారానికిసమన్వయ సమావేశాలు
నదుల అనుసంధానంతో నీటి కొరతకు చెక్
సదరన్ జోనల్ కమిటీ సమావేశంలో అమిత్ షా
చెన్నై : దేశాభివృద్ధిలో దక్షిణ భారత్ అత్యంత కీలక ప్రాంతమని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన గురువారం ప్రసంగిస్తూ సాహిత్యం, పరిశోధన-అభివృద్ధి, అంతరిక్షం, ఐటీ, ఏఐ, పారిశ్రామికాభివృద్ధి, వ్యవసా యం..ఇలా అన్ని రంగాలలోనూ దక్షిణ ప్రాంతం సహకా రాన్ని అందిస్తోందని కొనియాడారు. ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా రంగాలు, మౌలిక సాదుపాయాల అభివృద్ధిలో దక్షిణ భారతదేశం కీలక పాత్ర పోషించిందని, అందుకే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశాభివృద్ధిలో దక్షిణ భారత్‌ను అతి పెద్ద భాగస్వామిగా నిలిపేందుకు అధిక అక్షరాస్యతా రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంలో సాంకేతికత ఉపకరించాయని వివరించారు. ఆవిష్కరణలు, ఆదాయ వనరుల పెంపు రంగాలలో భారతదేశం దక్షిణాది నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని అమిత్ షా ప్రస్తావించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడి భారత్ అభివృద్ధి సాధించాలంటే ప్రతి రాష్ట్రం తన వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ప్రాంతీయ మండలిని ఓ అర్థవంతమైన వేదికగా మార్చేందుకు 2014 నుంచి కృషి జరుగుతోందని చెప్పారు. గతంలో ఏడాదికి సగటున రెండున్నర సమావేశాలు మాత్రమే జరిగేవని, ఇప్పుడు ఆరు జరుగుతున్నాయని తెలిపారు.
వీటిలో సుమారు 80 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పుకొచ్చారు. అరవై సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ పురోగతికి మూలస్తంభాలనీ, వాటి అభివృద్ధి నీటి లభ్యత పైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. నీటి పంపిణీలో ఏ రాష్ట్రమైనా తన ప్రయోజనాలు కాపాడుకోవడంలో తప్పు లేదని, అయితే నీరు వృథాగా సముద్రంలో కలసిపోతున్నా రాష్ట్రాలు మాత్రం సంవత్సరాల తరబడి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల ప్రయోజనం ఏముంటుందని అమిత్ షా ప్రశ్నించారు. బ్రహ్మపుత్ర నుంచి కావేరీ, గోదావరి వరకూ ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా రాబోయే వంద సంవత్సరాలలో దేశంలో నీటి కొరత లేకుండా చేయవచ్చునని అన్నారు. నదుల అనుసంధానంతో అనేక జలమార్గాలు కూడా ఏర్పడతాయని, దీనివల్ల ఇంధన ఆదా, పర్యావరణ పరిరక్షణతో పాటు తక్కువ ఖర్చుతో రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వివరించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసి సమావేశాలు నిర్వహించుకుంటే జల వివాదాలను త్వరగా పరిష్కరించుకోవచ్చునని చెప్పారు.
మహిళలు, చిన్నారులపై జరిగే లైంగికదాడులకు సంబంధించిన కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదనీ, అలాగే ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టుల ద్వారా లైంగికదాడులు, పోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అమిత్ షా అన్నారు. పోషకాహారలోపం, చిన్నారులలో ఎదుగుదల లోపం, డ్రాపౌట్లు వంటి సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉన్నదని చెప్పారు. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకోవాలంటే కేంద్ర, రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖలు ఆ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని అమిత్ షా పిలుపునిచ్చారు.



