మహబూబాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో సోయంరాజు 

– జాతి మెచ్చిన నాయకుడికి జనం నీరాజనం
– ఆళ్ళపల్లి, గుండాల మండలాల్లో కలియతిరిగిన సోయం రాజు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి/గుండాల 
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న నేపథ్యంలో జాతి మెచ్చిన యువ నాయకుడు సోయం రాజుకు ఉమ్మడి ఆళ్ళపల్లి, గుండాల మండలాల్లోని ఆదివాసీ ప్రజలు గ్రామ గ్రామాన నీరాజనం పలికారు. ఈ మేరకు ఆయన రెండు మండలాల్లో బుధవారం వరకు రెండు రోజుల పాటు కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు మండల కేంద్రాలతో పాటు మర్కోడు, మామకన్ను, అనంతోగు, తూరుబాక, ముత్తాపురం, లింగగూడెం, నర్సాపురం, సాయనపల్లి, పెద్ద, చిన్న వెంకటాపురం, దామరతోగు, శెట్టపల్లి, తదితర గిరిజన గ్రామాల్లో ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను సమన్వయం చేస్తూ ప్రచారం జరిగిందన్నారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిరిజన జాతి అస్తిత్వం కొరకు సుమారు గత 12  సంవత్సరాలుగా తన వ్యక్తిగత జీవితాన్ని వదిలి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన వాడవాడన తిరగుతున్నట్లు చెప్పారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆదివాసి చట్టాలు, హక్కులు ప్రజలకు చేరేలా అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. దానికి గాను వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆదివాసీ తెగలను కూడా సమన్వయం చేయడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో సైతం ఆదివాసీ పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు అహర్నిశలు కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. నిత్యం ప్రజా జీవిత క్షేత్రంలో ఉండే ప్రజా నాయకుడు, స్వతహాగా విద్యావంతుడు, మేధావి, యువ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆదివాసీ జాతీయ సంఘాల సమన్వయకర్త, ఆదివాసీ ఇల వేల్పుల సంరక్షణ నాయకులు, ఆదివాసి ధర్మ ప్రచార నాయకులుగా అనుభవం ఉన్న సోయం కన్నా రాజును రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆళ్ళపల్లి, గుండాల మండలాల్లో భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి విషయంలోనూ జాతికి ఆదర్శంగా ఉంటూ ప్రజల కష్టాలు కన్నీళ్లను తీర్చే యువ నాయకుడికి  జాతి  అస్తిత్వానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సోయం రాజు నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలిపారు. రెండు మండలాల్లో ఆదివాసీ తెగల సమన్వయ నాయకులు సైతం రాజుకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆళ్ళపల్లి, గుండాల మండలాల ఆదివాసీ యువ నాయకులు పూనెం శ్రీను, కరుణాకరన్ నక్క, ఇర్ప ప్రకాశ్, రాధాకృష్ణ, పాయం వెంకటేశ్వర్లు, కల్తి బుచ్చయ్య, ఈసం సాంబయ్య, ఈసం శ్రీనివాస్, ఈసం నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love